మహాలయం
(27, ఆదివారం నుంచి మహాలయ పక్షాలు ఆరంభం)
ఈ పక్షం... పితృపక్షం
ప్రతి ఏటా భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణ పక్షాన్ని (15 రోజులను) మహాలయ పక్షం లేదా పితృపక్షం అని పిలుస్తారు. హిందూ సంప్రదాయంలో మహాలయ పక్షాలు లేదా పితృ పక్షం అనేది గతించిన మన పితృదేవతలను (పూర్వీకులను) స్మరించుకుంటూ, వారికి కృతజ్ఞతగా శ్రాద్ధకర్మలు, తర్పణాలు అర్పించడానికి కేటాయించిన అత్యంత పవిత్రమైన రోజులు. మహాలయ పక్షాల విశిష్టత, పురాణ నేపథ్యం, ఆచరించాల్సిన విధులకు సంబంధించిన సమగ్ర సమాచారం...
హిందూ ధర్మం ప్రకారం, మరణించిన మన తల్లిదండ్రులు, తాతముత్తాతల ఆత్మల శాంతికోసం ప్రతి ఏటా వారి తిథి నాడు ఆబ్దికం నిర్వహిస్తారు. అయితే, ఏవైనా కారణాల వల్ల ఆయా తిథులలో శ్రాద్ధకర్మలు నిర్వహించలేకపోయిన వారు, ఈ 15 రోజుల మహాలయ పక్షంలో ఏ రోజైనా తర్పణాలు ఇవ్వవచ్చు. ఈ సమయంలో యమధర్మరాజు పితృదేవతలను తమ వారసుల నుంచి పూజలు అందుకోవడానికి భూలోకానికి అనుమతిస్తారని, వారు తమ సంతానం ఇచ్చే పిండప్రదానాల కోసం ఆకలిదప్పులతో ఎదురు చూస్తుంటారని గరుడ పురాణం చెబుతోంది.
పురాణ నేపథ్యం (కర్ణుడి కథ)మహాలయ పక్షాల ప్రాధాన్యత గురించి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గానికి చేరుకుంటాడు. అక్కడ అతనికి తినడానికి ఆహారానికి బదులుగా బంగారం, వెండి, రత్నాలు లభిస్తాయి. ఆకలి దప్పులతో అలమటించిన కర్ణుడు దీనికి గల కారణాన్ని యమధర్మరాజును అడగ్గా... కర్ణుడు తన జీవితకాలంలో ఎంతో దానం చేసినప్పటికీ, అన్నదానం చేయలేదని, అలాగే పితృదేవతలకు తర్పణాలు అర్పించని ఫలితమే అదంతా అని తెలుపుతాడు.
తన పూర్వీకులెవరో తెలియకపోవడం వల్లే అలా చేయలేకపోయానని కర్ణుడు చెప్పడంతో, యముడు అతనికి 15 రోజుల పాటు భూలోకానికి వెళ్లేందుకు అనుమతిస్తాడు. ఆ సమయంలో కర్ణుడు భూమిపైకి వచ్చి తన పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించి, అన్నదానం చేయడం వల్ల తిరిగి స్వర్గంలో అన్న పానీయాలు పొందుతాడు. ఆ పక్షందినాలే మహాలయ పక్షాలు.
ఏ తిథి రోజు శ్రాద్ధం పెడితే ఎలాంటి ఫలితమంటే..?
మహాలయ పక్షాల్లోని 15 రోజుల్లో ఒక్కో తిథికి ఒక్కోప్రత్యేకత ఉంది. శాస్త్రాల ప్రకారం ఆయా రోజుల్లో తర్పణాలు ఇస్తే కలిగే ఫలితాలు:
పాడ్యమి: ధన్రపాప్తి కలుగుతుంది.
విదియ: ఉత్తమ సంతానం కలుగుతుంది.
తదియ: వ్యాపార, ఉద్యోగాల్లో ప్రగతి లభిస్తుంది.
చవితి: శతృ భయం తొలగిపోతుంది.
పంచమి: బంగారం, వెండి వంటి సంపదలు లభిస్తాయి.
షష్ఠి: సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.
సప్తమి: నాయకత్వ లక్షణాలు, అధికార బలం చేకూరతాయి.
అష్టమి: బుద్ధి వికాసం, బ్రహ్మజ్ఞానం లభిస్తాయి.
నవమి: మాతృశ్రాద్ధానికి శ్రేష్ఠమైనది, మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది.
దశమి: కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి.
ఏకాదశి: వేద విజ్ఞానం లభిస్తుంది.
ద్వాదశి: వంశాభివృద్ధి జరుగుతుంది.
త్రయోదశి: అపారమైన సంపద, పశులాభం.
చతుర్దశి: ప్రమాదాలు, ఆకస్మిక మరణాలు (బలవన్మరణాలు) పొందిన వారికి ఈ రోజు శ్రాద్ధం పెట్టాలి. అమావాస్య (సర్వపితృఅమావాస్య): పక్షం రోజులు చేయలేని వారు ఈ ఒక్క రోజు శ్రాద్ధం పెట్టినా, పూర్వీకులందరి ఆశీస్సులు లభిస్తాయని ప్రతీతి.
పితృదోషాలు – పరిహారాలు
కుటుంబంలో ఎవరికైనా అకాల మరణాలు సంభవించినా, లేదా పెద్దలకు సరిగ్గా ఆబ్దికాలు నిర్వహించకపోయినా ఆ కుటుంబానికి పితృదోషం చుట్టుకుంటుందని, దీనివల్ల ఇంట్లో నిరంతరం కలహాలు, వివాహం ఆలస్యం కావడం, అప్పుల పాలు కావడం, సంతాన లేమి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయనీ శాస్త్ర కథనం.
పరిహారాలు
మహాలయ పక్షాల సమయంలో నది తీరాలలో లేదా పుణ్యక్షేత్రాలలో తిల హోమం, నారాయణ బలి పూజ ఆచరించడం ద్వారా పితృదోషాలు తొలగిపోతాయి. ఈ రోజుల్లో బ్రాహ్మణులకు స్వయంపాకం (బియ్యం, కూరగాయలు) దానం చేయడం, పేదలకు అన్నదానం చేయడం అత్యంత పుణ్యప్రదం. కాకులకు, గోవులకు రోజూ ఆహారం పెట్టడం వల్ల పితృదేవతలు తృప్తి చెందుతారు. ఈ పితృ పక్షాల సమయంలో కేవలం పితృదేవతల ఆరాధనకే సమయాన్ని కేటాయిస్తారు. భక్తిశ్రద్ధలతో మన పూర్వీకులను స్మరిస్తూ ఈ మహాలయ పక్షంలో తర్పణాలు అర్పించి వారి ఆశీస్సులు పొందడం శ్రేయస్కరం.
ఇదీ చదవండి: ముగ్గురు గురువులు: ఒక దొంగ.. ఒక కుక్క.. ఓ చిన్నారి..!


