టీమిండియా అప్ కమింగ్ స్టార్, మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఓ అద్భుతమైన రికార్డు సాధించాడు. దేశవాలీ వన్టే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. రుతు కేవలం 55 ఇన్నింగ్స్‌ల్లోనే సిక్సర్ల సెంచరీ పూర్తి చేశాడు. గతంలో ఈ రికార్డు కర్ణాటక ఆటగాడు మనీశ్ పాండే పేరిట ఉండేది. మనీశ్‌కు ఈ మైలురాయిని తాకేందుకు 99 ఇన్నింగ్స్‌లు పట్టింది.
వీహెచ్‌టీ చరిత్రలో మనీశ్ తర్వాత 100 సిక్సర్ల మార్కును తాకిన రెండో ఆటగాడు కూడా రుతురాజే. రుతురాజ్ సాధించిన ఈ సిక్సర్ల రికార్డు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత వీహెచ్‌టీ ఎడిషన్‌లో రుతు 100 సిక్సర్ల రికార్డును సాధించాడు. ఈ ఎడిషన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న రుతు.. ఓ సెంచరీ, హాఫ్ సెంచరీ చేశాడు.
ఓవరాల్‌గా లిస్ట్-ఏ క్రికెట్‌లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉన్న రుతు.. తాజాగా సౌతాఫ్రికాతో వన్డేలో టీమిండియా తరఫున అద్భుత శతకం బాదాడు. అయినా అతనికి త్వరలో న్యూజిలాండ్‌తో జరుగబోయే వన్డే సిరీస్‌లో అవకాశం రాలేదు. చాలాకాలం క్రితమే రుతు భారత టీ20 ఫార్మాట్ నుంచి ఔటయ్యాడు.
ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియాలో విపరీతమైన పోటీ ఉన్న కారణంగా రుతు అద్భుతంగా రాణిస్తున్నా అవకాశాలు రావడం లేదు. త్వరలో రుతు ఐపీఎల్-2026లో సీఎస్‌కేకు నాయకత్వం వహించనున్నాడు. కొద్ది రోజుల క్రితం వరకు రుతు సీఎస్‌కే కెప్టెన్సీ కూడా ఊడుతుందని ప్రచారం జరిగింది. అయితే మేనేజ్‌మెంట్ ఇతనిపై భరోసా ఉంచింది.


