విలువైన ఆర్టీసీ స్థలాలను ప్రైవేటుకు కట్టబెట్టొద్దు | RTC employees prepare for third phase of agitation | Sakshi
Sakshi News home page

విలువైన ఆర్టీసీ స్థలాలను ప్రైవేటుకు కట్టబెట్టొద్దు

Jul 31 2026 5:25 AM | Updated on Jul 31 2026 5:25 AM

RTC employees prepare for third phase of agitation

మూడో దశ ఆందోళనకు ఉద్యోగులు సన్నద్ధం 

ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్‌ 3వ తేదీ వరకు ఉద్యమం

ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటన

సాక్షి, అమరావతి/గాంధీనగర్‌ (విజయవాడసెంట్రల్‌)/­బస్టాండ్‌(విజయవాడ పశ్చిమ): ఏపీఎస్‌ఆర్టీసీలో విద్యుత్‌ బస్సుల పేరుతో ప్రైవేటు ఆపరేటర్లకు వేల కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ డిపో స్థలాలను దోచిపెట్టడానికి వీల్లేదని ఏపీ పీటీడీ(ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. ఆర్టీసీని దశలవారీగా ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలు విరమించుకోవాలని డిమాండ్‌ చేసింది.  

విజయవాడ రెవెన్యూభవన్‌లో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఆర్టీసీ ప్రైవేటీకరణకు  వ్యతిరేకంగా ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్‌ 3వ తేదీ వరకు మూడో దశ ఆందోళన చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్లు వై శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో తమ నాలుగో దశ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఉద్యమ కార్యాచరణ ...
ఆగస్టు 3:  గ్రీవెన్స్‌లో కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రికి ఆర్టీసీ ఉద్యోగుల సంతకాలతో కూడిన వినతి పత్రాలు పంపడం.
ఆగస్టు 7–8: ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలు, అసోసి­యేషన్స్, రిటైర్డ్, అవుట్‌ సోర్సింగ్‌ సంఘాలకు, రాష్ట్ర స్థాయి కేంద్ర కార్మిక సంఘాలకు, విద్యార్థి, యువజన సంఘాలు,  ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులకు,  ఉపాధ్యాయ సంఘాల మద్దతు కోరుతూ లేఖలు ఇవ్వడం. 
ఆగస్టు 17– 18: అన్ని డిపో, యూనిట్లలో నల్ల బ్యాడ్జీలు ధరించి సామూహిక రిలే నిరాహారదీక్షలు. 
ఆగస్టు 28:  అన్ని జిల్లాలలో ఉన్న జిల్లా ప్రజా రవాణా అధికారి  కార్యాలయాల వద్ద భారీగా ఉద్యోగులను సమీకరించి నల్ల బ్యాడ్జీలు ధరించి మహాధర్నాలు. 
సెప్టెంబర్‌ 3: విజయవాడలో సమావేశమై 4వ ఉద్యమ కార్యాచరణ ప్రకటన.

ఆర్టీసీ జేఏసీ నేతలతో ఎండీ చర్చలు
ఇదిలా ఉండగా, ఏపీఎస్‌ ఆర్టీసీ జేఏసీ నేతలతో ఆర్టీసీ ఎండీ బాలసుబ్రమణ్యం చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఆర్టీసీ జేఏసీ నేతలు వై.శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు, పీవీ రమణారెడ్డి, జీవీ నరసయ్య, సీహెచ్‌ సుందరయ్య, ఎస్‌వీ శేషగిరిరావు, వై.శ్రీనివాసరావు, కె.సూర్యప్రకాశరావు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. మూసివేసిన నాలుగు డిపోలను తెరుస్తామని అధికారులు హామీ ఇచ్చినట్టు తెలిపారు. చర్చల్లో ఇచ్చిన హామీలను మినిట్స్‌ రూపంలో ఇచ్చిన అనంతరం జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయం ప్రకటిస్తామన్నారు. అప్పటి వరకు మూడో విడత దశ ఆందోళన యధావిధిగా కొనసాగుతుందని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement