E20తో మైలేజ్ తగ్గుతుందా?: కేంద్ర మంత్రి క్లారిటీ! | Does E20 Petrol Reduce Mileage Minister Hardeep Puri Busts Ethanol Myths | Sakshi
Sakshi News home page

E20తో మైలేజ్ తగ్గుతుందా?: కేంద్ర మంత్రి క్లారిటీ!

Jul 3 2026 3:29 PM | Updated on Jul 3 2026 3:38 PM

Does E20 Petrol Reduce Mileage Minister Hardeep Puri Busts Ethanol Myths

ఈ20 ఫ్యూయెల్ గురించి సోషల్ మీడియాలో అనేక విమర్శలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా E20 ఇంధనం వాడితే వాహనం మైలేజ్ తగ్గుతుందని, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు తిరస్కరణకు గురవుతాయనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ అంశాలపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. అంతే కాకుండా.. మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా పెరిగిన ఇంధన ధరలపై కూడా ఆయన స్పందించారు.

E20 ఫ్యూయెల్ అంటే?
E20 ఫ్యూయెల్ అంటే.. 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ కలిపిన ఇంధనం. ఇథనాల్ అనేది చెరకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటల నుంచి తయారయ్యే జీవ ఇంధనం (Biofuel). దీని వినియోగం వల్ల దిగుమతి చేసుకునే ముడి చమురు అవసరం తగ్గడంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా కొంత మేర తగ్గుతుంది.

ఈ20 ఇంధనం వల్ల మైలేజ్ తగ్గుతుందా?
ఈ20 ఫ్యూయెల్ వాడితే మైలేజ్ కొంత తగ్గే అవకాశం ఉందని మంత్రి హర్దీప్ సింగ్ పూరి అంగీకరించారు. అయితే.. ఆ తగ్గుదల చాలా స్వల్పమని, అది వాహనం పరిస్థితి, డ్రైవింగ్ విధానం, రోడ్డు పరిస్థితులు వంటి అనేక అంశాలపై కూడా ఆధారపడి ఉంటుందని తెలిపారు.

ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లపై స్పష్టత
ఈ20 ఫ్యూయల్ వాడితే వెహికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు తిరస్కరణకు గురవుతాయని వస్తున్న వార్తలను మంత్రి పూర్తిగా ఖండించారు. ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ విషయంపై ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చాయి. కాబట్టి ఈ20 పెట్రోల్ ఉపయోగించడం వల్ల ఇన్సూరెన్స్ రద్దు అవుతుందనే ప్రచారం నిజం కాదని చెప్పారు.

ప్రస్తుతం దేశంలో 20 శాతం ఇథనాల్ మిశ్రమం (E20) అమలులో ఉంది. భవిష్యత్తులో 25 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఇథనాల్ మిశ్రమం (E25, E27, E30) ప్రవేశపెట్టే అవకాశముందని మంత్రి పేర్కొన్నారు. అయితే అందుకు ముందు అవసరమైన అన్ని సాంకేతిక పరీక్షలు పూర్తయిన తర్వాత మాత్రమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటికే 22 శాతం, 25 శాతం, 27 శాతం, 30 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌కు సంబంధించిన BIS ప్రమాణాలను రూపొందించింది. అలాగే ఈ ఇంధనాలకు ఎక్సైజ్ సుంకంలో కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. అయితే ఇవి కేవలం నియంత్రణ పరమైన చర్యలేనని, వెంటనే అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని మార్కెట్‌లో ప్రవేశపెట్టే ఉద్దేశం కాదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా ప్రస్తుతం ఈ80 ఫ్యూయెల్ వినియోగించడానికి అనుకూలమైన కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement