బతికుండగానే చంపేశారు.. నటి భావోద్వేగం.. | South Veteran Actress Vadivukkarasi Dismisses passed away Rumors Confirms She Is Healthy | Sakshi
Sakshi News home page

Vadivukkarasi: వడివుక్కరసి కన్నుమూశారంటూ ప్రచారం..!

Sep 21 2026 9:22 AM | Updated on Sep 21 2026 9:38 AM

South Veteran Actress Vadivukkarasi Dismisses passed away Rumors Confirms She Is Healthy

చిత్రసీమలో తన విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి వడివుక్కరసి గురించి సోషల్ మీడియాలో ఓ తప్పుడు వార్త వైరల్‌గా మారింది. ఆమె అనారోగ్యంతో కన్నుమూశారంటూ కొందరు ప్రచారం చేయడంతో అభిమానులు, సినీ వర్గాలు ఆందోళనకు గురయ్యాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్వయంగా వడివుక్కరసి స్పందించడంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

‘నేను బతికే ఉన్నా. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. నా ఆరోగ్యం పట్ల ఆందోళన చెందవద్దు. నా యోగక్షేమాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన శ్రేయోభిలాషులు, అభిమానులకు ధన్యవాదాలు’ అంటూ ఓ టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. 

సినీ ప్రస్థానం ఇది..
1978లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన వడివుక్కరసి.. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో 350కి పైగా చిత్రాల్లో నటించారు. రజినీకాంత్, కమల్ హాసన్ వంటి అగ్ర హీరోలతో కలిసి పనిచేశారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా తనదైన ముద్ర వేశారు. 40కి పైగా టీవీ సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించి ప్రేక్షకులకు చేరువయ్యారు. తెలుగు ప్రేక్షకులకు కూడా వడివుక్కరసి సుపరిచితమే. రజినీకాంత్ నటించిన 'శివాజీ', 'అరుణాచలం' వంటి చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. చిరంజీవి, మోహన్‌బాబు కలిసి నటించిన 'పట్నం వచ్చిన పతివ్రతలు', 'నేటి సిద్ధార్థ' వంటి సినిమాల్లోనూ ఆమె కనిపించారు.
68 ఏళ్ల వయసులోనూ..
కెరీర్ తొలిదశలో ప్రతినాయక ఛాయలున్న పాత్రలు చేసిన ఆమె.. ఆ తర్వాత తల్లి, బామ్మ, అత్త వంటి భావోద్వేగ పాత్రల్లోనూ మెప్పించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'అశోక్'లో విలన్‌గా ఆకట్టుకోగా.. సునీల్ హీరోగా నటించిన 'అందాల రాముడు'లో మనవడిపై ప్రేమను చూపించే నానమ్మగా భావోద్వేగాన్ని పండించారు. తరువాత కూడా చాలా సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తుంపు తెచ్చుకున్నారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తూ వస్తున్న వడివుక్కరసి.. ప్రస్తుతం 68 ఏళ్ల వయసులోనూ నటిగా కొనసాగుతున్నారు. 

 అలాంటి సీనియర్ నటిపై మృతి వార్తలు ప్రచారం కావడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందారు. అయితే తాను క్షేమంగానే ఉన్నానని ఆమె స్పష్టం చేయడంతో  అభిమానులు ఆమె బతికి ఉండగానే చంపేశారు కదరా అంటూ సోషల్‌మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పుడు ఈ తప్పుడు ప్రచారానికి తెరపడింది.
ఇదీ చదవండి: కృష్ణుడు ఎలిమినేట్‌.. ‘నీలో మా నాన్న కళ్లు చూసుకున్నా అన్నా..’

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement