2024లో టైటిల్ గెలిచిన కేకేఆర్ (PC: IPL/BCCI)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అరంగేట్రం చేసిన నాటి నుంచి ఇప్పటిదాకా వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer) ఒకే జట్టుతో కొనసాగాడు. రూ. 20 లక్షల కనీస ధరతో ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను 2021లో కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వరుస అవకాశాలు ఇచ్చి అతడిని ప్రోత్సహించింది.
ఇందుకు తగ్గట్లుగానే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న వెంకటేశ్ అయ్యర్.. ఫ్రాంఛైజీ నమ్మకాన్ని చూరగొన్నాడు. ఫలితంగా జట్టులో చేరిన మరుసటి ఏడాదే అంటే.. 2022లో వేలానికి ముందు కేకేఆర్ అతడిని ఏకంగా రూ. 8 కోట్లకు రిటైన్ చేసుకుంది. భారీ హైక్ ఇచ్చి వరుస మ్యాచ్‌లలో ఆడించింది.
మెరుపు అర్ధ శతకంతో
ఇక 2023, 2024 సీజన్లలోనూ వెంకీకి రూ. 8 కోట్ల మొత్తం చెల్లించింది. గతేడాది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కేకేఆర్ టైటిల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇందులో వెంకటేశ్ అయ్యర్‌ది కీలక పాత్ర. ముఖ్యంగా ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మూడో స్థానంలో వచ్చిన వెంకీ మెరుపు అర్ధ శతకంతో చెలరేగాడు.
హైదరాబాద్ విధించిన 114 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (32 బంతుల్లో 39) ఓ మోస్తరుగా రాణించగా.. సునిల్ నరైన్ (6) విఫలమయ్యాడు. ఇలాంటి తరుణంలో వన్‌డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగి.. 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచి.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6 నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా చెన్నై వేదికగా రైజర్స్‌ను ఓడించిన కేకేఆర్ ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.
ఏకంగా రూ. 23.75 కోట్లు
ఈ క్రమంలో ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు వెంకటేశ్ అయ్యర్‌ను కేకేఆర్ రిలీజ్ చేసింది. ఆక్షన్‌లో భారీ పోటీ నెలకొన్నా.. రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా ఏకంగా రూ. 23.75 కోట్లు ఖర్చు చేసి అతడిని మళ్లీ సొంతం చేసుకుంది. తద్వారా అతడి మొదటి జీతానికి దాదాపు 3900 శాతం హైక్ ఇచ్చింది.
కేకేఆర్ కాకపోతే.. ఇంకో జట్టుకు ఆడతా
అయితే, ఈసారి వెంకటేశ్ అయ్యర్ తీవ్రంగా నిరాశపరిచాడు. పదకొండు మ్యాచ్‌లలో కలిపి కేవలం 142 పరుగులే సాధించిన అతడు.. సీజన్ మొత్తంలో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. దీంతో తాజాగా మరోసారి కేకేఆర్ వెంకటేశ్‌ను వేలంలోకి వదిలింది. కానీ ఈసారి అతడిని మళ్లీ సొంతం చేసుకునేందుకు అంతగా ఆసక్తి చూపించకపోవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వెంకటేశ్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. క్రిక్‌ట్రాకర్‌తో మాట్లాడుతూ.. ‘‘నాలాంటి ఆటగాళ్లకు ఐపీఎల్‌లో ఆడటమే గొప్ప అదృష్టం. ఏ జట్టుకు ఆడినా.. నేను నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా.
ఒకవేళ నా హృదయం చెప్పినట్లు వినాలంటే.. ఇప్పటికీ కేకేఆర్‌తోనే ఉండాలని కోరుకుంటున్నా. కేకేఆర్‌తో కలిసి చాంపియన్‌గా నిలిచాను. అక్కడే కొనసాగాలని అనుకుంటున్నాను. కేకేఆర్‌కు మరింత పేరు తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నాను.
నాయకత్వ బృందంలో ఉండటం ఇష్టం
ఎందుకంటే ఐదేళ్ల పాటు వాళ్లు నాపై పూర్తి నమ్మకం ఉంచారు. నన్ను ప్రోత్సహించారు. అయితే, ఈసారి వేలంలో ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ కేకేఆర్ కాకపోతే.. ఇంకో జట్టుకు ఆడాల్సి వస్తుంది. ఏదేమైనా.. ఎక్కడికి వెళ్లినా నా సర్వస్వం ధారబోసి జట్టును గెలిపించేందుకు కృషి చేస్తానని అందరికీ తెలుసు.
బ్యాటింగ్, బౌలింగ్ పరంగానే కాదు.. నాయకత్వ బృందంలో ఉండటం నాకు ఇష్టం. కెప్టెన్‌కు అవసరమైన సలహాలు ఇచ్చేందుకు ఎల్లప్పుడూ ముందు ఉంటాను’’ అని వెంకటేశ్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. కాగా 2025లో వెంకీని కెప్టెన్ చేస్తారని భావించగా.. అనూహ్య రీతిలో కేకేఆర్ వెటరన్ ప్లేయర్ అజింక్య రహానేను సారథిగా నియమించింది. అతడి కెప్టెన్సీలో ఘోర పరాభవం చవిచూసింది. పద్నాలుగింట కేవలం ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పరిమితమైంది.


