మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్‌లో సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూపు-ఎ నుంచి బంగ్లాదేశ్-ఎ, శ్రీలంక-ఎ.. గ్రూపు-బి నుంచి పాకిస్తాన్, భారత్ జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్, భారత జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టాలని భారత్ పట్టుదలతో ఉంది.
ఇక సెకెండ్ సెమీఫైనల్లో పాకిస్తాన్ షాహీన్స్, శ్రీలంక అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ రెండు సెమీస్ మ్యాచ్‌లు శుక్రవారం(నవంబర్ 21) దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి.
పాక్ జోరు..
కాగా ఈ ఖండాంతర టోర్నమెంట్‌లో దాయాది పాకిస్తాన్ ఇప్పటివరకు అద్భుతమైన విజయాలను నమోదు చేసింది. లీగ్ స్టేజిలో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ పాక్ విజయం సాధించింది. భారత్-ఎతో జరిగిన మ్యాచ్‌లో కూడా పాక్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 8 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. మాజ్ సదాకత్ (79 పరుగులు, 2 వికెట్లు) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు.
పాకిస్తాన్ వర్సెస్ భారత్ ఫైనల్?
కాగా తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించడం జితేశ్ శర్మ నేతృత్వంలోని భారత జట్టుకు నల్లేరు మీద నడకే. ఇండియా జట్టులో వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ ఆర్య, నమన్ ధీర్ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు.
బౌలింగ్‌లో కూడా యష్ ఠాకూర్, యుద్దవీర్ సింగ్ వంటి యువ సంచలనాలు సత్తా చాటుతున్నారు. మరోవైపు పాక్ కూడా సూపర్ ఫామ్‌లో ఉండడంతో శ్రీలంకను ఓడించడం దాదాపు ఖాయమనే చెప్పాలి. దీంతో మరోసారి ఫైనల్ పోరులో పాక్-భారత్ తలపడే అవకాశముంది.
చదవండి: IND vs SA: టీమిండియా కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్?


