ఏ అభ్యర్థి భవిష్యత్తూ నాశనం కాకూడదు | YSRCP supports Public Examinations Amendment Bill | Sakshi
Sakshi News home page

ఏ అభ్యర్థి భవిష్యత్తూ నాశనం కాకూడదు

Jul 31 2026 5:46 AM | Updated on Jul 31 2026 5:46 AM

YSRCP supports Public Examinations Amendment Bill

రాష్ట్ర స్థాయి ఉద్యోగ పరీక్షలనూ కేంద్ర చట్టం పరిధిలోకి తేవాలి 

రాజ్యసభలో కేంద్రాన్ని కోరిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి 

పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ సవరణ బిల్లుకు వైఎస్సార్‌సీపీ మద్దతు 

కోచింగ్‌ సెంటర్ల నియంత్రణకు బిల్లులో సవరణకు సూచన 

ఏపీలో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ మానుకోవాలని డిమాండ్‌

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ : ఉద్యోగాల భర్తీకి పోటీ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వ్యవస్థాగత వైఫల్యాల వల్ల ఏ ఒక్క అభ్యర్థి భవిష్యత్తూ నాశనం కాకూడదన్నదే తమ ఉద్దేశమని వైఎస్సార్‌సీపీ మరోసారి పార్లమెంట్‌ వేదికగా స్పష్టం చేసింది. అక్రమాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా పోటీ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) సవరణ బిల్లు–2026కు రాజ్యసభలో మద్దతు తెలిపింది.

అయితే ఈ బిల్లును కేవలం కేంద్ర పరీక్షలకే పరిమితం చేయకుండా, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పోటీ పరీక్షలనూ ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం రాజ్యసభలో పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

కఠిన శిక్షల విధింపు సమర్థనీయమే 
‘లీకేజీ బిల్లులో ప్రతిపాదించిన కఠిన శిక్షలు సబబే. పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు 10 ఏళ్ల జైలుశిక్ష, రూ.50 లక్షల జరిమానా, సర్వీస్‌ ప్రొవైడర్లకు రూ.కోటి జరిమానా విధించే నిబంధనలు సమర్థనీయమే. అక్రమాల్లో భాగస్వాములయ్యే సర్వీస్‌ ప్రొవైడర్ల బాధ్యులకు ఐదేళ్ల పాటు జైలు శిక్ష, రూ.5 కోట్ల జరిమానా, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడితే కనీసం ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించాలన్న ప్రతిపాదనలు సమర్థనీయమైనవే. జాతీయ స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుతో పాటు రాష్ట్రాల్లో నిర్దిష్ట కాల వ్యవధితో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కోర్టులు ఏర్పాటు చేయాలన్న నిర్ణయం సరైనదే. 

రాష్ట్రాల రిక్రూట్‌మెంట్‌ బోర్డులనూ చేర్చాలి
ప్రస్తుత బిల్లు పరిధి కేవలం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ), స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ), రైల్వే, బ్యాంకింగ్‌ తదితర కేంద్ర స్థాయి పరీక్షలకే పరిమితమైంది. రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టాలంటే ఆంధప్రదేశ్‌ సహా ఇతర రాష్ట్రాల్లోని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు, పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డులు, డీఎస్సీ లాంటి రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలను కూడా ఈ బిల్లు పరిధిలోకి తీసుకురావాలి. కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ల ప్రమేయంతోనే పేపర్‌ లీకేజీల వంటి వ్యవస్థీకృత నేరాలు జరుగుతున్నాయి. రాజస్థాన్‌లో వెలుగు చూసిన రీట్, ఆర్పీఎస్సీ పేపర్‌ లీకేజీ కుంభకోణాలే ఇందుకు నిదర్శనం. కోచింగ్‌ సెంటర్ల పాత్రపై ఈడీ, స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ (ఎస్‌వోజీ) దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. అందువల్ల కోచింగ్‌ సెంటర్లపై నియంత్రణ అంశాన్నీ ఈ బిల్లులో చేర్చాలి.

5.5 లక్షల మంది విద్యార్థులు ఏమయ్యారు?
.ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ‘నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా రూ.12 వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేశారు. సీబీఎస్‌ఈ, ఐబీ సిలబస్‌ను ప్రవేశపెట్టి ప్రభుత్వ బడులను ప్రైవేట్‌ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దారు. ఈ చర్యల వల్ల 2023–24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు 40.50 లక్షలకు చేరింది. కానీ, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వ విధానాల వల్ల ఆ సంఖ్య ఏకంగా 34.93 లక్షలకు పడిపోయింది. కొద్ది కాలంలోనే సుమారు 5.5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడులకు ఎందుకు దూరమయ్యారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. 

17 మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరిస్తారా? 
పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసే లక్ష్యంతో 2020–2024 మధ్య కాలంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అయితే, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నం చేస్తోంది. తద్వారా పేద విద్యార్థులకు మెడికల్‌ సీట్లు దక్కకుండా పోతున్నాయి. తక్షణమే ఈ ప్రైవేటీకరణ ప్రయత్నాలను మానుకోవాలి’ అని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement