ఇంకోసారి అలా అనకండి: పాక్‌ జట్టు పరువు తీసిన సూర్య | Suryakumar Yadav Rubs Salt On Pak Wounds After Asia Cup Win, Says Stop Calling India Vs Pakistan Matches A Rivalry | Sakshi
Sakshi News home page

ఇంకోసారి అలా అనకండి: పాక్‌ జట్టు పరువు తీసిన సూర్య

Sep 22 2025 10:03 AM | Updated on Sep 22 2025 10:37 AM

Stop Calling That: Suryakumar Yadav Rubs Salt On Pak Wounds After Asia Cup Win

దాయాది పాకిస్తాన్‌పై టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆసియా కప్‌-2025 లీగ్‌ దశలో పాక్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన సూర్యకుమార్‌ సేన.. సూపర్‌-4లో భాగంగా మరోసారి ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది.

దుబాయ్‌ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌.. పాకిస్తాన్‌ (IND vs PAK)ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. టీ20 ఫార్మాట్లో పాక్‌పై టీమిండియాకు ఇది పన్నెండో విజయం. ఇప్పటికి పదిహేను సార్లు ముఖాముఖి పోటీ పడగా.. భారత్‌ ఈ మేరకు ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉంది.

ఇంకోసారి అలా అనకండి 
ఈ నేపథ్యంలో పాక్‌పై విజయానంతరం టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. మీడియా సమావేశంలో భాగంగా చిరకాల ప్రత్యర్థుల పోరు అంటూ  ఓ విలేకరి ప్రస్తావించగా.. ‘‘సర్‌.. ఇకపై నుంచైనా ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌ను ప్రత్యర్థుల పోరు అని అనడం మానేయాలి.

పాక్‌ జట్టు పరువు తీసిన సూర్య
సర్‌.. ఏ రకంగా చూసినా ఇలా అనేందుకు నాకు ఎలాంటి కారణం కనపడటం లేదు. ఇంకా రైవలరీ ఏంటి? రెండు జట్లు 15 మ్యాచ్‌లలో తలపడి ఒకటి 8.. ఇంకోటి 7 గెలిస్తే దానిని ప్రత్యర్థుల పోరుగా అభివర్ణించవచ్చు. కానీ ఇక్కడ 13- 1, 12-3 లా ఉన్నపుడు ఇంకా ఇలా ఎలా అనగలం?

అసలు రెండు జట్ల మధ్య పోటీ అనేదే లేదు కదా!’’ అని సూర్యకుమార్‌ యాదవ్‌.. పాక్‌ జట్టుకు తమ స్థాయి ఏమిటో తెలియజేశాడు. కాగా పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత తొలిసారిగా ఆసియా కప్‌ లీగ్‌ దశలో భారత్‌- పాక్‌ ముఖాముఖి పోటీపడిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో పాక్‌ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత జట్టు నిరాకరించింది.

బుద్ధి చూపించారు
దీంతో రచ్చకెక్కిన పాక్‌ బోర్డు.. నానాయాగీ చేసి.. టోర్నీ నుంచి వైదొలుగుతామని బెదిరించింది. అయితే, ఐసీసీ దిగిరాకపోవడంతో టోర్నీలో కొనసాగుతోంది. ఇక ఆదివారం నాటి మ్యాచ్‌లోనూ పాక్‌ తన బుద్ధి చూపించింది. 

అర్ధ శతకం (34 బంతుల్లో) పూర్తి చేసుకున్న తర్వాత పాక్‌ బ్యాటర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ ఏకే-47 పేలుస్తున్న తరహాలో బ్యాట్‌ చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. మ్యాచ్‌ మధ్యలోనూ ఆటగాళ్లను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు.

సూపర్‌-4 : భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ స్కోర్లు
👉వేదిక: దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం, దుబాయ్‌
👉టాస్‌: భారత్‌.. తొలుత బౌలింగ్‌
👉పాక్‌ స్కోరు: 171/5 (20)
👉భారత్‌ స్కోరు: 174/4 (18.5)
👉ఫలితం: పాక్‌పై ఆరు వికెట్ల తేడాతో భారత్‌ విజయం
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74).

చదవండి: వైభవ్‌ సూర్యవంశీ ధనాధన్‌.. ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement