జూన్‌లో ఎక్కువ మంది కొన్న కారు ఇదే! | Top 10 Selling Cars in June Know The Details | Sakshi
Sakshi News home page

జూన్‌లో ఎక్కువ మంది కొన్న కారు ఇదే!

Jul 4 2026 3:42 PM | Updated on Jul 4 2026 3:51 PM

Top 10 Selling Cars in June Know The Details

భారత ఆటోమొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. వినియోగదారుల అభిరుచుల్లో కూడా గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్‌యూవీ (SUV) వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జూన్ నెలలో కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ అద్భుత ప్రదర్శన కనబరిచింది.

జూన్ నెలలో టాటా మోటార్స్ దేశీయంగా మొత్తం 63,083 ప్రయాణికుల వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 37,237 వాహనాలతో పోలిస్తే 69 శాతం వృద్ధి నమోదు చేసింది. ముఖ్యంగా పంచ్, నెక్సాన్, టియాగో కొత్త వెర్షన్‌లకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభించింది. పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వంటి అన్ని రకాల మోడళ్లకు బుకింగ్‌లు పెరగగా, కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు కూడా 14,800 యూనిట్లకు చేరి కొత్త రికార్డు సృష్టించాయి.

అమ్మకాల పరంగా టాటా పంచ్ మొదటి స్థానంలో నిలిచి 21,006 యూనిట్లు విక్రయించింది. టాటా నెక్సాన్ 18,335 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక మారుతి సుజుకి డిజైర్ 17,899 యూనిట్లతో మూడో స్థానాన్ని దక్కించుకొని, దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్‌గా తన స్థానాన్ని కొనసాగించింది.

తరువాత స్థానాల్లో వ్యాగన్‌ఆర్ (16,952 యూనిట్లు), ఎర్టిగా (16,111 యూనిట్లు), స్విఫ్ట్ (15,215 యూనిట్లు), మహీంద్రా స్కార్పియో (14,097 యూనిట్లు), ఫ్రాంక్స్ (13,135 యూనిట్లు), బాలెనో (12,488 యూనిట్లు), హ్యుందాయ్ వెన్యూ (10,776 యూనిట్లు) నిలిచాయి.

టాటా మోటార్స్ తొలి రెండు స్థానాలను దక్కించుకున్నప్పటికీ, టాప్-10 జాబితాలో ఆరు మోడళ్లతో మారుతి సుజుకి ఆధిపత్యాన్ని కొనసాగించింది. డిజైర్, వ్యాగన్‌ఆర్, ఎర్టిగా, స్విఫ్ట్, ఫ్రాంక్స్, బాలెనో మోడళ్లు కలిపి 91,780 యూనిట్ల అమ్మకాలు నమోదు చేశాయి. ఇది టాప్-10 కార్ల మొత్తం అమ్మకాలలో 57 శాతానికి పైగా ఉండటం విశేషం.

ఇదీ చదవండి: E20తో మైలేజ్ తగ్గుతుందా?: కేంద్ర మంత్రి క్లారిటీ!

ఈసారి టాప్-10 జాబితాలో సాధారణంగా స్థానం సంపాదించే హ్యుందాయ్ క్రెటా కనిపించలేదు. సరఫరాదారుల ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా ఉత్పత్తి తాత్కాలికంగా అంతరాయం కలగడంతో క్రెటా అమ్మకాలు తగ్గాయి. అలాగే కొత్త వెర్షన్ విడుదలకు ముందు మారుతి సుజుకి బ్రెజ్జా అమ్మకాలు కూడా తగ్గడంతో అది కూడా టాప్-10 జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది.

జూన్ నెల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే.. భారత వినియోగదారులు ఎస్‌యూవీ వాహనాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. టాప్-10 జాబితాలో పంచ్, నెక్సాన్, స్కార్పియో, ఫ్రాంక్స్, వెన్యూ వంటి ఐదు ఎస్‌యూవీలు చోటు దక్కించుకున్నాయి. అయితే ఎస్‌యూవీల హవా కొనసాగుతున్నప్పటికీ, డిజైర్ అత్యధికంగా అమ్ముడైన సెడాన్‌గా తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement