ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా.. టీ20 సిరీస్‌లో గెలిచి బదులు తీర్చుకుంది. కంగారూ గడ్డపై ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1తో గెలిచి సత్తా చాటింది. ఇక వర్షం కారణంగా తొలి, ఐదో టీ20 రద్దైన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు టీమిండియా స్టార్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh)ను పక్కనపెట్టడం చర్చనీయాంశమైంది. పొట్టి ఫార్మాట్లో భారత్ తరఫున వందకు పైగా వికెట్లు తీసి హయ్యస్ట్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్న అర్ష్‌ను కాదని.. హర్షిత్ రాణా (Harshit Rana)ను ఆడించడం విమర్శలకు దారితీసింది.
అందుకే ఆడించారా?
హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)కు ప్రియ శిష్యుడైన కారణంగానే హర్షిత్‌కు తుదిజట్టులో చోటిచ్చి.. అర్ష్‌ను బలి చేస్తున్నారనే ట్రోల్స్ వచ్చాయి. అయితే, ఎట్టకేలకు మూడో టీ20 నుంచి హర్షిత్‌ను తప్పించి.. అర్ష్‌దీప్‌ను ఆడించగా.. అతడు సత్తా చాటాడు.
మూడో టీ20లో హర్షిత్‌ను బెంచ్‌కు పరిమితం చేసి అర్ష్‌దీప్‌ను తీసుకురాగా.. అతడు మూడు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. నాలుగో టీ20లోనూ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ నేపథ్యంలో గంభీర్ తాజాగా ఈ విషయాలపై స్పందించాడు.
అన్నింటికంటే కష్టమైన పని
బీసీసీఐ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా.. కీలక ఆటగాళ్లను బెంచ్‌కే పరిమితం చేయాల్సి వచ్చినపుడు మీరెలా హ్యాండిల్ చేస్తారు అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘కోచ్‌గా నాకిదే అన్నింటికంటే కష్టమైన పని.
నాణ్యమైన ఆటగాళ్లను బెంచ్ మీద కూర్చోబెట్టాల్సి వచ్చినపుడు వారితో ఆ విషయం చెప్పడం కఠినంగానే ఉంటుంది. ప్రతి ఒక్కరు తుదిజట్టులో ఆడేందుకు అర్హులే. కానీ కూర్పు దృష్ట్యా మేము మాకు కావాల్సిన పదకొండు మందినే ఎంచుకుంటాం.
మ్యాచ్ పరిస్థితికి తగ్గట్లుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాం. అయితే, ఓ ఆటగాడితో .. ‘నీకు ఈ మ్యాచ్‌లో అవకాశం లేదు’ అని చెప్పడం కష్టం. అయితే, కూడా అందుకు గల కారణాన్ని స్పష్టంగా వివరించడం వల్ల పెద్దగా సమస్యలు రావు.
అతడిని అందుకే పక్కనపెట్టాం
ఆటగాళ్లు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. కోచ్, ప్లేయర్.. ఇద్దరి మధ్య ఇలాంటి సంభాషణ ఇద్దరికీ కష్టంగానే ఉంటుంది. కానీ ఒక్కోసారి కఠినంగా ఉండక తప్పదు. అయితే, కోచ్ చెప్పే విషయంలో నిజం, నిజాయితీ, ముక్కుసూటితనం ఉందని ఆటగాడు తెలుసుకుంటే.. ఇక అతడికి ఎలాంటి అభ్యంతరం ఉండదు.
చాలా మంది ప్లేయర్లు ఇలాంటి సమయంలో పరిణతితో వ్యవహరిస్తారు. ఏదేమైనా కమ్యూనికేషన్ అత్యంత ముఖ్యం. బయట చాలా మంది ఇష్టారీతిన మాట్లాడుతూ.. వివాదాలు సృష్టించేందుకు థియరీలు కనిపెడుతుంటారు.
అయితే, జట్టులో సమన్వయం ఉన్నపుడు ఇలాంటి వాటి వల్ల పెద్దగా ప్రభావం పడదు. డ్రెసింగ్‌రూమ్‌లో పారదర్శకత, నిజాయితీ అవసరం. ప్రస్తుతం మేము అదే చేస్తున్నాం’’ అని గంభీర్ విమర్శలను కొట్టిపారేశాడు.
చదవండి: కోచ్‌గా అలాంటి పని ఎప్పటికీ చేయను: కుండబద్దలు కొట్టిన గంభీర్


