టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami) పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే జట్టును ప్రకటించే సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) చేసిన వ్యాఖ్యలు.. బదులుగా షమీ కౌంటర్ ఇవ్వడం ఇందుకు కారణం.
షమీ ఫిట్‌నెస్ గురించి అప్‌డేట్ లేదని అగార్కర్ తెలపగా.. రంజీలు ఆడే తాను వన్డేలు ఆడలేనా? అంటూ షమీ గట్టిగానే బదులిచ్చాడు. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని.. అయితే, జట్టు ఎంపిక సమయంలో తనను సెలక్టర్లు ఎవరూ సంప్రదించలేదని బాంబు పేల్చాడు.
మరో‘సారీ’
ఇందుకు బదులిస్తూ.. షమీ ఫిట్‌గా లేనందువల్లే అతడిని ఆసీస్ టూర్‌కు ఎంపిక చేయలేదని అగార్కర్ పునరుద్ఘాటించాడు. ఈ క్రమంలో బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ (Ranji Trophy) తాజా సీజన్‌లో ఒకే మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు కూల్చి ఆటతోనే బదులిచ్చాడు షమీ.
ఈ పరిణామాల నేపథ్యంలో సౌతాఫ్రికాతో నవంబరులో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌కు షమీని ఎంపిక చేస్తారనే విశ్లేషణలు రాగా.. మరోసారి సెలక్టర్లు అతడికి మొండిచేయి చూపారు. ఫలితంగా భారత జట్టు యాజమాన్యంపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆడమని బతిమిలాడినా పట్టించుకోలేదు...
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సీనియర్ అధికారి ఒకరు షమీ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. ఇంగ్లండ్ పర్యటనకు రావాల్సిందిగా షమీని సెలక్టర్లు కోరినా.. అతడు మాత్రం రాలేనని చెప్పాడంటూ ఆరోపించారు.
ఈ మేరకు PTIతో మాట్లాడుతూ.. ‘‘జాతీయ జట్టు సెలక్టర్లు.. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు చెందిన సహాయక సిబ్బంది చాలాసార్లు షమీ ఫిట్‌నెస్ చెక్ చేయాలని కాల్ చేశారు. ఇంగ్లండ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ నేపథ్యంలో షమీ సేవలను ఉపయోగించుకోవాలని ఎంతగానో తపించిపోయారు.
ఇంగ్లండ్ పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా బౌలింగ్ చేయగల సత్తా ఉన్న షమీ వంటి బౌలర్‌ను ఎవరు మాత్రం ఎందుకు కాదనుకుంటారు?.. తనను సెలక్టర్లు ఎవరూ సంప్రదించలేదంటూ షమీ గురించి వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం.
సెలక్టర్లు అడిగినా రాలేదు
అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా మ్యాచ్‌లు ఆడేందుకు షమీ ఫిట్‌గా ఉన్నాడా? లేడా? అన్న అంశంపై స్పోర్ట్స్ సైన్స్ టీమ్ ఎప్పటికప్పుడు అతడి మెడికల్ రిపోర్టులు పరిశీలిస్తూనే ఉంది’’ అని సదరు అధికారి పేర్కొన్నారు. సెలక్టర్లు అడిగినా రాలేదని పరోక్షంగా వెల్లడించాడు. కాగా ఇప్పటికే టెస్టు, టీ20 జట్లలో చోటు కోల్పోయిన షమీ.. వన్డేల్లో మాత్రం సత్తా చాటుతున్నాడు.
చివరగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీలో ఈ రైటార్మ్ పేసర్ భాగమయ్యాడు. ఈ మెగా ఈవెంట్లో షమీ తొమ్మిది వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత ఇంత వరకు మళ్లీ జాతీయ జట్టుకు ఆడలేదు.
కెరీర్‌కు ఎండ్‌కార్డ్
ఇక వన్డే వరల్డ్‌కప్-2027ను దృష్టిలో పెట్టుకుని రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన యాజమాన్యం.. విరాట్ కోహ్లి అందుబాటుపై కూడా క్లారిటీ లేదని చెప్పింది.
ఇలాంటి తరుణంలో 35 ఏళ్ల షమీకి ఇకపై వన్డేలలోనైనా అవకాశం ఇవ్వడం దాదాపు అసాధ్యమని ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఫలితంగా షమీ అంతర్జాతీయ కెరీర్‌కు పూర్తిస్థాయిలో ఎండ్‌కార్డ్ పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి: ఆ ఓవరాక్షనే వద్దనేది.. అదేమైనా వరల్డ్ కప్ ట్రోఫీనా?


