రూ.10,300 కోట్ల యూరియా ప్రాజెక్టు | Madras Fertilizers proposed 10300 cr greenfield urea complex in Chennai | Sakshi
Sakshi News home page

రూ.10,300 కోట్ల యూరియా ప్రాజెక్టు

Jan 20 2026 12:47 PM | Updated on Jan 20 2026 1:10 PM

Madras Fertilizers proposed 10300 cr greenfield urea complex in Chennai

దేశీయ ఎరువుల ఉత్పత్తి రంగంలో స్వయంసమృద్ధి సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎంఎఫ్‌ఎల్‌) భారీ విస్తరణకు చర్యలు చేపట్టింది. చెన్నైలో సుమారు రూ.10,300 కోట్ల అంచనా వ్యయంతో కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ అమ్మోనియా–యూరియా సమ్మేళన ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నుంచి తుది అనుమతుల కోసం వేచి చూస్తోంది. చెన్నైలో జరిగిన ‘పాన్ ఐఐటీ టెక్4భారత్ సమిట్ 2026’లో పాల్గొన్న సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) మనోజ్‌కుమార్ జైన్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ప్రాజెక్టు ముఖ్యాంశాలు

ఈ ప్లాంట్ ద్వారా దక్షిణ భారతదేశంలో నెలకొన్న యూరియా కొరతను అధిగమించే అవకాశం ఉందని సంస్థ భావిస్తోంది. దీని ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 13 లక్షల టన్నులు. ఈ ఎంఎఫ్‌ఎల్ సముదాయం ఉత్తర చెన్నైలోని మణాలీలో ఉంది. ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ (PDIL) రూపొందించిన ప్రీ-ఫీజిబిలిటీ నివేదికకు ఇప్పటికే బోర్డు ఆమోదం లభించింది. ‘కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును రూపొందించాం. అనుమతులు లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. ఇది దేశ ఆహార భద్రతలో కీలక పాత్ర పోషిస్తుంది’ అని మనోజ్‌కుమార్ జైన్ పేర్కొన్నారు.

రికార్డు స్థాయి ఆపరేషనల్ పనితీరు

1970లో ప్రారంభమైన పాత ప్లాంట్‌ను ప్రస్తుతం 120 శాతం సామర్థ్యంతో నడుపుతున్నట్లు జైన్ తెలిపారు. ఆధునిక సాంకేతికతతో ప్లాంట్ సామర్థ్యాన్ని మరో 10–12 శాతం మెరుగుపరిచినట్లు ఆయన వెల్లడించారు. మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (MFL) 2024–25 ఆర్థిక సంవత్సరంలో మెరుగైన ఆర్థిక ఫలితాలను సాధించింది. సంస్థ వార్షిక ఆదాయం గతంతో పోలిస్తే 14 శాతం వృద్ధిని నమోదు చేస్తూ రూ.2,542 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల సామర్థ్యం మెరుగుపడటంతో సంస్థ ఈ కాలంలో రూ.64.25 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

ఉత్పత్తి పరంగా కూడా ఎంఎఫ్‌ఎల్ సరికొత్త రికార్డులను సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 5,28,400 టన్నుల నీమ్ కోటెడ్ యూరియాను ఉత్పత్తి చేయగా, అమోనియా ఉత్పత్తి కూడా సంస్థ ఆవిర్భావం నుంచి ఎన్నడూ లేని విధంగా 3,26,260 టన్నులకు చేరింది. ముఖ్యంగా పర్యావరణ హితంగా, పొదుపుగా కార్యకలాపాలు నిర్వహించడంలో సంస్థ గణనీయమైన ప్రగతి సాధించింది. ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడం ద్వారా ఒక టన్ను ఉత్పత్తికి కేవలం 6.875 గిగా కేలరీల (Gcal) శక్తిని మాత్రమే వినియోగించింది. ఇది సంస్థ చరిత్రలోనే నమోదైన అత్యంత తక్కువ శక్తి వినియోగం కావడం విశేషం.

ఇదీ చదవండి: ఆకాశాన్నంటిన పసిడి, వెండి ధరలు.. ఎంతంటే..

కొత్త గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ఎంఎఫ్‌ఎల్ ఆదాయం పెరగడమే కాకుండా విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 2025లో జరిగిన 59వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కూడా ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను సంస్థ నొక్కి చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement