సన్‌రైజర్స్ (PC: SRH/IPL)
ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీని వదులుకుంది. రూ. 10 కోట్ల మొత్తానికి లక్నో సూపర్ జెయింట్స్‌కు అతడిని ట్రేడ్ చేసింది. అదే విధంగా.. ఏడుగురు ఆటగాళ్లను విడుదల చేసింది. ఫలితంగా వేలం కోసం సన్‌రైజర్స్ పర్సులో రూ. 25.50 కోట్లు మిగిలాయి.
ఇక డిసెంబరు 16న అబుదాబిలో ఐపీఎల్ మినీ వేలం (IPL 2026 Auction) జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సన్‌రైజర్స్ యాజమాన్యానికి కీలక సూచనలు చేశాడు. బ్యాటింగ్ పరంగా జట్టు బాగుంటే చాలదని.. బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపాడు.
బౌలింగ్ విభాగంపై శ్రద్ధ పెడితేనే..
ఈ మేరకు యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరి మదిలోనూ ఒకే ప్రశ్న. బౌలింగ్ పరంగా సన్‌రైజర్స్ పరిస్థితి ఎలా ఉంది?.. ఈసారి వాళ్లు కచ్చితంగా తమ బౌలింగ్ విభాగంపై శ్రద్ధ పెట్టి పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
బ్యాటింగ్‌లో వాళ్లకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్క సీజన్లో బాగా ఆడలేనంత మాత్రాన వాళ్ల బ్యాటింగ్ విభాగం చెత్తదేమీ అయిపోదు. అయితే, బౌలింగ్ పరంగా మాత్రం జట్టు బలహీనంగా ఉంది. నాకు తెలిసి వాళ్లు ఈసారి కామెరాన్ గ్రీన్ కోసం ప్రయత్నించవచ్చు.
సన్‌రైజర్స్‌కు అతడు దొరకడు
కానీ అతడు వాళ్లకు దొరకడనే అనిపిస్తోంది. సన్‌రైజర్స్‌కు ముందుగా నాణ్యమైన స్పిన్నర్ అవసరం ఉంది. ఆ జట్టులో స్పిన్నర్లు లేరు. జీషన్ అన్సారీ ఒక్కడే ఏం చేయగలడు? అతడికి తోడుగా మరికొంత మంది స్పిన్నర్లు కావాలి. నాకు తెలిసి ఆదిల్ రషీద్‌పై దృష్టి పెడతారేమో!
వాళ్లకు ఇప్పుడు వికెట్లు తీయగల స్పిన్నర్ కావాలి. మూడు ఓవర్లలో 40 పరుగులు ఇచ్చినా కనీసం మూడు వికెట్లు తీసే స్పిన్ బౌలర్ కావాలి. అన్రిచ్ నోర్జే లాంటి ఫాస్ట్ బౌలర్ కూడా దొరికితే ఇంకా మంచిది’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు వీరే
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్, స్మరణ్ రవిచంద్రన్, అనికేత్ వర్మ, జీషన్ అన్సారీ, హర్ష్ దూబే, కమిందు మెండిస్, ఇషాన్ మలింగ, బ్రైడన్ కార్స్.
సన్‌రైజర్స్ రిలీజ్ చేసిన ప్లేయర్లు
రాహుల్ చహర్ (రూ. 3.20 కోట్లు), అభినవ్ మనోహర్ (రూ. 3.20 కోట్లు), ఆడం జంపా (రూ. 2.40 కోట్లు), ఆడం జంపా (రూ. 2.40 కోట్లు), సిమర్‌జీత్ సింగ్ (రూ. 1.50 కోట్లు), వియాన్ ముల్దర్ (రూ. 70 లక్షలు), అథర్వ టైడే (రూ. 30 లక్షలు), సచిన్ బేబి (రూ. 30 లక్షలు), మొహమ్మద్ షమీ (రూ. 10 కోట్లు- ట్రేడింగ్).


