ఆగ్నేయ బంగాళాఖాతంలో దిత్వా తుపాను
దీంతో రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో చాలాచోట్ల తేలికపాటి వానలు
రానున్న మూడు రోజులు సాధారణ స్థితిలోనే ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతం, శ్రీలంక తీర సమీపంలో ఏర్పడిన దిత్వా తుఫాను ఉత్తర వాయవ్య దిశలో కదులుతోంది. ఈ తుపాను శుక్రవారం ఉదయం ఎనిమి దిన్నర గంటల ప్రాంతంలో పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను క్రమంగా ఉత్తర వాయవ్య దిశలో కదులుతూ ఆదివారం ఉదయానికి నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా ఆంధ్ర తీర ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావం తెలంగాణపై పెద్దగా లేదని నిపుణులు చెబుతు న్నారు. శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
ఆదివారం దక్షిణ ప్రాంత జిల్లాలు, సెంట్రల్ తెలంగాణ జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని, కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ వివరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న రెండ్రోజులు మెజారిటీ ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత మహబూబ్‌నగర్‌లో 30.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 13.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
10వ తేదీ వరకు మినుములు, పెసర విత్తుకోవచ్చు
వర్షాలు కురిసే సూచనలున్నందున రైతులు వరి కోసే ముందు ఆకాశంలోని మేఘాలను గమనించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వి శ్వవిద్యాలయంలోని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం అధిపతి, ప్ర ధాన శాస్త్రవేత్త డాక్టర్ పి.లీలారాణి శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు.
⇒ మినుములు, పెసర పంటలను వచ్చే నెల 10వ తేదీ వరకు విత్తుకోవచ్చు.
⇒ మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు పంటలను డిసెంబర్ 31వ తేదీ వరకు విత్తుకోవచ్చు.
⇒ యాసంగి వరినారు మడులను డిసెంబర్ 20 లోగా పోసుకోవాలి.
⇒ ప్రస్తుత చలి వాతావరణ పరిస్థితులు వరి నారుమళ్లలో జింక్ ధాతువు లభ్యతను తగ్గిస్తాయి. జింక్ లోప నివారణకు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
⇒ చలి ప్రభావం వల్ల మొక్కజొన్నలో భాస్వరం లోపంతో ఆకులు ఊదారంగులోకి మారుతాయి. భాస్వరం లోపనివారణకు 10 గ్రాముల19–19–19 లేదా డీఏపీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
⇒ మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు 0.4 మి.లీ. క్లోరంట్రానిలిప్రోల్ లేదా 0.5 మి.లీ. స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి ఆకుల సుడుల లోపల తడిచేలా పిచికారీ చేయాలి.
⇒ పత్తిలో బూడిద తెగులు, కాయకుళ్లు తెగులు, గులాబీ రంగు పురుగు ఆశించడానికి అనుకూలం. కాబట్టి నియంత్రణ చర్యలు చేపట్టాలి.
⇒ కందిలో శనగపచ్చ పురుగు, మారుక మచ్చల పురుగు నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలి.
⇒ వేరుశనగలో ఆకుముడత పురుగు నివారణకు 2.5 మి.లీ. క్లోరిపైరిపాస్ లేదా 1.5గ్రా. ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
⇒ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్లలో కొక్కెర తెగులు సోకటానికి అనుకూలం. నివారణకు టీకాలు వేయించాలి.
⇒ గొర్రెలకు పీపీఆర్, చిటుకు, ఆవులు, గేదెల్లో గొంతువాపు వ్యాధి సోకటానికి చలి వాతావరణం అనుకూలంగా ఉంది. వీటి నివారణకు టీకాలు వేయించాలి.
⇒ గొర్రెల్లో నట్టల నివారణకు డీవార్మింగ్ చేయించాలి.


