
టీమిండియాతో మ్యాచ్‌లో అతి చేసిన పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (Sahibzada Farhan)పై విమర్శల వర్షం కురుస్తోంది. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత అతడు సంబరాలు చేసుకున్న తీరే ఇందుకు కారణం.
ఐ డోంట్ కేర్
అయితే, తానేమీ సెలబ్రేషన్స్ విషయంలో పశ్చాత్తాపపడటం లేదని.. తన తీరే అంత అని ఫర్హాన్ తన చర్యను సమర్థించుకున్నాడు. ఎవరేమనుకున్నా ‘ఐ డోంట్ కేర్’ అంటూ హెచ్చులకు పోయాడు. కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆసియా కప్-2025 వేదికగా భారత్- పాక్ తొలిసారి తలపడ్డాయి.
లీగ్ దశలో పాక్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన భారత్ (IND vs PAK).. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో సూపర్-4 దశలో ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే, పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు పాక్ జట్టుతో ఆది నుంచే కరచాలనానికి నిరాకరించారు.
గన్ పేలుస్తున్నట్లుగా
ఈ నేపథ్యంలో సాహిబ్‌జాదా ఫర్హాన్ చర్య వివాదానికి దారితీసింది. భారత్‌తో మ్యాచ్‌లో 34 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్న అతడు.. వెంటనే బ్యాట్‌ను ఏకే-47 తుపాకి మాదిరి ప్రేక్షకుల వైపు ఎక్కుపెట్టి గన్ పేలుస్తున్నట్లుగా అభినయించాడు.
ఓవైపు పహల్గామ్‌లో అమాయక పర్యాటకులను కాల్చి చంపిన ఘాతుకానికి నిరసనగా టీమిండియా షేక్‌హ్యాండ్ No- Shakehand)కు నిరాకరిస్తుంటే.. ఫర్హాన్ ఇలా రెచ్చగొట్టేలా ప్రవర్తించడంపై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై సాహిబ్‌జాదా ఫర్హాన్ తాజాగా స్పందిస్తూ.. మరోసారి అతి చేశాడు.
ఈసారి అలా చేయాలనిపించింది
‘‘మీరు సిక్సర్ల గురించి మాట్లాడుతున్నారేమో.. భవిష్యత్తులో ఇంకా ఎక్కువే చూస్తారు. ఇక సెలబ్రేషన్ గురించి అంటారా.. ఆ సమయంలో అలా చేయాలని అనిపించిందంతే.
మామూలుగా 50 కొడితే నేను సెలబ్రేట్ చేసుకోను. కానీ ఈసారి అలా చేయాలనిపించింది. దాని గురించి ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను. ఎక్కడైనా సరే దూకుడుగా ఆడటం నా లక్ష్యం. టీమిండియా అయినా.. ఏ జట్టు అయినా నా శైలి ఇలాగే దూకుడుగా ఉంటుంది’’ అని మీడియా సమావేశంలో ఫర్హాన్ పేర్కొన్నాడు.
అంతొద్దు
కాగా 2018లో ఆస్ట్రేలియాతో టీ20 సందర్భంగా 29 ఏళ్ల ఫర్హాన్ పాక్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 24 టీ20 మ్యాచ్‌లు ఆడి.. 510 పరుగులు చేయగలిగగాడు. ఈ నేపథ్యంలో అతడి వ్యాఖ్యలను ఉటంకిస్తూ నెటిజన్లు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. సెంచరీలు బాదిన వాళ్లు కూడా ఇలా ఓవరాక్షన్ చేయరంటూ చురకలు అంటిస్తున్నారు.
ఇక టీమిండియాతో మ్యాచ్‌లో ఫర్హాన్ 45 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేశాడు. శివం దూబే బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
చదవండి: ఇంకోసారి అలా అనకండి: పాక్ జట్టు పరువు తీసిన సూర్య
సెకండ్ వికెట్ పడగొట్టిన Shivam Dube 💥
చూడండి #INDvPAK లైవ్
Sony Sports Network TV Channels & Sony LIV లో#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/EZGkRemo4D— Sony Sports Network (@SonySportsNetwk) September 21, 2025
इनको कौन समझाये ये बैट है AK47 नहीं 😡😡#INDvPAK
pic.twitter.com/oV456mlCXq— Shivani (@shivani_di) September 21, 2025