అరుదైన శిల్పం
నాగబంధం
ఈ చిత్రంలో కనిపిస్తున్నది కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి చెందిన పురాతన నాగకల్లు శిల్పం. ఇది సుమారు పదవ పదకొండవ శతాబ్దాల నాటిది. ప్రస్తుతం ఇది తమిళనాడులోని చెన్నై ప్రభుత్వ మ్యూజియం పురావస్తు విభాగంలో భద్రపరచబడి ఉంది. ఈ శిల్పం దాదాపు 99 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. శిల్పం పైభాగంలో ఏడు పడగలు విప్పిన సర్పరాజు ఆకృతి అత్యంత నైపుణ్యంతో చెక్కబ\డింది. హిందూ సంప్రదాయంలో దీనిని సంతానోత్పత్తికి, సంరక్షణకు చిహ్నంగా భావిస్తారు.
శిల్పం కింది భాగంలో పాములు ఒకదానితో ఒకటి అల్లుకుపోయి సంక్లిష్టమైన ముడి ఆకారాన్ని తలపిస్తాయి. దీనిని నాగబంధం అని పిలుస్తారు. ఈ ముడి ఎక్కడ మొదలైందో ఎక్కడ పూర్తయిందో గుర్తించడం చాలా కష్టం. ఈ జ్యామితీయ ముడుల రూపం దక్షిణ భారతదేశంలో ఇళ్ల ముందు స్త్రీలు బియ్యప్పిండితో పెట్టే సాంప్రదాయక మెలికల ముగ్గు లేదా రథం ముగ్గును పోలి ఉంటుంది. శిల్పం పైభాగంలో ఎడమవైపు సూర్యుడు, కుడివైపు చంద్రుని ఆకృతులు అలాగే ముడుల మధ్యలో గుండ్రటి పద్మం ఆకారం చెక్కబడి ఉన్నాయి. ఇవి సృష్టిలోని శాశ్వతత్వానికి, పవిత్రతకు చిహ్నాలు.
దక్షిణ భారతదేశంలో నాగారాధన చాలా పురాతనమైనది. సంతానం లేని మహిళలు సంతానోత్పత్తి కోసం వంశాభివృద్ధి కోసం ఇటువంటి నాగకల్లులను ప్రతిష్టించి పూజలు చేసేవారు. పూర్వకాలంలో ఈ నాగకల్లులను గ్రామాల సరిహద్దులలో గుడుల ప్రవేశ ద్వారాల వద్ద పవిత్రమైన రావి చెట్ల కింద లేదా చెరువుల గట్లపై ప్రతిష్టించేవారు. ఇవి గ్రామానికి రక్షణ కల్పిస్తాయని నమ్మేవారు. నాగ పంచమి రోజున ఈ శిల్పాలకు పాలు పెరుగు నెయ్యి కొబ్బరినీళ్లు పోసి పూజలు చేస్తారు.
చెన్నై ప్రభుత్వ మ్యూజియంలో 700కు పైగా శిలా శిల్పాలు ఉన్నాయి. వాటిలో సుమారు 10 నాగకల్లు శిల్పాలు ఉన్నాయి. ఈ మ్యూజియం ప్రపంచంలోనే అత్యధిక కాంస్య విగ్రహాల సేకరణ కలిగిన సంస్థలలో ఒకటి. ఈ శిల్పం ప్రాచీన భారతదేశంలోని శిల్పుల అసాధారణ రేఖాగణిత పరిజ్ఞానానికి రాతిపై వారు చూపిన సూక్ష్మ నైపుణ్యానికి ఒక సజీవ సాక్ష్యం.
– జి.బి.విశ్వనాథ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్
ఇదీ చదవండి: మహాలయ పక్షం వచ్చేసింది.. ఈ 15 రోజులు ఏం చేయాలో తెలుసా?


