టీ తాగారు.. భారత్‌ దెబ్బకు తోకముడిచారు!.. పాక్‌ బుద్ధి మారదు! | Amid Asia Cup Controversy, Pakistan U17 Football Team Act Against India Triggers Row, Check Out Video Went Viral | Sakshi
Sakshi News home page

టీ తాగారు.. భారత్‌ దెబ్బకు తోకముడిచారు!.. పాక్‌ బుద్ధి మారదు!

Sep 23 2025 11:45 AM | Updated on Sep 23 2025 1:09 PM

Amid Asia Cup Controversy Pakistan U17 Football Team Act Vs India Triggers Row

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత మైదానంలో పాకిస్తాన్‌ ఆటగాళ్ల వెకిలి చేష్టలు ఎక్కువయ్యాయి. భారత్‌పై తమదే పైచేయి అని నమ్మించే ప్రయత్నంలో బొక్కబోర్లా పడుతున్నా వారి తీరు మాత్రం మారడం లేదు. సీనియర్‌ క్రికెటర్లకు తామేమీ తీసిపోమన్మట్లుగా ఫుట్‌బాల్‌ యువ ఆటగాళ్లు కూడా ఓవరాక్షన్‌తో వివాదాలకు కారణమవుతున్నారు.

కాగా జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఇందుకు భారత ఆర్మీ ఉగ్రమూకలకు గట్టి కౌంటర్‌ ఇచ్చింది. పాకిస్తాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలను ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’తో నేలమట్టం చేసింది. 

అయితే, ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడి చేస్తే.. అందుకు ప్రతిగా పాక్‌ ఆర్మీ ముందుకు వచ్చి మరోసారి తమ బుద్ధిని చాటుకుంది. ఈ క్రమంలో పాక్‌తో అన్ని సంబంధాలు.. ముఖ్యంగా క్రీడల్లోనూ వారితో ఎలాంటి పోటీ వద్దంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. 

అయితే, ఆసియాకప్‌-2025 (Asia Cup 2025) టోర్నీలో మాత్రం టీమిండియా పాక్‌తో ఆడేందుకు భారత ప్రభుత్వం అనుమతినిచ్చింది. బహుళ దేశాలు పాల్గొంటున్న టోర్నీ కావున ఇందుకు సమ్మతించింది.

పప్పులు ఉడకపోవడంతో
ఈ నేపథ్యంలో లీగ్‌ దశలో పాక్‌ ఆటగాళ్లతో టీమిండియా కరచాలనానికి నిరాకరించింది. దీనిని అవమానంగా భావించిన పాక్‌.. ఐసీసీకి ఫిర్యాదు చేసింది. తమ పప్పులు ఉడకపోవడంతో ఆదివారం నాటి సూపర్‌-4 మ్యాచ్‌లో ఆటగాళ్లు మైదానంలో ఆటతో కాకుండా తమ చేష్టలతో కవ్వింపులకు పాల్పడ్డారు.

ఇక పాక్‌ ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ అర్ధ శతకం (58) పూర్తి చేసుకోగానే.. ఏకే-47 మాదిరి బ్యాట్‌ ఎక్కుపెట్టి ప్రేక్షకులను కాలుస్తున్నట్లు సంబరాలు చేసుకున్నాడు. మరోవైపు.. హ్యారిస్‌ రవూఫ్‌ (Haris Rauf).. ‘మీ యుద్ధ విమానాలను కూల్చామన్నట్లుగా’ టీమిండియా అభిమానులకు సైగ చేశాడు.

టీ తాగారు.. తోక ముడిచారు
తాజాగా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో కూడా పాక్‌కు చెందిన ఓ ఆటగాడు ఇదే తరహాలో భారత జట్టును రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కొలంబో వేదికగా దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) అండర్‌–17 టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం గ్రూప్‌-‘బి’లోని చివరి మ్యాచ్‌లో భారత్‌- పాక్‌ తలపడ్డాయి. 

భారత్‌ తరఫున దలాల్‌మువాన్‌ గాంగ్టే 31వ నిమిషంలో గోల్‌ చేయగా.. 43వ నిమిషంలో పాక్‌ ప్లేయర్‌ మొహమ్మద్‌ అబ్దుల్లా ఒక గోల్‌ సాధించాడు. ఈ క్రమంలోనే పాక్‌ ఆటగాళ్లు అతి చేశారు. టీ తాగుతున్నట్లుగా అభినయిస్తూ భారత జట్టును టీజ్‌ చేశారు. 

కాగా గతంలో సర్జికల్‌ స్ట్రైక్స్‌ సందర్భంగా ఎయిర్‌ఫోర్స్‌ వింగ్‌ అభినందన్‌ వర్ధమాన్‌ అనూహ్య రీతిలో పాక్‌ ఆర్మీ చేతికి చిక్కగా.. ఆయన టీ తాగుతున్నట్లుగా ఉన్న ఫొటోను విడుదల చేసింది.

అయితే, 2019 నాటి ఈ ఘటనలో అభినందన్‌ దాదాపు 60 గంటలపాటు పాక్‌ నిర్బంధంలో ఉండగా.. జనీవా ఒప్పందం ప్రకారం తిరిగి భారత్‌కు అప్పగించారు. ఇపుడు ఇదే విషయాన్ని గుర్తుచేస్తున్నట్లుగా పాక్‌ యువ ఆటగాడు వ్యవహరించడం విశేషం.

భారత్‌ చేతిలో ఓటములే
అయితే, ఈ మ్యాచ్‌లో భారత్‌- పాకిస్తాన్‌ను 3-2తో ఓడించడంతో పరాజయ భారంతో దాయాది తోకముడిచింది. ఇక ఈ గెలుపుతో భారత్‌ గ్రూప్‌-బి టాపర్‌గా సెమీస్‌ చేరగా.. రెండో స్థానంలో పాక్‌ కూడా క్వాలిఫై అయింది. సెమీ ఫైనల్లో భారత్‌- నేపాల్‌తో, పాకిస్తాన్‌ బంగ్లాదేశ్‌తో తలపడతాయి. ఇదిలా ఉంటే.. ఆసియా కప్‌ టీ20 టోర్నీలో భారత్‌ లీగ్‌, సూపర్‌ దశలో పాక్‌ను చిత్తు చేసింది.

చదవండి: ఎవర్నీ లెక్కచేయను.. నా తీరే అంత.. నచ్చినట్లు చేస్తా: పాక్‌ బ్యాటర్‌ ఎక్స్‌ట్రాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement