కృత్రిమ మేధ సాంకేతికత ఆధునిక ప్రపంచంలో సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తోంది. శతాబ్దం క్రితం రూపుమాసిపోయిన చారిత్రక దృశ్యాలను, కనుమరుగైన దిగ్గజాల గొంతులను పునసృష్టించే దిశగా పురోగతిని సాధిస్తోంది. ఈ క్రమంలోనే భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ ఇంగ్లండ్‌లో గడిపిన కాలం నాటి అనుభవాలను ఆవిష్కరిస్తూ రూపొందించిన ఒక ఏఐ పోడ్‌కాస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంగ్లండ్‌లోని ఒంటరితనం.. సంఖ్యల ప్రపంచం
ఈ ఆడియో పోడ్‌కాస్ట్‌లో ఏఐ ఆధారిత ‘రామానుజన్ డిజిటల్ అవతార్’ను ఇంగ్లండ్ జీవితం గురించి ప్రశ్నించగా ఆయన నాటి పరిస్థితులను అత్యంత భావోద్వేగంతో వివరించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రఖ్యాత గణితశాస్త్రజ్ఞుడు బీహెచ్ హార్డీతో కలిసి పనిచేసిన క్షణాలను గుర్తుచేసుకుంటూనే అక్కడ ఎదుర్కొన్న సవాళ్లను పంచుకున్నారు.
‘ఇంగ్లండ్‌లోని తీవ్రమైన శీతల వాతావరణం, నియమబద్ధమైన శాకాహార భోజనం దొరకక శారీరకంగా ఎంతో ఇబ్బందులు పడ్డాను. నా శరీరం అక్కడి శీతాకాలపు చలికి వణికిపోయినప్పటికీ నా మనస్సులో నిరంతరం సంఖ్యల అమరికలు, సమీకరణాలే మెదులుతుండేవి’ అని ఏఐ వాయిస్ పలికిన తీరు నెటిజన్లను కట్టిపడేసింది.
AI Podcasts will explode!
I asked Ramanujan about his life in England.
His answer -> pic.twitter.com/jRnLrcJ2uN— Ramsri Goutham Golla (@ramsri_goutham) August 9, 2026
లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్‌ఎల్‌ఎం), అత్యాధునిక వాయిస్ క్లోనింగ్ సాంకేతికతల కలయికతో రూపొందించిన ఈ పోడ్‌కాస్ట్ రామానుజన్ రాసిన లేఖలు, ఆయన జీవిత చరిత్రలోని అధికారిక ఆధారాలను ప్రామాణికంగా తీసుకుని సంభాషణను నిర్మించింది. కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితమైన చారిత్రక మేధావుల భావోద్వేగాలను, వారి జీవిత పోరాటాలను భావితరాలకు అత్యంత సజీవంగా అందించడంలో ఏఐ సాంకేతికత ఎంత శక్తివంతమైన సాధనంగా మారుతోందో ఈ వైరల్ వీడియో రుజువు చేస్తోంది.
ఇదీ చదవండి: పబ్లిక్ వైఫై వాడే ప్రయాణికులే టార్గెట్!


