హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణపై సీఐ రాజగోపాల్‌నాయుడు దురుసు ప్రవర్తన
వాడిని తన్ని స్టేషన్‌లో వేయండి.. అంటూ హిందూపురంలో రెచ్చిపోయిన సీఐ
సాక్షి టాస్క్‌ఫోర్స్: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం వన్‌టౌన్ సీఐ రాజగోపాల్‌నాయుడు హైకోర్టు న్యాయవాదిని బూతులు తిట్టి కాలితో తన్నారు. సీఐ దురుసుగా వ్యవహరించిన వీడియో వైరల్ అయింది. దీంతో వివాదాస్పదంగా వ్యవహరించే ఈ సీఐ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ నెల 27న రాత్రి హిందూపురంలోని మాతృశ్రీ ప్రైవేటు ఆస్పత్రిలో సిజేరియన్ చేసిన తరువాత రమ్యశ్రీ అనే మహిళ మృతిచెందింది. అదేరోజు రాత్రి మృతురాలి బంధువులు, బహుజన చైతన్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు.
అక్కడికి వచ్చిన సీఐ రాజగోపాల్‌నాయుడు వారితో దురుసుగా ప్రవర్తించారు. పచ్చి బూతులు తిడుతూ రెచ్చిపోయారు. ‘వాడిని తన్ని స్టేషన్‌లో వెయ్యండి..’ అంటూ హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణను బూటుకాలితో తన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బాధిత గర్భిణి కుటుంబానికి న్యాయం చేయాలని, ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తే సీఐ ఆస్పత్రి నిర్వాహకులతో కుమ్మక్కై దారుణంగా ప్రవర్తించారని దళిత సంఘాల నాయకులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
అతిగా వ్యవహరిస్తున్న సీఐ
సీఐ రాజగోపాల్‌నాయుడు.. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల కనుసన్నల్లో ఉద్యోగం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన వ్యవహారశైలి ఉంటోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆయన అతిగా వ్యవహరిస్తున్నారంటూ పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అందరి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న సీఐపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


