అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేయబోతున్నారా?.. గ్రీన్‌ల్యాండ్‌ను చేజిక్కించుకోవాలనే ప్రయత్నాల్లో దూకుడు ప్రదర్శిస్తున్నారా?.ఈ క్రమంలోనే సైన్యాన్ని గ్రీన్‌ల్యాండ్‌లోకి దింపబోతున్నారా?. ఈ తరుణంలో డెన్మార్మ్ ఆందోళనలో అర్థం ఉందా?.. అసలు దీనంతటికి కారణమైన నోరాడ్ అంటే ఏంటసలు?..
గ్రీన్‌ల్యాండ్‌లోని పిటుఫిక్ స్పేస్ బేస్‌కి అమెరికా తన యుద్ధ విమానాలు పంపడం ఆర్కిటిక్ ప్రాంతంలో రాజకీయ, సైనిక ఉద్రిక్తతలకు దారి తీసింది. అగ్రరాజ్యం చర్యపై డెన్మార్క్, గ్రీన్‌లాండ్ ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిగా డెన్మార్క్ తన సైన్యాన్ని ఇప్పటికే గ్రీన్‌ల్యాండ్‌లో మోహరింపజేసింది. అయితే.. నోరాడ్ (ఉత్తర అమెరికా వైమానిక రక్షణ కమాండ్) మాత్రం ఇది రొటీన్ ఆపరేషన్స్ అంటూ చెబుతోంది.
అమెరికా సైనిక విమానాలు త్వరలో గ్రీన్‌లాండ్‌లోని పిటుఫిక్ స్పేస్ బేస్ (మునుపటి తులే ఎయిర్‌ఫోర్స్ బేస్) వద్దకు చేరనున్నాయి. దీనిని దీర్ఘకాలిక రక్షణ కార్యకలాపాల భాగంగా పేర్కొంటూ.. అమెరికా, కెనడా, డెన్మార్క్ మధ్య ఉన్న రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యమని నోరాడ్ చెబుతోంది. అయితే.. అమెరికా చర్యలను డెన్మార్క్ మాత్రం ఖండిస్తోంది.
ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక, వ్యూహాత్మక ఆధిపత్యాన్ని పెంచుకోవడం అమెరికా ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. అయితే.. తమ ఆధీనంలో ఉన్న స్వయం పాలక గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా సైనిక చర్యలకు దిగితే అది తమ సార్వభౌమాధికారాన్ని సవాలు చేయడమేనని డెన్మార్క్ భావిస్తోంది. అదే జరిగితే నాటోలో విబేధాలు తప్పవని డెన్మార్క్ ప్రధాని ఇప్పటికే ట్రంప్‌కు స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. తాజా పరిణామంతో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఏమిటీ నోరాడ్
NORAD అంటే "North American Aerospace Defense Command". ఇది అమెరికా-కెనడా కలిసి ఏర్పాటు చేసిన ద్వైపాక్షిక రక్షణ సంస్థ. దీని ప్రధాన పని ఉత్తర అమెరికా మీదకు వచ్చే విమానాలు, క్షిపణులు, అంతరిక్ష వాహనాలపై హెచ్చరికలు ఇవ్వడం.. గగనతల నియంత్రణ చేయడం, అలాగే సముద్ర మార్గాలపై పర్యవేక్షణ చేయడం. నోరాడ్ గ్రీన్‌ల్యాండ్‌లో ప్రధానంగా.. పిటుఫిక్ స్పేస్ బేస్ నుంచే తన కార్యకలాపాలు నిర్వహించుకుంటోంది. ఇది ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న అత్యంత కీలకమైన సైనిక స్థావరం కూడా. పిటుఫిక్ బేస్‌లోని రాడార్ వ్యవస్థలు రష్యా, చైనా వంటి దేశాల నుండి వచ్చే బాలిస్టిక్ మిసైల్ దాడులను ముందుగానే గుర్తించడానికి ఉపయోగపడతాయి.
గ్రీన్‌ల్యాండ్ స్వయం పాలనలో ఉన్నప్పటికీ.. విదేశాంగం, రక్షణ వ్యవహారాలు ఇంకా డెన్మార్క్ ఆధీనంలో ఉన్నాయన్నది తెలిసిందే. కాబట్టి NORAD కార్యకలాపాలకు డెన్మార్క్ అనుమతి కచ్చితంగా అవసరం. నాటో సభ్యదేశమైన డెన్మార్క్.. నోరాడ్‌లో కార్యకలాపాల్లో భాగస్వామి కూడా. ఈ మేరకు అమెరికాతో 1951లో ప్రత్యేక రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. అందుకే ఒప్పందం ప్రకారం ఇప్పుడు అమెరికా చర్యలను అడ్డుకోవడానికి లేదు. కానీ, గ్రీన్‌ల్యాండ్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నాలను మాత్రం అడ్డుకునే అవకాశం ఉంది. అదే జరిగితే.. యుద్ధం తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


