
ఢిల్లీ: అమెరికా టారిఫ్‌ల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కాల్ చేశారన్న నాటో చీఫ్ మార్క్ రుటే వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తీవ్రంగా స్పందించింది. అవి పూర్తిగా నిరాధారమైనవిగా కొట్టిపారేసిన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్.. నాటో చీఫ్ వ్యాఖ్యలను ఖండించారు.
ప్రధాని మోదీ.. పుతిన్‌తో ఆ విధంగా ఎప్పుడూ మాట్లాడలేదని.. అలాంటి సంభాషణ ఏదీ జరగలేదంటూ భారత్ స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు అంగీకార యోగ్యమైనవి కావన్న రణధీర్ జైస్వాల్.. నాటో చీఫ్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. కాగా, ఉక్రెయిన్‌తో రష్యా యుద్దం విషయమై పుతిన్‌తో భారత ప్రధాని మోదీ చర్చలు జరిపారని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటె వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధించిన సుంకాల ఎఫెక్ట్ వల్లే ఇదంతా జరుగుతోందని చెప్పుకొచ్చారు.
న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో నాటో(NATO) సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మాట్లాడుతూ.. ‘భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలు రష్యాపై పెద్ద ప్రభావాన్ని చూపుతున్నాయి. పుతిన్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యూహాన్ని వివరించాలని మోదీ కోరారు. రెండు దేశాల మధ్య యుద్ధం గురించి ఆరా తీశారు. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారత్‌పై సుంకాల భారం పడటంతో పుతిన్‌తో చర్చలు జరుపుతున్నారు. భవిష్యత్ వ్యూహాల గురించి అడిగి తెలుసుకున్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. రుటె వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది.