దుర్మార్గానికి హద్దు లేదా? | Government conspiracies against Seediri Appalaraju family says ys jagan | Sakshi
Sakshi News home page

దుర్మార్గానికి హద్దు లేదా?

Jul 31 2026 5:35 AM | Updated on Jul 31 2026 6:27 AM

Government conspiracies against Seediri Appalaraju family says ys jagan

శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలుకుతున్న అశేష జనసందోహంలో ఓ భాగం

ప్రమాదాన్ని హత్యగా మార్చేస్తారా?   

చంద్రబాబువి అన్నీ దుర్మార్గపు ఆలోచనలు

నిప్పులు చెరిగిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌   

సీదిరి అప్పలరాజు కుటుంబంపై ప్రభుత్వం కుట్రలు 

రోడ్డు ప్రమాదాన్ని రాజకీయాలకు వాడుకోవడం హేయం  

టీడీపీ నేతల ప్రమాదాల్లోనూ ఇదే విధంగా వ్యవహరించారా?  

చంద్రబాబుకు యాదవులంటే ప్రేమ లేదు.. బీసీలంటేనే చులకన  

సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ సెవెన్‌ లేదు.. పథకాలన్నీ రద్దు  

మేం తెచ్చిన పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లను అమ్మకానికి పెట్టారు 

మత్స్యకారుల జీవితాలు సర్వనాశనం చేస్తున్నారు  

హామీలు నిలుపుకోలేక ప్రశ్నించే గొంతులు నొక్కుతున్నారు 

అప్పలరాజు కొడుకుపై హత్య కేసు పెట్టడం క్షమించరాని తప్పు. యాక్సిడెంట్‌ జరిగి నప్పుడు ఈ పిల్లాడు తొలుత ఫోన్‌ చేసింది 108కే. ఈ అబ్బాయికి నిజంగా చెడు ఉద్దేశం ఉంటే 108కు ఎందుకు ఫోన్‌ చేస్తాడు? బాధితుణ్ని కాపాడేందుకు సీపీఆర్‌ కూడా చేశాడు. ఆ తర్వాత ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చింది కూడా అప్పలరాజే.  

చంద్రబాబు గారూ.. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం ఉంటుందా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్లు ఎవరైనా యాక్సిడెంట్‌ చేస్తే ఇలానే చేస్తారా? వాళ్ల పిల్లలు కానీ, వారి బంధువులు కానీ యాక్సిడెంట్‌ చేస్తే, వాళ్లు కారులో ఉండగానే యాక్సిడెంట్‌ జరిగితే.. మొత్తం కుటుంబంపై ఇదే మాదిరిగా కేసులు పెట్టి, అరెస్టులు చేసి, కుట్ర కోణం, హత్య కోణం అని చెబుతారా?  

ఈ ఘటన జరిగాక యాదవ మంత్రిని ఇక్కడికి పంపించి అంత రాజకీయం చేయడం దారుణం. చంద్రబాబూ.. నీవు అసలు మనిషివా? రాక్షసుడివా? అన్నది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మనిషి అనే వాడికి మనసు ఉండాలి. ఏ ఇన్సిడెంట్‌ అయినా సరే వదలకూడదు.. దాన్ని ట్విస్ట్‌ చేయాలి.. వక్రీకరించాలి.. ఎవరినైనా నాశనం చేయాలి.. అన్న ఆలోచన నీది. నీ రాజకీయ అవసరాల కోసం అలా ఆలోచించడం దుర్మార్గం అనిపించడం లేదా?   

చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు. చేసేవన్నీ మోసాలు. వీటిపై ఎవరైనా ప్రశ్నిస్తే.. ప్రశ్నించే గొంతులు ఎక్కడైనా కనిపిస్తే వాళ్లని ఇబ్బంది పెట్టడం మామూలైంది. ప్రశ్నించే గొంతు లేకుండా చేయడం కోసం వాళ్ల మీద తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు. అలా వాళ్ల జీవితాలు నాశనం అవుతాయన్న కనీస జ్ఞానం లేకుండా చెలగాటాలు. ఇవీ చంద్రబాబు ప్రభుత్వంలో మనం చూస్తున్న వాస్తవాలు.  – మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అనుకోని పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్‌ చేస్తే, దాన్ని హత్య కేసుగా మార్చడం అత్యంత హేయమని, చంద్రబాబు దిగజారిన దారుణ రాజకీయాలకు నిదర్శనమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఆ కేసులో మాజీ మంత్రి అప్పలరాజును ఇరికించి జైలుకు పంపడం ఆ కుటుంబంపై చంద్రబాబు కూటమి ప్రభుత్వ కుట్రను తేటతెల్లం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు చేసిన రోడ్డు ప్రమాదాల్లో కూడా ఇలాగే వ్యవహరించారా.. అని సూటిగా ప్రశ్నించారు. 

అప్పలరాజు కుటుంబానికి పార్టీ పరంగా పూర్తి అండగా ఉంటామని, ఈ కేసులో న్యాయమే గెలుస్తుందని చెప్పారు. ఈ ప్రభుత్వంపై ఇంకా గట్టిగా పోరాడతామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా అంపోలు వద్ద జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు గురువారం ఆయన ఇక్కడకు వచ్చారు. అక్కడే ఉన్న అప్పలరాజు భార్య, ఇద్దరు కుమారులను ఓదార్చారు. అప్పలరాజుకు న్యాయం జరుగుతుందని, న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, ఆయన త్వరలోనే బయటకు వస్తారని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం జైలు వద్ద మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..  

యాక్సిడెంట్‌ను ట్విస్ట్‌ చేసి.. కుట్ర  
‘ఒక ఘటనను ఏ మాదిరిగా ట్విస్ట్‌ చేస్తున్నారో చూడండి. కనీసం మానవతా విలువలు లేకుండా, మంచితనం అన్నదానికి పూర్తిగా పాతర వేస్తూ, ఈ పిల్లాడిపై కుట్ర చేశారు. తనకు కేవలం 18 ఏళ్లు. ఒక నెల కిందట ‘నీట్‌’ పరీక్ష రాశాడు. వాళ్ల నాన్న మాదిరిగా తాను కూడా ఒక మంచి డాక్టర్‌ కావాలని ఆరాట పడుతున్నాడు. పొరపాటున ఓ యాక్సిడెంట్‌ జరిగితే, దానిని ట్విస్ట్‌ చేసి.. అందులో కుట్ర కోణం యాడ్‌ చేసి, హత్య చేశాడని కేసు పెట్టారు. హత్యాయత్నం నుంచి హత్య చేశాడని కేసును ట్విస్ట్‌ చేశారు. 

అలా అప్పలరాజు కుటుంబాన్ని వేధించడం ఎంత వరకు ధర్మం? సమాజంలో ప్రతి ఒక్కరు దీనిపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. యాక్సిడెంట్‌ అనేది ఉద్దేశ పూర్వకంగా చేసేది కాదు. 45 ఏళ్ల గొర్రెల కాపరి రోడ్డు మీద గొర్రెలను తోలుకుంటూ పోతుండగా బైక్‌ యాక్సిడెంట్‌ జరిగింది. ఇందులో కుట్ర కోణం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది హత్య అవుతుందా? ఈ పిల్లాడికి ఆ మనిషి ఎవరో కనీస పరిచయం కూడా లేదు. అతడు పాదచారి మాత్రమే. దురదృష్టవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదాన్ని పట్టుకుని, ఈ పిల్లాడి జీవితం నాశనం చేయాలన్న ఆలోచన చేయడం ఎంత వరకు ధర్మం? ఇది కరెక్టేనా?  

రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యం 
అప్పలరాజు బీసీల్లో ఒక మంచి నాయకుడు కాబట్టి, ఆయన వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకుడు కాబట్టి ఇలా వేధిస్తున్నారు. నిజంగా, ఒక పిల్లాడు చేసిన యాక్సిడెంట్‌ను ఒక కుట్రగా, హత్యగా చిత్రీకరించి.. అప్పలరాజు కుటుంబాన్ని కేసులో ఇరికించే ప్రయత్నం చేయడం ఎంత మటుకు ధర్మం అనేది అందరూ ఆలోచించాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే.. ఎల్లో మీడియాలో ఒక కట్టుకథ రాయిస్తారు. దానికి యాంగిల్స్, వక్రీకరణ, ట్విస్టింగ్, మసాలాలు అన్నీ కలిపి, తర్వాత టీడీపీ సోషల్‌ మీడియా దాన్ని అందుకుంటుంది. దాన్ని చివరకు పోలీసులు కేసుగా మార్చేస్తారు. ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ ఫైవ్, ఒక చంద్రబాబు, ఓ లోకేశ్, వీళ్లకి సంబంధించిన గవర్నమెంట్, వీళ్లకి సంబంధించిన పోలీసులు.. ఇదొక మాఫియా సామ్రాజ్యం.  

అప్పలరాజు బీసీ నాయకుడు కాబట్టే.. 
అప్పలరాజు 10వ తరగతిలో రాష్ట్రంలోనే ఫస్ట్‌ ర్యాంకర్‌. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవార్డు కూడా ఇచ్చాడు. చదువుల్లో ఆ స్థాయికి పోయిన వ్యక్తి.. తన సొంత కష్టం మీద డాక్టర్‌ అయ్యాడు. లోకేశ్‌ మాదిరి డొనేషన్‌ కట్టి స్టాన్‌ఫోర్డ్‌లో సీటు తెచ్చుకోలేదు. ఎండీ కూడా చేశాడు. అంటే మెడిసిన్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌. ఒక మంచి డాక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత వైఎస్సార్‌సీపీ తరఫున టికెట్‌ ఇస్తే, ప్రజల ఆశీర్వాదాలతో ఎమ్మెల్యే అయ్యాడు.  మంత్రిగా కూడా పని చేశాడు.  

సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఇంతగా ఎదిగిన ఆయన వ్యక్తిత్వ హననం కోసం, ఒక తప్పుడు కేసు పెట్టారు. ఒక యాక్సిడెంట్‌ను కుట్రగా, హత్యగా వక్రీకరించారు. ఆయన కెరీర్‌ను నాశనం చేయాలన్న దుర్మార్గపు ఆలోచన. ఆ దుర్మార్గపు ఆలోచనల్లో కనీసం ఈ 18 ఏళ్ల పిల్లోడి జీవితం నాశనం అవుతుందని కూడా చంద్రబాబు ఆలోచించ లేదు. 80 ఏళ్ల వయసు వస్తోన్న ఈ మనిషి అన్నం తింటున్నాడా? లేక గడ్డి తింటున్నాడా? అని అడుగుతున్నా. ఇది రాజకీయాలను ఒక నీచమైన స్థాయికి తీసుకుపోవడం.  

ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా? 
ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం ఉంటుందా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్లు ఎవరైనా యాక్సిడెంట్‌ చేస్తే.. వాళ్ల పిల్లలు కానీ, వారి బంధువులు కానీ యాక్సిడెంట్‌ చేస్తే, వాళ్లు కారులో ఉండగానే యాక్సిడెంట్‌ జరిగితే.. మొత్తం కుటుంబంపై ఇదే మాదిరిగా కేసులు పెట్టి, అరెస్టులు చేసి, కుట్ర కోణం, హత్య కోణం అని చెబుతారా? అని చంద్రబాబును అడుగుతున్నా. 

ఇచ్ఛాపురం ఎమ్మెల్యే స్వయంగా కారులో ఉండగానే కారు ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన ఇదే శ్రీకాకుళం జిల్లాలో 2024 డిసెంబరు 31న జరిగింది. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవింద్‌ కొడుకు యాక్సిడెంట్‌ చేస్తే, కేసులో ఆయన్ను తప్పించి డ్రైవర్‌ను పెట్టారు. అది కూడా ఇదే జిల్లాలో జరిగింది. మరి అక్కడ ఎవరిని అరెస్ట్‌ చేశారు? ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం వర్తింప చేస్తే, నిజంగా వ్యవస్థ అనేది బతకదు. మీరు చెడు విత్తనాలు నాటుతున్నారు. ఆ చెడు విత్తనాలు రేపు వృక్షాలై మొత్తం వ్యవస్థను నాశనం చేస్తాయి.  

108కు ఎందుకు ఫోన్‌ చేశాడు? 
అప్పలరాజు కొడుకుపై హత్య కేసు పెట్టడం క్షమించరాని తప్పు. యాక్సిడెంట్‌ జరిగినప్పుడు ఈ పిల్లాడు తొలుత ఫోన్‌ చేసింది 108కే. ఈ అబ్బాయికి నిజంగా చెడు ఉద్దేశం ఉంటే 108కు ఎందుకు ఫోన్‌ చేస్తాడు? బాధితుణ్ని కాపాడేందుకు సీపీఆర్‌ కూడా చేశాడు. ఆ తర్వాత ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చింది కూడా అప్పలరాజే. ఇక్కడ ఎవరూ కూడా జరిగిన రోడ్డు ప్రమాదాన్ని కప్పిపెట్టాలనో, ఇంకొకటి చేయాలనో చూడలేదు. ఎవరూ కావాలని ఏ తప్పూ చేయలేదు.  

యాక్సిడెంట్‌ను రాజకీయం చేసే దుర్మార్గపు ఆలోచన 
యాక్సిడెంట్‌ను రాజకీయం చేయడం కోసం వీళ్లు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే.. చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఈ యాక్సిడెంట్‌లో ఒక గొర్రెల కాపరి మరణిస్తే, దాన్ని రాజకీయం చేసేందుకు చంద్రబాబు ఏం చేశాడు? పార్థసారథి అనే ఒక యాదవ మంత్రిని ఇక్కడికి పంపించాడు. ఆయన ఇక్కడికి వచ్చి ర్యాలీలు చేయించాడు. అంటే కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర. ఇది ధర్మమేనా? దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదంపై నిజంగా మనసు ఉన్నోళ్లు ఏం చేస్తారు? ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడతారు. నష్టపరిహారం ఇప్పిస్తామని చెబుతారు. కుటుంబాన్ని అన్ని రకాలుగా చూసుకుంటామని చెప్పి, భరోసా ఇప్పిస్తారు. ఇక్కడ అప్పలరాజు నిజంగా ఆ పని చేయడానికి ముందుకొచ్చాడు. అయితే వీళ్లు  రాజకీయం చేసి, చెడగొట్టి, వాళ్లకు జరిగే మంచి కూడా జరగనీయకుండా చేస్తున్నారు.  

చంద్రబాబూ.. మనిషివా? రాక్షసుడివా? 
ఒక యాదవ మంత్రిని ఇక్కడికి పంపించి అంత రాజకీయం చేయడం దారుణం. చంద్రబాబూ.. నీవు అసలు మనిíÙవా? రాక్షసుడివా? అన్నది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మనిషి అనే వాడికి మనసు ఉండాలి. ఏ ఇన్సిడెంట్‌ అయినా సరే వదలకూడదు.. దాన్ని ట్విస్ట్‌ చేయాలి.. వక్రీకరించాలి.. ఎవరినైనా నాశనం చేయాలి.. అన్న ఆలోచన నీది. నీ రాజకీయ కోణం, నీ రాజకీయ అవసరాల కోసం అలా ఆలోచించడం దుర్మార్గం అనిపించడం లేదా? ఇది ఏ మాత్రం క్షమార్హం కాదు.  

యాదవుల మీద ప్రేమ ఉందా? 
యాదవుల మీద చంద్రబాబునాయుడుకు నిజంగానే ఇంత ప్రేమ ఉందా? ఏ మాత్రం లేదు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రకాశం జిల్లా­లో యాదవులు గొర్రెలు కాస్తుంటే, కొన్ని గొర్రెలు పొలాల్లోకి పోతే, చంద్రబాబునాయుడుకి సంబంధించిన వాళ్లు వచ్చి యాదవులను కొట్టారు. కేసు మాత్రం యాదవుల మీద పెట్టారు. విశాఖపట్నం మేయర్‌గా మా పార్టీ నుంచి ఒక యాదవ మహిళ ఎన్నికయ్యారు. మరి చంద్రబాబు ఏం చేశారు?  ఆయనకు తగిన సంఖ్యా బలం లేకపోయినా ప్రలోభాలతో ఆమెను పదవి నుంచి దింపేశాడు. విశాఖపట్నంలో యాదవ భవన్‌ కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భూమి ఇచ్చింది. అక్కడ భూమి పూజ జరిగి, పనులు కూడా మొదలయ్యాయి. చంద్రబాబు వచ్చాక అన్నీ క్యాన్సిల్‌ చేశాడు. ఇదీ చంద్రబాబుకు యాదవులపై ఉన్న ప్రేమ.  

బాబుకు బీసీలంటే చులకన  
» చంద్రబాబుకు ఒక్క యాదవులే కాదు. అసలు బీసీలు అంటే కూడా లెక్క లేదు. పోనీ మత్స్యకారుల మీద ఏమైనా ప్రేమ ఉందా అంటే అదీ లేదు. మత్స్యకార నాయకులను నాశనం చేయడం, కుట్రలు పన్ని వాళ్లను చరిత్ర హీనులుగా చేయడం అలవాటు.  

»  ఇటీవల విశాఖపట్నం వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల్లో ఆరుగురు చనిపోతే, కనీసం మానవత్వం చూపలేదు. ఒక మంత్రి కూడా ఆ కుటుంబాల వద్దకు పోలేదు. కానీ, జగన్‌ వెళ్లాడు. కలిశాడు. నిజం చెప్పాలంటే ఈ మనిషి (చంద్రబాబు)కి ఎవరి మీద ప్రేమ లేదు. పేదవాడి మీద అసలు ప్రేమే లేదు. ఈ మనిషి బీసీలను ఓట్‌ బ్యాంక్‌ కింద వాడుకుంటాడే తప్ప, వారిపై ఏ మాత్రం ప్రేమ లేదు.  

»  ఆయనకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే, అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకం ఎందుకు అమలు చేయడం లేదు? దాని వల్ల అందరి కన్నా ఎక్కువగా నష్టపోయేది బీసీలే. ఒక్కసారి టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో చూడండి. సున్నా వడ్డీని రూ.మూడు లక్షలు కాదు, రూ.10 లక్షలకు పెంచుతామన్నారు. రెండేళ్లు అయ్యింది. మూడో సంవత్సరం వచ్చింది. ఇంతకు ముందు ఇస్తా ఉన్న సున్నా వడ్డీ కూడా రద్దు చేశారు.  

»  పొదుపు సంఘాల రుణాలు తగ్గిపోయాయి. రూ.25 వేల కోట్ల నుంచి రూ.49 వేల కోట్ల వరకు మా ప్రభుత్వ హయాంలో తీసుకుపోతే.. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ మొత్తం రూ.39 వేల కోట్లకు తగ్గిపోయింది. చేయూత లేదు. ఆసరా లేదు. సున్నా వడ్డీ లేదు. గతంలో వైఎస్సార్‌సీపీ హయాంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు దాదాపు రూ.9 వేల కోట్లు, వసతి దీవెన మొత్తం బకాయిలు పెట్టారు. దీంతో పిల్లలు చదువు మానేస్తున్న పరిస్థితి. దీంట్లో అందరికన్నా ఎక్కువ నష్టపోయింది బీసీలే.    

సూపర్‌ సిక్స్‌లు లేవు.. సూపర్‌ సెవెన్లు లేవు 
ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికి పోయి బాండ్‌ ఇచ్చాడు. చదువుకున్న పిల్లలకు రూ.36 వేలు అని, అమ్మ కనపడితే నీకు రూ.18 వేలు అని, 50 ఏళ్లు దాటిన వారు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని నమ్మించాడు. ఎంత మంది ఉంటే అంత మందికీ అమ్మ ఒడి కింద రూ.15 వేలు దేవుడెరుగు. ఇచ్చింది రూ.9 వేలు. రూ.8 వేలు. సూపర్‌ సిక్స్‌లు లేవు, సూపర్‌ సెవెన్లు లేవు.

అన్నీ అమ్మేస్తున్నాడు 
మత్స్యకారుల కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా 10 ఫిషింగ్‌ హార్బర్లు, ఆరు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు ప్లాన్‌ చేసి నిర్మాణాలు మొదలుపెట్టాం. ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే మూలపేట పోర్టు ఎవరు మొదలు పెట్టారు? ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే బుడగట్లపాలెం మంచినీళ్లపేట ఫిషింగ్‌ హార్బర్‌ ఎవరు తీసుకొచ్చారు? మన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తెచ్చింది. మరి ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడంటే స్కాములు చేస్తూ దాన్ని అమ్మకానికి పెట్టాడు. ఫిషింగ్‌ హార్బర్లు అమ్మకానికి పెట్టి మత్స్యకారుల జీవితాలు సర్వనాశనం చేయడానికి ఈ మనిషి సిద్ధంగా ఉన్నాడు.

ప్రశ్నించే గొంతు నొక్కుతున్నారు 
»   చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు. చేసేవన్నీ మోసాలు. ఇవన్నీ ఎవరైనా ప్రశ్నిస్తే.. ప్రశ్నించే గొంతులు ఎక్కడైనా కనిపిస్తే వాళ్లని ఇబ్బంది పెట్టడం మామూలైంది. ప్రశ్నించే గొంతు లేకుండా చేయడం కోసం వాళ్ల మీద తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు. అలా వాళ్ల జీవితాలు నాశనం అవుతాయన్న కనీస జ్ఞానం లేకుండా చెలగాటాలు. ఇది చంద్రబాబు ప్రభుత్వంలో మనం చూస్తున్న వాస్తవాలు.  

»  నేను ఒకటే చెబుతున్నా. అప్పలరాజు కుటుంబానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుంది. తోడుగా ఉంటుంది. నా చెల్లెలైన అప్పలరాజు భార్యకు అన్ని రకాలుగా వైఎస్సార్‌సీపీ తోడుగా ఉంటుంది. అప్పలరాజు కూడా కచ్చితంగా త్వరలో బయటకు వస్తాడు. ఎందుకంటే న్యాయస్థానాలు ఇంకా బతికే ఉన్నాయి కాబట్టి. ఆయన బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబునాయుడు ప్రభుత్వం మీద జరగబోయే యుద్ధం ఇంకా తీవ్ర స్థాయిలో ఉంటుంది.   

»   విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు భారీగా జనం వచ్చారు. ఆ జన సందోహంలో కాన్వాయ్‌ కదలడం కష్టంగా మారింది. కాబట్టి జైలు దగ్గరకు చేరుకునే సరికి ములాఖత్‌ సమయం ముగిసిపోయింది. అందుకే ఇక్కడే ఉన్న అప్పలరాజు కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చాను. అప్పలరాజు భార్య, ఇద్దరు కుమారులను పరామర్శించాను. వారికి ధైర్యం చెప్పాను. భరోసా ఇచ్చాను’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement