తరలి రండి అంటూ ప్రముఖులకు సీఎం ఆహ్వానం
సదస్సు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రభుత్వం భారీయెత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఈ సదస్సు కోసం దేశ, విదేశాలకు చెందిన 3 వేల మంది ప్రముఖులను ఆహ్వానించాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర చరిత్రలోనే ప్రతిష్టాత్మ కంగా సదస్సు నిర్వహణ ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. అంతర్జాతీయంగా పేరున్న పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ రంగ ప్రముఖులు ఈ సదస్సుకు రానున్నారు.
బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాయల్ ఫ్యామిలీ సభ్యులు, వివిధ కంపెనీల అంతర్జాతీయ స్థాయి సీఈఓలు హాజరు కానున్నారు. యూఏఈ రాజవంశానికి చెందిన షేక్ తారిక్ అల్ ఖాసిమీ, రస్ అల్ ఖైమా, డ్యూచ్ సె గ్రూప్ హెడ్ లుడ్విగ్ హెయిన్జెల్మాన్, ఎన్రిషన్ వ్యవస్థాపక భాగస్వామి డబ్ల్యూ విన్‌స్టన్, మాండల్ వైల్డ్ లైఫ్ గ్రూప్ సీఈఓ బెనెట్ నియోతో పాటు పలు టెక్ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, స్టార్టప్‌ల వ్యవస్థాప కులు రానున్నారు. ఇక వివిధ రంగాల ప్రముఖులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరిట స్వయంగా ఆహ్వానాలు పంపిస్తున్నారు.
తప్పకుండా రండి..
‘వికసిత్ భారత్ 2047 జాతీయ వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా మా ప్రజా ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ డాక్యు మెంట్‌ను తయారు చేసింది. ఆర్థిక వృద్ధి, అన్ని రంగాల ప్రగతి, అన్ని వర్గాల సంక్షేమం, సాధికారత, సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా భవిష్యత్తు తెలంగాణకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది. మా ప్రభుత్వ సంకల్పాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025ను నిర్వహిస్తు న్నాం, తప్పకుండా రండి..’ అనే ప్రభుత్వ ఆహ్వానానికి పలు దేశాల ప్రతినిధులు సమ్మతి తెలిపారని సీఎంవో వర్గాలు తెలిపాయి.
రెండు రోజుల పాటు జరిగే సదస్సులో భాగంగా డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లయోనల్ మెస్సీ ఈ నెల 13న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ఇది ప్రత్యేక ఆకర్షణగా, ముగింపు ఘట్టంగా నిలువనుందని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.


