సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ హషీం ఆమ్లా (Hashim Amla) వన్డేల్లో తన ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. ఈ జట్టులో టీమిండియా నుంచి ముగ్గురికి స్థానం కల్పించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. లెజెండరీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను మాత్రం విస్మరించాడు.
అంతర్జాతీయ కెరీర్‌లో సౌతాఫ్రికా తరఫున 124 టెస్టులు, 181 వన్డేలు, 44 టీ20 మ్యాచ్‌లు ఆడిన హషీం ఆమ్లా.. టెస్టుల్లో 9282, వన్డేల్లో 8113, టీ20లలో 1277 పరుగులు సాధించాడు. ఇక 2023 జనవరిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలిగాడు ఆమ్లా. తాజాగా శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఈ దిగ్గజ బ్యాటర్.. తన ఆల్‌టైమ్ వన్డే జట్టును ఎంచుకున్నాడు.
ఓపెనర్లుగా వారే
ఈ జట్టుకు ఓపెనర్లుగా టీమిండియా లెజెండ్ సచిన్ టెండుల్కర్, ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్‌క్రిస్ట్‌లను ఆమ్లా ఎంపిక చేసుకున్నాడు. ఇక మూడో స్థానంలో భారత మరో బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli)కి స్థానమిచ్చాడు. వన్డే ఫార్మాట్లో 51 శతకాలతో ప్రపంచ రికార్డు సాధించినందుకు తాను కోహ్లికి ఓటు వేస్తున్నట్లు ఆమ్లా ఈ సందర్భంగా తెలిపాడు.
ఏడో స్థానంలో ధోని
ఇక నాలుగు, ఐదు స్థానాలకు వెస్టిండీస్ లెజెండ్ బ్రియన్ లారా, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ను ఆమ్లా ఎంపిక చేశాడు. ఆరో స్థానంలో దీర్ఘకాలం తనకు సహచర క్రికెటర్‌గా ఉన్న జాక్వెస్ కలిస్‌కు చోటిచ్చిన ఆమ్లా... ఏడో స్థానానికి భారత దిగ్గజ కెప్టెన్, మూడు ఐసీసీ టైటిళ్లు సాధించిన మహేంద్ర సింగ్ ధోనిని ఎంచుకున్నాడు.
బౌలర్లుగా వీరికే ఛాన్స్
బౌలింగ్ విభాగంలో ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లకు ఆమ్లా చోటిచ్చాడు. శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్, ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్‌కు తన జట్టులో స్థానం కల్పించిన ఆమ్లా.. పేసర్ల కోటాలో పాకిస్తాన్ ఫాస్ట్‌బౌలింగ్ దిగ్గజం వసీం అక్రం, సౌతాఫ్రికా డైనమైట్ బౌలర్ డేల్ స్టెయిన్‌లకు చోటిచ్చాడు.
దిగ్గజ బ్యాటర్
అయితే, టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మకు మాత్రం ఆమ్లా తన జట్టులో స్థానం ఇవ్వకపోవడం గమనార్హం. వన్డేల్లో అత్యధికంగా మూడుసార్లు డబుల్ సెంచరీ చేసిన ఘనత రోహిత్‌ది. అంతేకాదు యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) కూడా అతడిదే.
అంతేకాదు.. కెప్టెన్‌గా టీమిండియాను వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్‌కు చేర్చిన రోహిత్ శర్మ.. 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (వన్డే) కూడా గెలిచాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో పర్యటనలో భాగంగా సిడ్నీలో జరిగిన ఆఖరి వన్డేలో శతక్కొట్టిన హిట్‌మ్యాన్.. ఐసీసీ వన్డే వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచాడు. అదే విధంగా.. అతడి ఖాతాలో 33వ వన్డే శతకాన్ని జమ చేసుకున్నాడు.
హషీం ఆమ్లా ఎంచుకున్న ఆల్‌టైమ్ వన్డే ప్లేయింగ్ ఎలెవన్
సచిన్ టెండుల్కర్, ఆడం గిల్‌క్రిస్ట్, విరాట్ కోహ్లి, బ్రియాన్ లారా, ఏబీ డివిలియర్స్, జాక్వెస్ కలిస్, ఎంఎస్ ధోని, ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, వసీం అక్రం, డేల్ స్టెయిన్.
చదవండి: ‘ఆడమని బతిమిలాడినా పట్టించుకోలేదు... సెలక్టర్లు అడిగినా రాలేదు’


