ఉచితంగా 20 వేల విమాన టికెట్లు.. ఫ్రీ ఆఫర్! | IndiGo Offer 20000 Free Tickets | Sakshi
Sakshi News home page

ఉచితంగా 20 వేల విమాన టికెట్లు.. ఫ్రీ ఆఫర్!

Aug 5 2026 2:52 PM | Updated on Aug 5 2026 3:22 PM

IndiGo Offer 20000 Free Tickets

దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) వాణిజ్య కార్యకలాపాల్లో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ మైలురాయిని పురస్కరించుకుని ప్రయాణికులకు భారీ గిఫ్ట్ ప్రకటించింది. దేశీయ విమాన ప్రయాణికుల కోసం ఏకంగా 20,000 ఉచిత టికెట్లను అందించే ప్రత్యేక వార్షికోత్సవ ప్రచారాన్ని ప్రారంభించింది. ‘హ్యాపీ ఇండిగో డే’ వేడుకల్లో భాగంగా ‘ఇండిగో ఫ్రీ’ పేరుతో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది.

గౌహతి మీదుగా తొలి విమానం

2006 ఆగస్టు 4న ఢిల్లీ నుంచి ఇంఫాల్‌కు గౌహతి మీదుగా తొలి విమాన సర్వీసును నడపడం ద్వారా ఇండిగో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. అప్పట్లో ఒకే రూట్‌తో సేవలు ప్రారంభించిన సంస్థ.. ఇప్పుడు దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో విస్తృత నెట్‌వర్క్‌ను నిర్వహించే అతిపెద్ద విమానయాన సంస్థగా ఎదిగింది.

2026 ఆర్థిక సంవత్సరంలో ఇండిగో 12.3 కోట్లకు పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ప్రస్తుతం దేశ విమానయాన సామర్థ్యంలో సుమారు 51 శాతం వాటాను కలిగి ఉంది. ముఖ్యంగా నాన్-మెట్రో నగరాలకు విమాన కనెక్టివిటీని విస్తరించడంలో ఇండిగో కీలక పాత్ర పోషించింది.

రూ.10 వేల వరకు రీఫండ్

వార్షికోత్సవం సందర్భంగా ప్రకటించిన ‘ఇండిగో ఫ్రీ’ ఆఫర్‌ కింద అర్హత పొందిన ప్రయాణికులకు వారి టికెట్ ఛార్జీని గరిష్ఠంగా రూ.10,000 వరకు రీఫండ్ చేయనున్నారు. ఈ ఆగస్టు 4 నుంచి ఆగస్టు 6 వరకు ఇండిగో అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్, ఏఐ వర్చువల్ అసిస్టెంట్ 6ఎస్కై వంటి ప్రత్యక్ష బుకింగ్ ఛానెళ్ల ద్వారా చేసే దేశీయ విమాన బుకింగ్స్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ఆఫర్ వ్యవధిలో టికెట్లు బుక్ చేసుకున్న వారిలో అర్హత కలిగిన ప్రయాణికులను యాదృచ్ఛికంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఈమెయిల్, వాట్సాప్ ద్వారా సమాచారం పంపుతారు. అనంతరం ఒక సాధారణ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. సరైన సమాధానం ఇచ్చిన వారికి రూ.10,000 వరకు బుకింగ్ ఛార్జీని తిరిగి చెల్లిస్తారు.

ఏ బుకింగ్స్‌కు వర్తిస్తుంది?

ఈ ఆఫర్ కింద వన్-వే, రిటర్న్ జర్నీలతో పాటు దేశీయ ఎకానమీ క్లాస్, ఇండిగోస్ట్రెచ్ బుకింగ్స్‌కు అవకాశం ఉంది. ఎంపికైన ప్రయాణికులకు రీఫండ్ మొత్తాన్ని మూడు నుంచి ఐదు పనిదినాల్లో ప్రాసెస్ చేస్తామని సంస్థ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement