కేకేఆర్ జట్టు (PC: KKR X)
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేకేఆర్ తమ జట్టు నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను విడుదల చేయాలని ఆదేశించింది.
బీసీసీఐ ప్రకటన
ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) అధికారికంగా ధ్రువీకరించారు. వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత పరిణామాల దృష్ట్యా.. కేకేఆర్ తమ జట్టులోని బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించింది.

ఒకవేళ కేకేఆర్ అతడికి ప్రత్యామ్నాయంగా ఇంకో ఆటగాడిని ఎంచుకుంటామని కోరితే.. బీసీసీఐ అందుకు అనుమతినిస్తుందని కూడా తెలియజేశాము’’ అని దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. కాగా ఐపీఎల్ మినీ వేలం-2026 ఐదుగురికి పైగా బంగ్లాదేశ్ ప్లేయర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
రూ. 9.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు
అయితే, ఫామ్, గత ప్రదర్శనల దృష్ట్యా ముస్తాఫిజుర్ రెహ్మాన్ మాత్రమే అమ్ముడుపోయాడు. కనీస ధర రూ. 2 కోట్లతో వేలంలోకి వచ్చిన ఈ పేస్ బౌలర్‌ను.. ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి మరీ కేకేఆర్ ఏకంగా రూ. 9.20 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. తుదిజట్టులోనూ అతడు ఆడటం దాదాపు ఖాయమే. అయితే, ఇప్పుడు బీసీసీఐ అతడిని పక్కనపెట్టాలని చెప్పడంతో కేకేఆర్ భారీ షాక్ తగిలినట్లయింది.
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు
కాగా బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గమైన హిందువులపై దాడులు పెరిగిపోతున్న విషయం విదితమే. ఇప్పటికే నలుగురు ఉన్మాదుల చేతిలో హత్యకు గురయ్యారు. మరోవైపు.. నేతలుగా చెప్పుకొనే మరి కొంతమంది భారత్‌ను రెచ్చగొట్టేలా కవ్వింపు వ్యాఖ్యలు చేస్తూ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తలు నెలకొనే పరిస్థితులు తీసుకువచ్చారు.
ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ నేత ఒకరు.. కేకేఆర్ ఫ్రాంఛైజీ సహ యజమాని, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ను ‘ద్రోహి’గా అభివర్ణించారు. ముస్తాఫిజుర్‌ను అతడి జట్టు కొనుగోలు చేసినందుకు ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ నుంచి విడుదల చేయాలనే డిమాండ్లు పెరగగా.. బీసీసీఐ అందుకు అనుగుణంగా తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇక అతడి స్థానాన్ని కేకేఆర్ ఎవరితో భర్తీ చేస్తుందో చూడాల్సి ఉంది. కాగా ఐపీఎల్‌లో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఘనత కేకేఆర్‌ది.
చదవండి: T20 WC: జింబాబ్వే అనూహ్య నిర్ణయం.. సంచలన ఎంపికలు
#WATCH | Guwahati | BCCI secretary Devajit Saikia says, "Due to the recent developments that are going on all across, BCCI has instructed the franchise KKR to release one of their players, Mustafizur Rahman of Bangladesh, from their squad and BCCI has also said that if they ask… pic.twitter.com/53oxuRcmZp
— ANI (@ANI) January 3, 2026


