‘నా పరుగు ముగిసిందనుకున్నా’ | Indian athlete Jyoti Yarraj comments on Asian Games | Sakshi
Sakshi News home page

‘నా పరుగు ముగిసిందనుకున్నా’

Jun 27 2026 3:25 AM | Updated on Jun 27 2026 3:25 AM

Indian athlete Jyoti Yarraj comments on Asian Games

ఆసియా క్రీడల్లో స్వర్ణమే లక్ష్యం

భారత అథ్లెట్‌ జ్యోతి యర్రాజీ వ్యాఖ్య 

భువనేశ్వర్‌: సరిగ్గా సంవత్సరం క్రితం... భారత అథ్లెట్‌ జ్యోతి యర్రాజీ కెరీర్‌ ఘనంగా సాగుతున్న సమయం. అప్పటికే గ్వాంగ్జూ ఆసియా క్రీడల 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆమె... కొన్నాళ్ల క్రితమే దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో కూడా స్వర్ణం గెలుచుకుంది. అయితే ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో జ్యోతి మోకాలికి అనూహ్యంగా గాయమైంది. చికిత్సలో భాగంగా ఆమెకు యాంటీరియర్‌ క్రూషియెట్‌ లిగమెంట్‌ (ఏసీఎల్‌) సర్జరీ జరిగింది. అయితే దీని నుంచి కోలుకునే క్రమంలో దాదాపు 10 నెలల పాటు ఆమె ట్రాక్‌కు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. 

ఈ సమయంలో తీవ్రమైన మానసిక వేదనను అనుభవించానని, తన కెరీర్‌ ముగిసినట్లే భావించానని జ్యోతి వెల్లడించింది. ‘ఎన్నో రాత్రులు నేను తీవ్రంగా ఏడ్చేశాను. దీనికి ముందు కూడా నేను చాలా సార్లు గాయపడ్డా. ఆ సమయంలో నా పని అయిపోయినట్లే అనిపించింది. ఇక అథ్లెటిక్స్‌ కెరీర్‌ ముగిసినట్లే భావించా. అయితే మళ్లీ నాకు నేనే ధైర్యం చెప్పుకొని ఎలాగైనా మళ్లీ ఆడాలని పట్టుదలగా నిలబడ్డా. ఇప్పుడు సరిగ్గా ఏడాది తర్వాత అదే రోజు ట్రాక్‌పైకి వచ్చి మంచి ప్రదర్శన ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది’ అని ఆమె చెప్పింది.  

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన 26 ఏళ్ల జ్యోతి ఇటీవల ముగిసిన జాతీయ సీనియర్‌ అంతరాష్ట్ర చాంపియన్‌షిప్‌లో 12.99 సెకన్ల టైమింగ్‌తో 100 మీటర్ల హర్డిల్స్‌ రేసును పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల క్వాలిఫయింగ్‌ మార్క్‌ (13.34 సెకన్లు)ను సునాయాసంగా అధిగమించి ఆమె పోటీలకు అర్హత సాధించింది. 2023లో సాధించిన 12.78 సెకన్ల టైమింగ్‌తో ఇప్పటికీ జాతీయ రికార్డు జ్యోతి పేరిటే ఉంది. ‘నిజానికి 12.6 సెకన్ల టైమింగ్‌ నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. అది సాధ్యం కాకపోయినా నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా. 

ఏడాది తర్వాత బరిలోకి దిగి ఇలాంటి ప్రదర్శన ఇచ్చా. ఒక్కో అడుగు దాటుతూ ముందుకు వెళతా. పోటీలో ఒత్తిడిని ఎదుర్కోలేదు కానీ శారీరకంగానే ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. రీహాబిలిటేషన్‌ తర్వాత  రెండు నెలల క్రితమే మళ్లీ ప్రాక్టీస్‌ మొదలు పెట్టాను. ఆ సమయంలో రెండు రేస్‌లు మాత్రమే పూర్తిగా పరుగెత్తాను. నేను 100 శాతం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయా. కానీ మున్ముందు మెరుగుపరుస్తా’ అని జ్యోతి వెల్లడించింది. గత ఏషియాడ్‌లో రజతం తర్వాత ఈసారి ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుచుకోవడమే లక్ష్యంగా ఆమె బరిలోకి దిగనుంది. కోచ్‌ల సహకారంతో దానిపై దృష్టి పెట్టినట్లు జ్యోతి పేర్కొంది. 

‘ఆసియా క్రీడలకు మరో మూడు నెలలు ఉన్నాయి కాబట్టి కావల్సినంత సమయం నాకు ఉంది. ఇది నా మొదటి రేస్‌ మాత్రమే. ఫిట్‌నెస్‌పై కూడా దృష్టి పెట్టాల్సి ఉంది. మోకాలికి మరింత రీహాబిలిటేషన్‌ అవసరం. స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ వేన్‌ లాంబార్డ్‌తో గత రెండు నెలలుగా పని చేస్తున్నా. ఆయన వల్లే నేను ఇక్కడ పోటీ పడగలిగా. కోచ్‌ జేమ్స్‌ హిల్లర్‌ కూడా ఎంతో శ్రమించారు. గత కొంత కాలంగా ఇద్దరం కలిసి ఎంతో శ్రమించామో ఆయన గుర్తు చేశారు. ఇదే రీతిలో ఆసియా క్రీడలకు కష్టపడి స్వర్ణం సాధించాలని భావిస్తున్నా’ అని జ్యోతి వివరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement