సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ ఆటగాడు, ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో చెలరేగిపోయాడు. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో నిన్న (జనవరి 5) జరిగిన మ్యాచ్‌లో 45 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 85 పరుగులు చేశాడు.
ఈ ఇన్నింగ్స్‌లో బెయిర్‌స్టో విధ్వంసం 12వ ఓవర్‌లో పతాక స్థాయికి చేరింది. ప్రపంచ టాప్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ వేసిన ఆ ఓవర్‌లో బెయిర్‌స్టో పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. వరుసగా మూడు సిక్సర్లు, తర్వాత ఒక ఫోర్, ఆపై రెండు భారీ సిక్సర్లు బాది 34 పరుగులు పిండుకున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన ఓవర్‌గా నిలిచింది.
ఈ మ్యాచ్‌లో బెయిర్‌స్టోతో పాటు మరో ఈస్ట్రన్‌కేప్ ఆటగాడు క్వింటన్ డికాక్ కూడా చెలరేగిపోయాడు. 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 79 పరుగులు చేశాడు. ఫలితంగా ప్రిటోరియా క్యాపిటల్స్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఈస్ట్రన్‌కేప్ 14.2 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. ఈ గెలుపుతో ఈస్ట్రన్‌కేప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.
క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో కాన్నర్ ఎస్టర్‌హ్యూజన్ (52) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (22 బంతుల్లో 47 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అలరించాడు. మిగతా ఆటగాళ్లలో పార్సన్స్ (18), విహాన్ లుబ్బే (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈస్ట్రన్‌కేప్ బౌలర్లలో నోర్జే 3, ఆడమ్ మిల్నే 2, సిపామ్లా, గ్రెగరీ తలో వికెట్ తీశారు.


