సీఎస్‌కే (PC: IPL/BCCI)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ పన్నెండు మంది ఆటగాళ్లను వదిలేసింది. క్యాష్ రిచ్ లీగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) జట్టును వీడగా.. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర వంటి ప్లేయర్లను వదిలించుకుంది.
అయితే, సీఎస్‌కే ‘బేబి మలింగ’, శ్రీలంక పేసర్ మతీశ పతిరణను కూడా వేలంలోకి వదలడం విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. చెన్నైని ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) ప్రియ శిష్యుడిగా పేరొందాడు పతిరణ. ధోని నాయకత్వం, మార్గదర్శనంలో అంచెలంచెలుగా ఎదిగి సీఎస్‌కే ప్రధాన పేసర్లలో ఒకడిగా మారాడు.
రూ. 20 లక్షలతో చేరి.. 13 కోట్లకు..
ఐపీఎల్-2022 సీజన్ సందర్భంగా రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా రూ. 20 లక్షలతో సీఎస్‌కేలో చేరాడు పతిరణ. ఆ మరుసటి ఏడాది అంటే.. 2023లో రూ. 20 లక్షలకు జట్టుతో ఉన్న ఈ యువ పేసర్.. చెన్నై ఐదోసారి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 12 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 19 వికెట్లు కూల్చి సత్తా చాటాడు.
ఇక గతేడాది రూ. 20 లక్షలకు పతిరణను రిటైన్ చేసుకోగా.. గాయం వల్ల ఆడలేకపోయాడు. అయితే, ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ఏకంగా రూ. 13 కోట్లు వెచ్చించి చెన్నై అతడిని అట్టిపెట్టుకుంది. అయితే, ఈసారి పతిరణ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 12 మ్యాచ్‌లు ఆడి కేవలం 13 వికెట్లు తీశాడు. ఎకానమీ 10.13.
పెంచి, పోషించి.. అతడిని ఎలా వదిలేశారు?
ఈ నేపథ్యంలోనే చెన్నై పతిరణను విడిచిపెట్టడం గమనార్హం. ఈ విషయంపై టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ సబా కరీం స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘పతిరణ కోసం సీఎస్‌కే చాలా ఖర్చు చేసింది. అతడిని పెంచి, పోషించి.. తీర్చిదిద్దింది.
అతడు కూడా జట్టు కోసం శ్రమించాడు. విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. నిజానికి పతిరణ ప్రపంచవ్యాప్తంగా అనేక లీగ్‌లలో ఆడుతున్నాడు. వేర్వేరు వికెట్లపై ఎలా బౌలింగ్ చేయాలో అతడికి అవగాహన ఉంది. నైపుణ్యం గల బ్యాటర్లను కూడా పతిరణ బోల్తా కొట్టించగలడు.
అలాంటి బౌలర్‌ను.. ముఖ్యంగా తాము పెద్ద చేసిన బౌలర్‌ను సీఎస్‌కే ఎలా వదిలేసిందో నాకైతే అర్థం కావడం లేదు. గతేడాది కాస్త వెనుకబడినా అతడు తిరిగి పుంజుకోగలడు. అతడిపై మరోసారి నమ్మకం ఉంచాల్సింది’’ అని సబా కరీం అభిప్రాయపడ్డాడు.
సీఎస్‌కేలోకి సంజూ శాంసన్
ఇదిలా ఉంటే.. సుదీర్ఘకాలంగా తమతో ఉన్న రవీంద్ర జడేజాతో పాటు.. సామ్ కర్రాన్‌ను వేలానికి ముందే రాజస్తాన్ రాయల్స్‌కు ట్రేడ్ చేసింది సీఎస్‌కే. ఇందుకు బదులుగా రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను తమ జట్టులోకి చేర్చుకుంది. ఇక ఐపీఎల్-2026 సీజన్‌లోనూ రుతురాజ్ గైక్వాడ్‌నే తమ కెప్టెన్‌గా కొనసాగిస్తామని ఇప్పటికే సీఎస్‌కే స్పష్టం చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ లిస్టు
మతీశ పతిరణ, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, దీపక్ హుడా, వన్ష్ బేడి, సి ఆండ్రీ సిద్దార్థ్, షేక్ రషీద్, కమ్లేశ్ నాగర్‌కోటి, రవీంద్ర జడేజా (ట్రేడింగ్), సామ్ కర్రాన్ (ట్రేడింగ్).


