టీమిండియా హెడ్‌కోచ్, భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ (Gautam Gambhir)కు ముక్కుసూటిగా మాట్లాడటం అలవాటు. దీనికి తోడు దూకుడు స్వభావం కారణంగా ఎన్నోసార్లు విమర్శలు మూటగట్టుకున్నాడు గౌతీ. అయినా.. కూడా తగ్గేదేలే అంటూ అలాగే ముందుకు సాగుతున్నాడు. అతడి తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
ఇటీవల గౌతీ మార్గదర్శనంలో ఆస్ట్రేలియా పర్యటన (IND vs AUS)లో వన్డే సిరీస్‌ను టీమిండియా 1-2తో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు ముందు వన్డే కెప్టెన్‌గా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న యాజమాన్యం.. టెస్టు సారథి శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కే వన్డే పగ్గాలూ అప్పగించింది.
చేదు అనుభవం
ఇక వన్డే కెప్టెన్‌గా ఆసీస్ రూపంలో తొలి ప్రయత్నంలోనే కఠిన సవాలు ఎదుర్కొన్న గిల్.. ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా చేదు అనుభవం చవిచూశాడు. తొలి రెండు వన్డేల్లో ఓడి భారత్ ముందుగానే సిరీస్ కోల్పోగా.. ఆఖరిదైన నామమాత్రపు మూడో వన్డేలో మాత్రం గెలిచి క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకుంది.
‘రో-కో’దే కీలక పాత్ర
ఈ విజయంలో రీఎంట్రీ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిదే కీలక పాత్ర. రోహిత్ అజేయ శతకం (121)తో దుమ్ములేపగా.. కోహ్లి 74 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి విజృంభణ కారణంగా ఆసీస్ విధించిన 236 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఓటమి పట్ల గౌతం గంభీర్ తాజాగా స్పందించాడు. బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ.. సిరీస్ ఓడిపోవడం ఎంతమాత్రం ఉపేక్షించదగింది కాదని.. తాను అందుకే మూడో వన్డే గెలుపు సెలబ్రేట్ చేసుకోలేదంటూ కుండబద్దలు కొట్టాడు.
వాటిని పట్టించుకోను
‘‘వ్యక్తిగత ప్రదర్శనలను నేనెప్పుడూ పట్టించుకోను. అయితే, వారి ప్రదర్శన పట్ల సంతోషంగా ఉంటాను. ఏదేమైనా అంతిమంగా మనం సిరీస్ ఓడిపోయాం.
అన్నింటికంటే అదే అతి ముఖ్యమైన విషయం. కోచ్‌గా నేను ఇలాంటి వాటిని ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకోను. ఓ ఆటగాడిగా.. వ్యక్తిగత ప్రదర్శనలను అభినందిస్తా. కానీ కోచ్‌గా ఇలాంటివి జీర్ణించుకోలేను.
కోచ్‌గా అలాంటి పని ఎప్పటికీ చేయను
దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నపుడు ఆటగాళ్లైనా, కోచ్ అయినా ఇలాంటి ఘోర ఓటమి తర్వాత వచ్చిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం సరికాదు కూడా!.. ఏదేమైనా మేము ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్ గెలిచాం.
ఇదొక భిన్నమైన ఫార్మాట్. అయితే, ఈ సిరీస్‌లో సానుకూల అంశాలతో పాటు నేర్చుకోవాల్సిన గుణపాఠాలు కూడా ఉన్నాయి’’ అని గంభీర్ తన మనసులోని భావాలను కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పాడు.
కాగా ఆసీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో.. మొదటి. ఆఖరి మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దు అయ్యాయి. అయితే, రెండో టీ20లో ఓడిన సూర్యకుమార్ సేన వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది.
చదవండి: వన్డే ఆల్‌టైమ్ జట్టు.. టీమిండియా నుంచి ముగ్గురు.. రోహిత్‌కు దక్కని చోటు


