భక్తి
(25, శుక్రవారం అనంత పద్మనాభ చతుర్దశి)
జీవితంలో వచ్చే కష్టాలు, బాధల నుంచి విముక్తి పొందడానికి, సకల ఐశ్వర్యాలు కలగడానికి ఆచరించ వలసిన వ్రతం అనంత పద్మనాభ వ్రతం. భాద్రపద మాసంలో శుక్ల చతుర్దశికే అనంత పద్మనాభ చతుర్దశి అని పేరు. అనంత వ్రతం ఆచరించే పవిత్రమైన పర్వదినం ఇదే. ఈ రోజున ఆదిశేషువుపై యోగనిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువును (అనంత పద్మనాభుడిని) భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. రేపు అనంత పద్మనాభ చతుర్దశి సందర్భంగా ఆ వ్రతానికి సంబంధించిన పూజా విధానం, వ్రత కథ...
వినాయక చవితితో ప్రారంభమైన గణేశ ఉత్సవాలు పదవరోజైన ఈ అనంత చతుర్దశి నాడే గణపతి నిమజ్జనంతో ముగుస్తాయి. 14 ముడులు ఉన్న అనంత సూత్రం అనే పవిత్రమైన తోరపు దారాన్ని చేతికి కట్టుకోవడం ఈ వ్రతంలో ప్రధాన ఆచారం. ఈ దారం సాధారణంగా ఎరుపు రంగులో ఉంటుంది. వీటిని ఎప్పటికప్పుడు కొత్తగా తయారు చేసుకోరు. ఇంటి ఆచారం ప్రకారం ముందు తరాల నుంచి తర్వాతి వారికి అందుతూ ఉంటాయి.
కలశ స్థాపన:
పూజా స్థలంలో బియ్యం పోసి, దానిపై వెండి లేదా రాగి కలశాన్ని ఉంచుతారు. కలశంపై దర్భలతో చేసిన ఏడు పడగల శేషనాగు (పాము) బొమ్మను ఉంచి పూజిస్తారు.
యమునా పూజ:
ప్రధాన పూజకు ముందు ఒక పాత్రలో నీటిని తీసుకుని, అందులోకి యమునా నదీదేవతను ఆవాహన చేసి పూజించడం ఈ వ్రతంలో ఒక ముఖ్య విశేషం.
అనంత సూత్ర పూజ:
కుంకుమ, పసుపు రాసిన 14 ముడులు కలిగిన ఎరుపు రంగు దారాన్ని (అనంత తోరం) స్వామివారి వద్ద ఉంచి పూజిస్తారు. పూజ పూర్తయిన తర్వాత పురుషులు కుడిచేతికి, స్త్రీలు ఎడమచేతికి ఈ తోరాన్ని కట్టుకుంటారు.
షోడశోపచార పూజ:
శ్రీ అనంత పద్మనాభ స్వామికి 14 రకాల పూలు, పత్రాలతో షోడశోపచార పూజ చేస్తారు.
నైవేద్యం:
ఈ వ్రతంలో 14 సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే 14 రకాల పిండి వంటలు లేదా కనీసం 14 బూరెలు/గారెలను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
వ్రత కథ:
మహాభారతంలో అరణ్యవాసం చేస్తూ కష్టాల్లో ఉన్న ధర్మరాజుకు శ్రీ కృష్ణ పరమాత్ముడు ఈ వ్రత మహత్యాన్ని వివరిస్తాడు. పూర్వం కృతయుగంలో జరిగిన కథను చె΄్తాడు: సుమంతుడు అనే బ్రాహ్మణుడి కుమార్తె శీల. ఆమెకు కౌండిన్య మహర్షితో వివాహం జరుగుతుంది.
ఒకసారి శీల నదీతీరంలో స్త్రీలు అనంత వ్రతం ఆచరించడం చూసి, తాను కూడా భక్తితో ఆ వ్రతాన్ని చేసి, 14 ముడుల అనంత సూత్రాన్ని చేతికి కట్టుకుంటుంది. ఆ వ్రత ప్రభావం వల్ల కౌండిన్యుడి ఆశ్రమం అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది. అయితే, ఒకరోజు కౌండిన్యుడు శీల చేతికున్న దారాన్ని చూసి, అది తనను వశపరుచుకోవడానికి కట్టిన తంత్రం అనుకుని, కోపంతో ఆ దారాన్ని తెంపి అగ్నిలో పారేస్తాడు.
అత్యంత పవిత్రమైన అనంత సూత్రాన్ని అవమానించినందుకు, ఆ క్షణం నుండి వారి ఐశ్వర్యం అంతా హరించుకుపోయి, వారు తీవ్ర దారిద్య్రం లో మునిగిపోతారు. తమ తప్పును తెలుసుకున్న కౌండిన్యుడు పశ్చాత్తాపంతో అడవుల పాలై, అనంత పద్మనాభ స్వామి కోసం తీవ్రంగా అన్వేషిస్తాడు. చివరకు స్వామివారు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో దర్శనమిచ్చి, ఓదార్చుతారు. స్వామి వారి ఆజ్ఞ ప్రకారం కౌండిన్యుడు 14 సంవత్సరాల పాటు నిష్ఠగా అనంత వ్రతాన్ని ఆచరించి, కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందుతాడు. ఈ వ్రతాచరణతో ఎలాంటి కష్టాల నుండైనా గట్టెక్కవచ్చని శ్రీ కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు.
ఇదీ చదవండి: ఏడు పడగల నాగకల్లు.. ఈ ముడి రహస్యం ఏంటి?


