అనుమతించిన విజయవాడ నాలుగో అడిషనల్ జూనియర్ సివిల్ కమ్ ఆర్‌సీసీ కోర్టు
24 గంటలు విచారణ చేయడానికి వీల్లేదు
జైలు నిబంధనల ప్రకారమే చేయాలి
నాగరాజు తరఫు న్యాయవాది వాదన
విజయవాడ లీగల్: దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన కాపు యువకుడు గాదె సాయికష్ణ అదశ్యం కేసులో సస్పెండ్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విజయవాడ కష్ణలంక సీఐ నాగరాజును పోలీసు కస్టడీకి విజయవాడ నాలుగో అడిషనల్ జూనియర్ సివిల్ కమ్ ఆర్‌సీసీ కోర్టు అనుమతించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో గురువారం విజయవాడ న్యాయస్థానంలో పోలీసులు ఆయన్ను హాజరుపరిచారు. ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి.
నాగరాజు తరఫున న్యాయవాది జి. సాంబశివరావు వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, జైలు మాన్యువల్ నిబంధనలకు లోబడి పోలీసుల విచారణ ఉ.10 నుంచి సా.5 వరకు మాత్రమే జరపాలన్నారు. విచారణ పేరుతో రాత్రి వేళల్లో సుదీర్ఘ ఇంటరాగేషన్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతిలేదని, 24 గంటల పాటు నిందితులను ఇంటరాగేషన్ చేయడం ముమ్మాటికీ చట్టవిరుద్ధమన్నారు. అలాగే, ఈ కేసుకు సంబంధించి విచారణ జరిగే సమయంలో నిందితుడి తరఫు న్యాయవాది పందిరి బాబూరావు లేదా వేరొక న్యాయవాదిగానీ హాజరుకావచ్చన్నారు.
అయితే, న్యాయవాది విచారణలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోకూడదని ఆంక్షలు విధించిందని కోర్టు తీర్పును చదివి వినిపించారు. లాయర్ విచారణ ప్రదేశానికి కనీసం 10 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండాలని ట్రయల్ కోర్టు తీర్పులో ఉందన్నారు. సుప్రీంకోర్టు కూడా ట్రయల్ కోర్టు, హైకోర్టుల ప్రధాన నిబంధనలను సమర్థిస్తూనే కొన్ని సవరణలు చేసిందని.. విచారణ మొత్తం జైలు మాన్యువల్, కోర్టు నిబంధనల పరిధిలోనే సాగాలని డిఫెన్స్ న్యాయవాదులు వాదించారు. విచారణకు వచ్చేముందు పోలీసు అధికారులు సమయం, ఇతర వివరాలను ముందుగా నిందితుడి తరఫు న్యాయవాదులకు తెలియజేయాలని కోరారు.
ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ సత్యవాణి వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఉత్తర్వుల ప్రకారమే విచారణాధికారులు విచారిస్తారని, అలాగే నిందితునికి సిట్ కార్యాలయంలో సీసీ కెమేరాల పర్యవేక్షణలో భారీ భద్రత మధ్య రూమ్‌ను కేటాయించనున్నట్లు న్యాయమూర్తి దష్టికి తెచ్చారు. ఇరువురి వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి రిషీక్ విచారణ సమయంలో విచారణాధికారుల నుండి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే తెలియజేయాలని సూచిస్తూ నాగరాజును పోలీసు కస్టడీకి అనుమతించారు.
తొలిరోజు ప్రశ్నల వర్షం
స్పందించని సీఐ నాగరాజు
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో మరో ఆరు రోజులపాటు సిట్ విచారణ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్‌డెత్, బాడీ మాయం కేసులో గురువారం సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారించింది. తొలుత ఆయనను రాజమండ్రి నుంచి విజయవాడ కోర్టుకు తీసుకొచ్చారు. అక్కడ వాదనలు జరిగాక పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించిన అనంతరం నాగరాజును సిట్ కార్యాలయానికి తరలించారు. లాకప్‌డెత్ అంశంపై పలు ప్రశ్నలను సిట్ సంధించింది. దీనికి నాగరాజు చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని సమాచారం.
సాయికృష్ణను ఎందుకు హింసించారు?
మార్కాపురం నుంచి విజయవాడకు సాయికృష్ణను తీసుకొచ్చి టాస్క్‌ఫోర్స్ నుంచి అదుపులోకి తీసుకున్నాక కోర్టులో ఎందుకు హాజరుపరచలేదని సిట్ ప్రశ్నించింది. కస్టోడియల్ టార్చర్, లాకప్‌డెత్ తర్వాత పరిణామాలు ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు?.. ఇందులో ఉన్నతాధికారుల పాత్ర ఏమైనా ఉందా?.. సాయికృష్ణను లాకప్‌లో ఎందుకు చిత్రహింసలకు గురిచేశారంటూ నిలదీశారు.
సాయికృష్ణ లాకప్‌డెత్ జరిగిందా?.. లాకప్‌డెత్ తర్వాత డెడ్‌బాడీ మాయం చేశారా?.. లాకప్‌డెత్ జరిగిన రోజు స్టేషన్‌లో సిబ్బంది ఎవరెవరు ఉన్నారు.. ఈ కేసులో సిబ్బంది పాత్ర ఎంత ఉందని సిట్ ఆరా తీసింది. స్టేషన్‌లో సీసీ ఫుటేజ్‌ను ఎందుకు మాయం చేశారంటూ వేసిన ప్రశ్నలకు నాగరాజు మౌనంగా ఉండిపోయారని సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉ.10 నుంచి సా.5 వరకు విచారించిన సిట్ మరో ఆరు రోజులు నాగరాజును ప్రశ్నించనుంది.


