బంగ్లాదేశ్‌లో ఓ వైపు అల్లర్లు కొనసాగుతుంటే.. మరోవైపు క్రికెట్ అభిమానులను అలరించేందుకు బీపీఎల్ 12వ సీజన్ సిద్దమైంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2025-26 శుక్రవారం(డిసెంబర్ 26) నుంచి ప్రారంభం కానుంది. ఆరంభం రోజే రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా సిల్హెట్ టైటాన్స్, రాజ్‌షాహి వారియర్స్ తలపడనున్నాయి.
ఆ తర్వాతి మ్యాచ్‌లో నోఖాలి ఎక్స్‌ప్రెస్, చట్టోగ్రామ్ రాయల్స్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. నోఖాలి ఎక్స్‌ప్రెస్.. బీపీఎల్‌లో చేరిన కొత్త ఫ్రాంచైజీ. ఈ జట్టుకు ఇదే తొలి సీజన్. అయితే నోయాఖాలీ ఎక్స్‌ప్రెస్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో అనుహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నోయాఖాలీ ఎక్స్‌ప్రెస్.. ఛటోగ్రామ్ రాయల్స్‌తో తమ మొదటి మ్యాచ్‌కు సన్నద్దమయ్యేందుకు గురువారం సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి వెల్ళింది.
అలిగిన కోచ్‌లు..
అయితే ప్రాక్టీస్ మధ్యలోనే హెడ్ కోచ్ ఖలీద్ మహముద్, అసిస్టెంట్ కోచ్ తల్హా జుబేర్ బయటకు వచ్చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రాక్టీస్ సెషన్‌లో కనీసం సరిపడా క్రికెట్ బంతులు కూడా లేకపోవడంతో వారిద్దరూ అసహనం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ మాజీ పేసర్ అయిన ఖలీద్ మహముద్ గత సీజన్ వరకు ఢాకా క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా పనిచేశాడు. అయితే ఈ సీజన్‌లో ఫ్రాంచైజీ నోయాఖాలీ ఎక్స్‌ప్రెస్‌తో జత కట్టాడు.
కానీ అతడికి ఆరంభంలోనే చేదు అనుభవం ఎదురైంది. ప్రాక్టీస్‌కు జట్టుతో పాటు వెళ్లిన ఖలీద్ మహముద్‌తో బీసీబీ అధికారి ఒకరు దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. దీంతో ఖలీద్,జుబేర్ ఇద్దరూ స్టేడియం బయటకు వచ్చి ఆటోలో వెళ్లిపోయారు. ఈ సందర్భంగా జుబేర్ మీడియాతో మాట్లాడుతూ.. నా కెరీర్‌లో ఎన్నో బీపీఎల్ సీజన్లను చూశాను. కానీ ఇప్పటివరకు ఎటువంటి పరిస్ధితి ఎప్పుడూ ఎదురు కాలేదు. మిగతా వారు గురుంచి నాకు అనవసరం. ఇలాంటి పరిస్థితుల్లో నేను కొనసాగలేను పేర్కొన్నారు.
అదేవిధంగా హెడ్ కోచ్ ఖలీద్ మహముద్ స్పందిస్తూ.. నేను బీపీఎల్ నుంచి వైదొలగాలనుకుంటున్నాను. ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని చెప్పుకొచ్చారు. అయితే కొన్ని గంటల తర్వాత మహమూద్, జుబేర్ తిరిగి మైదానంకు వచ్చారు.
ఇద్దరి సన్నిహితుడు ఒకరు జోక్యంతో వారు మనసు మార్చుకున్నారు. అదేవిధంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మరోషాక్ తగిలింది. ఛటోగ్రామ్ రాయల్స్ జట్టు యాజమాన్యం టోర్నీ ఆరంభానికి ముందు తప్పుకొంది. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఆ ఫ్రాంచైజీ బాధ్యతలను తీసుకోవాల్సి వచ్చింది.
చదవండి: IND vs NZ: టీమిండియాకు గుడ్ న్యూస్..


