భారతదేశంలో అత్యధిక అమ్మకాలు పొందుతున్న నెక్సాన్.. 'కామో ఎడిషన్' రూపంలో లాంచ్ అయింది. దీని ధర రూ.9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీనికి కంపెనీ పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయించనుంది.
భారతదేశంలో నెక్సాన్ తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని, 11 లక్షలకు పైగా అమ్మకాలను సాధించిన సందర్భంగా.. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని టాటా మోటార్స్ లాంచ్ చేసింది. అయితే ఇందులో ఎలాంటి మెకానికల్ మార్పులు లేదు, కానీ కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్‌లు & కొన్ని అదనపు పరికరాలను జోడించారు.
నెక్సాన్ కామో ఎడిషన్ మున్నార్ మిస్ట్, కూర్గ్ క్లౌడ్ అనే రెండు కొత్త రంగుల్లో లభిస్తుంది. ఈ రంగులు కాకుండా కామో బ్యాడ్జ్‌లు కనిపిస్తాయి. క్యాబిన్‌లో కూడా ముందు సీట్ల హెడ్‌రెస్ట్‌లపై కామో థీమ్ ఉంటుంది. క్యాబిన్ లోపల 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడిన కొత్త 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు.
మరో ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే.. ఈ కారులోని నాలుగు సరౌండ్-వ్యూ కెమెరాలను ఉపయోగించి పనిచేసే ఇంటిగ్రేటెడ్ డాష్‌క్యామ్. ఇది నిరంతరంగా రికార్డ్ చేయగలదు, ప్రమాదం జరిగినప్పుడు ఫుటేజీని ఆటోమేటిక్‌గా సేవ్ చేస్తుంది, వీడియోలను ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌పై చూడటానికి లేదా స్మార్ట్‌ఫోన్‌కు బదిలీ చేయడానికి అనుమతిస్తుంది.
వేరియంట్‌ను బట్టి.. పరికరాల జాబితాలో పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, బ్లైండ్ వ్యూ మానిటర్‌తో కూడిన 360-డిగ్రీ కెమెరా, జేబీఎల్ స్పీకర్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ మొదలైనవి ఉన్నాయి. ఏడు ఫంక్షన్లతో కూడిన ఏడీఏఎస్ మాత్రమే కాకుండా.. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం కూడా ఉన్నాయి.
నెక్సాన్ కామో ఎడిషన్.. స్టాండర్డ్ మోడల్‌లో ఉన్న అవే ఇంజన్ ఆప్షన్‌లతో కొనసాగుతుంది. కొనుగోలుదారులు 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్, 1.2-లీటర్ టర్బో సీఎన్జీ యూనిట్ వంటి వాటిలో ఎంచుకోవచ్చు. వేరియంట్‌ను బట్టి, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో మాన్యువల్, ఆటోమాటిక్, డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు ఉన్నాయి.
ఇదీ చదవండి: E20 పెట్రోల్ సేఫేనా?.. 87 వేల పెట్రోల్ బంకుల్లో తనిఖీలు!


