ఇకపై యాక్సిడెంట్లకు ఛాన్సే లేదు! | India V2V Tech Mandate How Vehicles Talking to Each Other Will End Accidents | Sakshi
Sakshi News home page

ఇకపై యాక్సిడెంట్లకు ఛాన్సే లేదు!

Aug 5 2026 2:22 PM | Updated on Aug 5 2026 2:33 PM

India V2V Tech Mandate How Vehicles Talking to Each Other Will End Accidents

భారత రహదారులపై ప్రమాదాల నివారణకు రవాణా రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చర్యలు చేపడుతోంది. వాహనాలు తమలో తాము సమాచారాన్ని మార్పిడి చేసుకునే ‘వెహికల్-టు-వెహికల్’ (వీ2వీ) కమ్యూనికేషన్ వ్యవస్థను తప్పనిసరి చేస్తూ ఇటీవల ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రపంచంలోనే భారత్‌లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఉంటున్న తరుణంలో ఈ నిర్ణయం కీలకంగా మారనుంది.

ఈ సాంకేతికత ఎలా పనిచేస్తుంది?

సీ-వీ2ఎక్స్ (C-V2X) సాంకేతికతపై ఆధారపడిన ఏఐఎస్‌-230 ప్రమాణాలతో వీ2వీ వ్యవస్థలు పనిచేస్తాయి. వాహనంలో అమర్చే ఆన్-బోర్డ్ యూనిట్ల ద్వారా వాహనం వేగం, ప్రయాణ దిశ, బ్రేకింగ్ సమాచారం వంటి వివరాలు రేడియో తరంగాల రూపంలో సమీపంలోని ఇతర వాహనాలకు ప్రసారమవుతాయి. దీనికోసం టెలికాం శాఖ 5.875 GHz-5.925 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను కేటాయించింది.

ఈ వ్యవస్థలోని ప్రధాన ప్రయోజనం ఏంటంటే.. ఇది డ్రైవర్ కంటికి లేదా కెమెరా/రాడార్ ఆధారిత ఏడీఏఎస్‌ వ్యవస్థలకు కనిపించని ప్రమాదాలను కూడా ముందుగానే గుర్తిస్తుంది. ఉదాహరణకు, ముందస్తుగా మలుపుల్లో ఎదురొచ్చే వాహనాలు, అకస్మాత్తుగా బ్రేక్ వేసే వాహనాలు, రాంగ్ రూట్‌లో వచ్చే డ్రైవర్లు లేదా అత్యవసర వాహనాల (అంబులెన్సులు) రాకను కొన్ని మిలీసెకన్ల వ్యవధిలోనే డ్రైవర్‌కు హెచ్చరికల రూపంలో తెలియజేస్తుంది.

రెండు దశల్లో అమలు ప్రణాళిక

  • అక్టోబర్ 1, 2027.. వీ2వీ అమర్చిన వాహనాలు కచ్చితంగా ఏఐఎస్‌-230 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి (ఆప్షనల్‌).

  • అక్టోబర్ 1, 2028 వరకు L (ద్విచక్ర, త్రిచక్ర), M (కార్లు, బస్సులు), N (లారీలు, ట్రక్కులు) కేటగిరీల కొత్త వాహనాలన్నింటికీ వీ2వీ అమలు చేయాలి.

భవిష్యత్తు రవాణాకు పునాది

ప్రస్తుతం ఆటోమొబైల్ తయారీదారులు, టెలికాం నిపుణులకు తగినంత సమయం ఇచ్చేలా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని దశలవారీగా చేపట్టింది. రహదారి మౌలిక సదుపాయాలపై ఆధారపడకుండా వాహనాల మధ్య మాత్రమే నేరుగా కమ్యూనికేషన్ జరగడం దీని ప్రత్యేకత. భవిష్యత్తులో వాహనాలు-రోడ్డు మౌలిక వసతుల మధ్య అనుసంధానం ఏర్పరచే 'ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్' (ఐటీఎస్‌) విస్తరణకు ఇది తొలి అడుగు. తయారీదారులు సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ నిబంధనలను కఠినంగా అమలు చేస్తే 2028 నాటికి భారతీయ రహదారులు అత్యంత సురక్షితంగా మారే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: మళ్లీ నింగినంటుతున్న బంగారం ధరలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement