ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం
వాషింగ్టన్: మీడియా సంస్థలతో అమెరికా అధ్యక్షుడి గిల్లికజ్జాలు కొనసాగుతూనే ఉన్నాయి. సీఎన్‌ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో ఛానళ్లు వైట్‌హౌస్‌లో ప్రవేశించకుండా విధించిన నిషేధం న్యాయస్థానాల జోక్యంతో తొలగిపోగా.. తాజాగా ట్రంప్ సీఎన్‌ఎన్ ప్రతినిధులు తన అధికారిక విమానం ‘ఎయిర్ ఫోర్స్ వన్’లోకి ఎక్కకుండా అడ్డుకున్నారు. అమెరికా అధ్యక్షుడి కార్యక్రమాల చిత్రీకరణ ప్రసారానికి సంబంధించి ఆ దేశ టీవీ ఛానళ్లు ఒక ఏర్పాటు చేసుకున్నాయి. దీన్ని వైట్‌హౌస్ టీవీ ప్రెస్ పూల్ అని పిలుస్తూంటారు.
సీఎన్‌ఎన్, ఏబీసీ, సీబీఎస్, ఎన్‌బీసీ, ఫాక్స్ న్యూస్ ఛానళ్లలో ఒకటి అధ్యక్షుడి కార్యక్రమాలను చిత్రీకరిస్తే.. మిగిలిన సంస్థలు ఆ వీడియో ఫీడ్‌ను వాడుకుంటూంటాయి. ఇది వంతులవారీగా జరుగుతూంటుంది. దీని ప్రకారం శనివారం టెన్నసీలోని నాక్స్‌విల్లేలో జరగాల్సిన ట్రంప్ కార్యక్రమాలను సీఎన్‌ఎన్ చిత్రీకరించాల్సి ఉంది. అయితే ప్రభుత్వ అధికారులు ఎయిర్‌ఫోర్స్ వన్‌లో సీఎన్‌ఎన్ ప్రతినిధులు లేకుండానే వెళ్లిపోయారు. సీఎన్‌ఎన్ స్థానంలో వైట్‌హౌస్ ప్రెస్ పూల్‌లో భాగం కానీ రియల్ అమెరికాస్ వాయిస్ న్యూస్ ట్రంప్ కార్యక్రమాలను ప్రసారం చేసింది. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో సీఎన్‌ఎన్ ప్రవేశాన్ని నిషేధించారన్న వార్తను మొట్టమొదట వాషింగ్టన్ పోస్టు బట్టబయలు చేసింది.


