క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీపై 3–0తో విజయం
సెమీఫైనల్ బెర్త్‌తో టీమిండియాకు పతకం ఖాయం
హోర్‌సెన్స్ (డెన్మార్క్): తమదైన రోజున సహజశైలిలో చెలరేగితే... ప్రత్యర్థి జట్టులో తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లు ఉన్నా... అద్భుత ఫలితం సాధించవచ్చని భారత షట్లర్లు నిరూపించారు. ప్రతిష్టాత్మక థామస్ కప్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నిలో తమ అసాధారణ ప్రదర్శనతో భారత పురుషుల జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 3–0తో చైనీస్ తైపీ జట్టును చిత్తు చేసింది.
ఈ విజయంతో సెమీఫైనల్‌కు చేరుకున్న భారత జట్టుకు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. జపాన్, ఫ్రాన్స్ జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్ విజేతతో నేడు జరిగే సెమీఫైనల్లో భారత జట్టు తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో చైనా 3–0తో మలేసియాపై గెలిచింది. థాయ్‌లాండ్, డెన్మార్క్ జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్ విజేతతో నేడు జరిగే సెమీఫైనల్లో చైనా ఆడుతుంది. 2022లో తొలిసారి థామస్‌కప్ చాంపియన్‌గా అవతరించిన భారత జట్టు 2024లో మాత్రం క్వార్టర్ ఫైనల్లో చైనా జట్టు చేతిలో ఓడిపోయింది.
2 మ్యాచ్ పాయింట్లు కాపాడుకొని...
చైనీస్ తైపీతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో తొలి మ్యాచ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్ లక్ష్య సేన్ 88 నిమిషాల్లో 18–21, 22–20, 21–17తో ప్రపంచ 6వ ర్యాంకర్ చౌ తియెన్ చెన్‌ను ఓడించాడు. ఈ పోరులో రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని లక్ష్య సేన్ నెగ్గడం విశేషం. తొలి గేమ్ కోల్పోయిన లక్ష్య సేన్ రెండో గేమ్‌లో 18–20తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచాడు. ఈ దశలో సంయమనం కోల్పోకుండా ఆడిన లక్ష్య సేన్ వరుసగా 4 పాయింట్లు నెగ్గి 22–20తో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో లక్ష్య సేన్ 10–6తో ఆధిక్యంలోకి వెళ్లి ఆ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని అందుకున్నాడు.
రెండో మ్యాచ్‌లో ప్రపంచ 4వ ర్యాంక్ జోడీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 23–21, 19–21, 21–12తో ప్రపంచ 14వ ర్యాంక్ జంట చియు సియాంగ్ చెయి–వాంగ్ చి లిన్‌పై గెలిచి భారత ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. మూడో మ్యాచ్‌లో ఆసియా చాంపియన్‌షిప్ రన్నరప్, ప్రపంచ 18వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి 48 నిమిషాల్లో 21–16, 21–17తో ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ 8వ ర్యాంకర్ లిన్ చున్ యిని బోల్తా కొట్టించి భారత్‌కు సెమీఫైనల్ బెర్త్‌ను అందించాడు. ఫలితం తేలిపోవడంతో మిగతా రెండు మ్యాచ్‌లు నిర్వహించలేదు.


