బంతి అమెరికా కోర్టులో.. ఇరాన్‌ నెక్స్ట్‌ మూవ్‌ ఏంటి? | Trump Rejects Iran's Peace Plan: What Will Tehran Do Next? | Sakshi
Sakshi News home page

బంతి అమెరికా కోర్టులో.. ఇరాన్‌ నెక్స్ట్‌ మూవ్‌ ఏంటి?

Sep 26 2026 12:26 PM | Updated on Sep 26 2026 12:38 PM

Trump Rejects Iran's Peace Plan: What Will Tehran Do Next?

ఇరాన్‌–అమెరికా యుద్ధానికి తెరపడుతుందన్న ఆశలు మళ్లీ ఆవిరవుతున్నాయా? హర్ముజ్‌ జలసంధిని ఏడు రోజుల్లో తెరిచి.. యుద్ధాన్ని నిలిపివేసేందుకు ఇరాన్‌ ప్రతిపాదించిన ప్లాన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తిరస్కరించాడనే కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఇదే నిజమైతే.. ఇప్పుడు ఇరాన్‌ తదుపరి అడుగు ఏంటి? హర్ముజ్‌ పరిస్థితి ఎలా మారుతుంది? యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాల్చుతుందా?.. 

ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ వేదికగా ఇరాన్‌ తన ప్రతిపాదనను అమెరికా ముందుంచింది. ఖతార్‌ మధ్యవర్తిత్వంతో ఈ ప్రతిపాదనను వాషింగ్టన్‌కు పంపినట్లు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ తెలిపారు. అమెరికా అంగీకరిస్తే ఏడు రోజుల కౌంట్‌డౌన్‌ మొదలై.. హర్ముజ్‌ జలసంధిలో సాధారణ నౌకాయానం పునరుద్ధరించవచ్చని చెప్పారు. అదే సమయంలో ప్రాంతీయంగా అన్ని రంగాల్లో పోరాటాన్ని నిలిపివేసి విస్తృత చర్చలకు వెళ్లొచ్చని ప్రతిపాదించారు.

అయితే ఇందుకు ప్రతిగా అమెరికా ఇరాన్‌ పోర్టులపై దిగ్బంధాన్ని ఎత్తివేయాలని, స్తంభింపజేసిన ఇరాన్‌ నిధులను విడుదల చేయాలని, చమురు ఆంక్షలను తొలగించాలని ఇరాన్‌ కోరుతోంది. అణు కార్యక్రమంపై మాత్రం తమ హక్కుల్లో ఎలాంటి రాయితీ ఇవ్వబోమని ఇరాన్‌ వర్గాలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా యురేనియం శుద్ధి విషయంలో రాజీ ఉండదని తెలిపాయి.

ట్రంప్‌ తిరస్కరిస్తే.. తర్వాత?
‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ కథనం ప్రకారం.. ఇరాన్‌ తన డిమాండ్లను అంగీకరిస్తుందన్న నమ్మకం ట్రంప్‌కు లేదని, తిరిగి బాంబుల దాడి చేసే అవకాశం ఉందని ఆయన తన సిబ్బందితో చెప్పినట్లు అమెరికా అధికారులు పేర్కొన్నారు. మరో నివేదిక ప్రకారం.. నవంబర్‌లో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత బాంబుల దాడులు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాన్ని ట్రంప్‌ అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. గతంలోనూ చర్చల ప్రయత్నాలు విఫలమై.. కొంతకాలం కాల్పుల విరమణ తర్వాత మళ్లీ దాడులు జరిగిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

హర్ముజ్‌ సంగతేంటి?
ఇరాన్‌ ప్రతిపాదనలో కీలక అంశం హర్ముజ్‌ జలసంధి. ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటైన ఈ జలసంధి ద్వారా రవాణా తీవ్రంగా దెబ్బతినడంతో ఇప్పటికే ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడింది. అమెరికా–ఇరాన్‌ మధ్య ఒప్పందం కుదరకపోతే హర్ముజ్‌ పరిస్థితి మరింత కాలం అనిశ్చితంగానే కొనసాగే అవకాశం ఉంది. ఇరాన్‌ మాత్రం అమెరికా తమపై సైనిక ఒత్తిడి తగ్గించి, పోర్టుల దిగ్బంధాన్ని ఎత్తివేస్తే ఏడు రోజుల్లో జలసంధిని తిరిగి తెరవడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతోంది. అంటే ఇప్పుడు బంతి అమెరికా కోర్టులోనే ఉందన్నది ఇరాన్‌ వాదన.

ఇరాన్‌ ముందున్న దారులేంటి?
అమెరికా తన ప్రతిపాదనను అంగీకరించకపోతే ఇరాన్‌ ముందున్న మార్గాలు ప్రధానంగా మూడు. మొదటిది.. దౌత్య మార్గాన్ని కొనసాగిస్తూ ఖతార్‌, ఒమన్‌ వంటి మధ్యవర్తుల ద్వారా చర్చలను ముందుకు తీసుకెళ్లడం. రెండోది.. హర్ముజ్‌ జలసంధిపై తన నియంత్రణను కొనసాగిస్తూ అమెరికాపై ఒత్తిడి పెంచడం. అయితే ఇది ప్రపంచ ఇంధన సరఫరాపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఇరాన్‌కూ ఆర్థిక, దౌత్యపరమైన ఒత్తిళ్లు పెరగొచ్చు. మూడోది.. అమెరికా సైనిక చర్యలకు ప్రతిస్పందిస్తూ ప్రాంతీయంగా తన మిత్ర బలగాల ద్వారా ఒత్తిడి పెంచడం. కానీ ఈ మార్గం యుద్ధం మరింత విస్తరించే ప్రమాదాన్ని పెంచుతుంది. మరోవైపు ఏడు రోజుల ప్రతిపాదనను ముందుకు తెచ్చిన ఇరాన్‌.. హర్ముజ్‌ను తిరిగి తెరవడం, కాల్పుల విరమణ, తదుపరి అణు చర్చలను ఒకే ప్యాకేజీగా మలచాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. అందువల్ల అమెరికా స్పందన ఆధారంగా ఈ మూడు మార్గాల్లో ఏది ముందుకు వస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

మరోవైపు సౌదీపై హౌతీల దాడులు
ఇదిలా ఉండగా.. ఇరాన్‌ మద్దతుగల యెమెన్‌ హౌతీలు సౌదీ అరేబియాపై దాడులు కొనసాగిస్తున్నారు. రియాద్‌ వైపు వచ్చిన రెండు డ్రోన్లను, ఖమీస్‌ ముషైత్‌ వైపు ప్రయోగించిన బాలిస్టిక్‌ క్షిపణిని అడ్డుకున్నట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణం తెలిపింది. ఈ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా భద్రతకు మద్దతుగా పాకిస్థాన్‌, టర్కీ రక్షణాధికారులు రియాద్‌లో సమావేశమై భద్రతా పరిస్థితిపై చర్చించారు.

ఇరాన్‌ ప్రతిపాదనకు అమెరికా స్పందన ఎలా ఉండబోతోంది? ట్రంప్‌ వైఖరి నేపథ్యంలో హర్ముజ్‌ జలసంధి తిరిగి తెరుచుకుంటుందా? లేదంటే పశ్చిమాసియాలో పోరాటం మళ్లీ ముదురుతుందా? అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ఇరాన్‌ ఏడు రోజుల గడువుతో శాంతి ప్రతిపాదనను ముందుకు తెచ్చిన నేపథ్యంలో.. తదుపరి నిర్ణయం అమెరికా చేతుల్లోనే ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: ట్రంపరితనంతో మళ్లీ బాంబుల మోతేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement