‘విశాఖ ఐటీ రాజధాని’ ఉత్తిమాటేనా? | Is akhapatnam turns IT Capital | Sakshi
Sakshi News home page

‘విశాఖ ఐటీ రాజధాని’ ఉత్తిమాటేనా?

Jul 14 2014 8:42 AM | Updated on Jul 23 2018 8:35 PM

‘విశాఖ ఐటీ రాజధాని’ ఉత్తిమాటేనా? - Sakshi

‘విశాఖ ఐటీ రాజధాని’ ఉత్తిమాటేనా?

రాష్ట్రంలో ఐటీ రంగానికి పెద్దదిక్కుగా ఉన్న విశాఖ ప్రస్తుతం భవిష్యత్తు ప్రయాణం ఎటో తేల్చుకోలేకపోతోంది.

విశాఖపట్నం: రాష్ట్రంలో ఐటీ రంగానికి పెద్దదిక్కుగా ఉన్న విశాఖ ప్రస్తుతం భవిష్యత్తు ప్రయాణం ఎటో తేల్చుకోలేకపోతోంది. నగరాన్ని ఐటీ రాజధానిగా తీర్చుదిద్దుతామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో స్పష్టత ఇవ్వకపోవడంతో కంపెనీలు గందరగోళానికి గురవు తున్నాయి. ఒకపక్క సమస్యలతో మనుగడ కష్టంగా మారగా, మరోపక్క పభుత్వం మొక్కుబడి వ్యవహారంతో అయోమయానికి గురవుతున్నాయి. కంపెనీల విస్తరణ, ఉద్యోగ నియామకాల విషయంలో ముందడుగు వేయడానికి సంశయిస్తున్నాయి. ఉన్న సంక్షోభ పరిస్థితులు చక్కదిద్దకుండా హడావుడి చేస్తుండడంతో మొదట్లో కాస్తోకూస్తో ఆశగా ఉన్న యాజమాన్యాలు క్రమక్రమంగా నిరుత్సాహానికి లోనవుతున్నాయి. సోమవారం విశాఖలో ఐటీశాఖ అత్యున్నతస్థాయి విధానపరమైన సమీక్ష జరుగుతుండడంతో తాడోపేడో తేల్చుకోవడానికి సమాయత్తమవుతున్నాయి.
 
ఐటీ రాజధానిగా చేస్తారా? 
విభజనకు ముందు హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో ఐటీ రంగంలో విశాఖది రెండోస్థానం. అక్కడ మొత్తం 2,500 కంపెనీలు పనిచేస్తుండగా,  వార్షిక టర్నోవర్ రూ.60,200 కోట్లు. విశాఖలో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న మొత్తం 70 కంపెనీల టర్నోవర్ రూ.1450 కోట్లు. కానీ విడిపోయిన తర్వాత రాష్ట్రంలో విశాఖ ఐటీ రంగం కేవలం మూడుశాతమే మిగిలింది. దీంతో విశాఖను ఐటీ రాజధానిగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం అదే పనిగా ప్రకటిస్తోంది. కానీ ఇక్కడ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లి సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రిని కలిసి సమస్యలు వివరించినా పెద్దగా స్పందన లేకపోవడంతో భవిష్యత్తుపై ఆశలు వదిలేసుకుంటున్నాయి.

ప్రస్తుతం నగరంలో 70 ఐటీ కంపెనీలు, నాలుగు ఎస్‌ఈజెడ్‌లున్నాయి. ఇవన్నీ అనేక పురిటినొప్పులు పడుతున్నాయి. ఎస్‌ఈజెడ్‌లకు కేటాయించిన భూముల్లో సగానికిపైగా కంపెనీలు నిర్మాణాలు చేపట్టకుండా భూములు ఖాళీగా ఉంచాయి. నిర్మాణం పూర్తిచేసుకున్న కంపెనీలకు అనుమతులు, మౌలిక సదుపాయాలు లేక పాడుబడ్డ భవనాలుగా మారాయి.  ఐటీకి పవర్‌హాలీడే విధిస్తుండడంతో ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయాయి. ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా ఏదో చేస్తామని యాజమాన్యాలను ఊరించే ప్రయత్నం చేస్తోంది. ఈ నెల 16న ఐటీశాఖ నుంచి మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ప్రభుత్వ ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాద్, ఐటీఈ అండ్ సీ సెక్రటరీ సంజయ్‌జాజూ, పరిశ్రమల అభివృద్ధి ఫోరం చైర్మన్ జె.ఎ.చౌదరి తదితరులు నగరానికి వస్తున్నారు.

రాష్ట్రంలో విశాఖను ఐటీ రాజధానిగా ఏవిధంగా తీర్చిదిద్దాలి? సమస్యలు? వంటివాటిపై విధానపరమైన సమీక్ష జరపనున్నారు. ఇందులో ఐటీ సమస్యలను ఏకరువుపెట్టడానికి కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇక్కడ ఐటీ కంపెనీల సమావేశాలు, ఇతరత్రా అవసరాలను తీర్చేందుకు రూ.20 కోట్లతో చేపట్టిన ఇంక్యుబేషన్ సెంటర్ రెండేళ్లవుతున్నా నిర్మాణం పూర్తవలేదు. రెండో ఇంక్యుబేషన్ కేంద్రానికి మరో రూ.23 కోట్లు నిధులు సిద్ధంగా ఉన్నా భూములే లేవు. దీనిపై కంపెనీల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నాయి.

ఐటీ కంపెనీలకు కనీసం బస్సు సౌకర్యం, తాగునీటి వసతి ఇలా ప్రాథమికంగా ఏవీ లేవు. ముందు ఈ సౌకర్యాలు కల్పించి ఆ తర్వాత ఐటీ రాజధానిగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేయనున్నట్లు రుషికొండ ఐటీ పార్క్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఒ.నరేష్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. రూ.50 వేల కోట్లతో 10వేల ఎకరాల్లో విశాఖకు ఐటీఐఆర్ వస్తుందని గత ప్రభుత్వంతోపాటు సీఎం చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే 4 వేల ఎకరాల భూములు కూడా సిద్ధం చేసి ఉంచారు. ఐటీఐఆర్‌ను ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇప్పుడు ఈ భూములను వెనక్కి తీసుకుని వేరే కంపెనీలకు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది. దీనిపైనా తాము ప్రశ్నిస్తామని నరేష్‌కుమార్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement