సినిమా రంగంలో ఎలాంటి నేపథ్యం లేకుండా అడుగుపెట్టి.. స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదగడం అంత సులభం కాదు. కొందరికి తొలి సినిమాతోనే గుర్తింపు వస్తే.. మరికొందరు ఎన్నో కష్టాలు, ఎదురుదెబ్బలు దాటిన తర్వాత తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు. అలాంటి వారిలో అస్సామీ బ్యూటీ కయాదు లోహర్ ఒకరు. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ భామ.. ప్రస్తుతం వరుస అవకాశాలతో సౌత్‌లో బిజీ హీరోయిన్‌గా మారింది.
(ఇదీ చదవండి: కృష్ణుడు ఎలిమినేట్.. ‘నీలో మా నాన్న కళ్లు చూసుకున్నా అన్నా..’)
ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’లో సుబ్బలక్ష్మి పాత్రలో కనిపించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కయాదు.. హీరోయిన్‌గా మారకముందు తాను ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుంది. తన కుటుంబ పరిస్థితులు, చేసిన ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది.
టీలు అందించే స్థాయి నుంచి..
కయాదు మాట్లాడుతూ.. తాను పుణెలో పుట్టి పెరిగినట్లు తెలిపింది. చిన్నప్పటి నుంచి చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదని.. అయితే నాటకాలు, స్టేజ్ పెర్ఫార్మెన్స్‌లు, డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. తమది సాధారణ మధ్యతరగతి కుటుంబం కావడంతో చిన్న వయసులోనే కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో కాఫీ షాపులో టీలు అందించే పని కూడా చేశానని కయాదు గుర్తుచేసుకుంది. ఆ తర్వాత బట్టల దుకాణంలో సేల్స్ గర్ల్‌గా పనిచేశానని తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎలాంటి పని చేయడానికి కూడా వెనుకాడలేదని ఆమె చెప్పుకొచ్చింది.
కన్నీళ్లతో బయటకు..
కయాదు జీవితంలో ఐటీ ఉద్యోగం కూడా ఓ భాగమేనట. కొంతకాలం ఐటీ కంపెనీలో పనిచేసిన ఆమె.. అక్కడి పని ఒత్తిడి తనకు ఏమాత్రం సరిపోలేదని చెప్పింది. తన ఆలోచనలు, తనకు నచ్చిన జీవితం ఆ ఉద్యోగంతో ముడిపడటం లేదని భావించినట్లు తెలిపింది. ఓ దశలో ఆఫీసులోనే తీవ్ర ఒత్తిడికి గురై కన్నీళ్లు పెట్టుకున్నానని.. ఆ తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేసి తనకు ఇష్టమైన కళారంగం వైపు అడుగులు వేసినట్లు వెల్లడించింది. మోడలింగ్‌తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి.. ఒక్కో అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ సినిమాల్లోకి వచ్చింది కయాదు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె.. చిన్న ఉద్యోగాలు చేస్తూ మొదలుపెట్టి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో స్టార్ హీరో సరసన హీరోయిన్‌గా నటించే స్థాయికి చేరుకోవడం విశేషం.
సినిమాల విషయానికి వస్తే..
టాలీవుడ్‌లో శ్రీవిష్ణు సరసన ‘అల్లూరి’ (2022) సినిమాతో కయాదు లోహర్ హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి స్పందన వచ్చినప్పటికీ.. సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో తెలుగులో వెంటనే వరుస అవకాశాలు రాలేదు. తర్వాత ప్రదీప్ రంగనాథన్ సరసన నటించిన తమిళ చిత్రం ‘డ్రాగన్’ (2025) ఆమె కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఈ సినిమా విజయంతో కయాదుకు వరుస అవకాశాలు రావడం మొదలైంది. ఆ తర్వాత ‘ఫంకీ’, ‘పళ్ళి చట్టంబి’ వంటి చిత్రాల్లోనూ నటించి తన పరిధిని పెంచుకుంది. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’లో సుబ్బలక్ష్మి పాత్రలో కనిపించనుంది.
(ఇదీ చదవండి: విడాకులపై కాజల్ ఆసక్తికరమైన కామెంట్స్)


