కొలంబో: ఇటీవల శ్రీలంకలోని కారాగారాలలో వరుస ఘర్షణలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అక్కడి జైళ్లలో వరుస ఘర్షణలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో రెండు వేర్వేరు జైళ్లలో జరిగిన అల్లర్లలో ముగ్గురు ఖైదీలు మరణించగా, కనీసం 23 మంది గాయపడ్డట్లు అధికారులు తెలిపారు.
అక్కడి మీడియా కథనాల ప్రకారం గత గురువారం అర్ధరాత్రి ప్రారంభమైన అల్లర్లలో ఒక ఖైదీ మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు.అదే సమయంలో, రాజధాని కొలంబోకు సుమారు 80 కిలోమీటర్ల దూరంలోని కురువిటా జైలులో జరిగిన మరో అల్లర్లలో ఇద్దరు ఖైదీలు మరణించగా, 14 మంది గాయపడ్డట్లు కథనాలు ప్రచురించాయి.
ఈ విషయమై అక్కడి మంత్రి మాట్లాడుతూ... శ్రీలంకలోని మూడు దేశాలలో తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయని,ఈ నేపథ్యంలో పోలీసులు, ప్రత్యేక దళాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయని పేర్కొన్నారు. కొలంబోకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని నెగొంబో ఓపెన్ జైలులో కూడా ఖైదీలు నిరసనకు దిగారు. అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు కన్నీటి వాయువు ప్రయోగించారు. అనంతరం అక్కడి ఆందోళనను కూడా నియంత్రించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
మూడు జైళ్ల వద్ద భారీగా పోలీసులు, అల్లర్ల నియంత్రణ బలగాలను మోహరించారు. జైళ్ల పైకప్పులపైకి ఎక్కిన లేదా బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లిన ఖైదీలను తిరిగి వారి వార్డుల్లోకి తరలించినట్లు మంత్రి తెలిపారు. అయితే ఈ రద్దీకి కారణం జైళ్లలో అధిక సంఖ్యలో ఖైదీలుండడమేనని పేర్కొన్నారు. అదే విధంగా ఈ గొడవలకు ఏదైనా అంతర్గత కుట్ర సైతం కారణం కావచ్చని పేర్కొన్నారు.
శ్రీలంకలోని మెుత్తం 22 జైళ్లున్నాయి. అందులో ఒక్కో జైలులో సగటున 41 వేల మంది ఖైదీలున్నారు. వాస్తవానికి వాటిలో 11 వేల మంది మాత్రమే ఉండేలా సామర్థ్యంతో నిర్మించారు. అంటే జైళ్లలో ఉన్న ఖైదీల సంఖ్య వాటి సామర్థ్యానికి అనేక రెట్లు ఎక్కువగా ఉంది.మొత్తం ఖైదీలలో మూడు వంతులకు పైగా విచారణ కోసం ఎదురుచూస్తున్న రిమాండ్ ఖైదీలే ఉన్నారు. వీరిలో చాలామంది మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసుల్లో నిందితులుగా ఉన్నారు.


