IND vs AUS: వైభవ్‌ సూర్యవంశీ ధనాధన్‌.. ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్‌ | IND U19 Vs AUS U19: Vaibhav Shines Vedant Kundu 50s Ind Beat Aus | Sakshi
Sakshi News home page

ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్‌.. వైభవ్‌, వేదాంత్‌, అభిగ్యాన్ అదుర్స్‌

Sep 21 2025 4:19 PM | Updated on Sep 21 2025 5:41 PM

IND U19 Vs AUS U19: Vaibhav Shines Vedant Kundu 50s Ind Beat Aus

భారత్‌ అండర్‌-19 క్రికెట్‌ జట్టు ఆస్ట్రేలియా (AUS U19 Vs IND U19 ) పర్యటనలో శుభారంభం చేసింది. ఆసీస్‌ యువ జట్టుతో జరిగిన తొలి యూత్‌ వన్డేలో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.‌ ఆయుశ్‌ మాత్రే (Ayush Mhatre) సారథ్యంలో మూడు యూత్‌ వన్డేలు, రెండు యూత్‌ టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆసీస్‌ పర్యటనకు వెళ్లింది.

పరుగుల ఖాతా తెరవకుండానే
ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్‌‌ వేదికగా ఆదివారం తొలి యూత్‌ వన్డే జరిగింది. ఇయాన్‌ హేలీ మైదానంలో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా అండర్‌-19 జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసింది. భారత బౌలర్ల దాటికి ఆసీస్‌ పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్లు అలెక్స్‌ టర్నర్‌ (0), సీమోన్‌ బడ్జ్‌ (0) వికెట్లు కోల్పోయింది. వీరిద్దరిని కిషన్‌ కుమార్‌ (Kishan Kumar) అవుట్‌ చేసి.. ఆసీస్‌కు ఆరంభంలోనే గట్టి షాకిచ్చాడు.

ఇక మిగిలిన ఆసీస్‌ బ్యాటర్లలో స్టీవెన్‌ హోగన్‌ 39, టామ్‌ హోగన్‌ 41 పరుగులతో రాణించగా.. జాన్‌ జేమ్స్‌ 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌ కారణంగానే ఆసీస్‌ మెరుగైన స్కోరు చేయగలిగింది. నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 225 పరుగులు సాధించింది. భారత యువ బౌలర్లలో కిషన్‌ కుమార్‌, కనిష్క్‌ చౌహాన్‌ రెండేసి వికెట్లు తీయగా.. హెనిల్‌ పటేల్‌ మూడు వికెట్లతో చెలరేగాడు. ఆర్‌ఎస్‌ అంబరీష్‌ కు ఒక వికెట్‌ దక్కింది.

వైభవ్‌ సూర్యవంశీ ధనాధన్‌
ఈ క్రమంలో ఆసీస్‌ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టుకు ఆదిలోనే షాకులు తగిలాయి. ఆసీస్‌ పేసర్‌ చార్లెస్‌ లాచ్‌మండ్‌ ఓపెనర్‌,  కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (6), వన్‌డౌన్‌ బ్యాటర్‌ విహాన్‌ మల్హోత్రా (9)లను సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితం చేశాడు. అయితే, మరో ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ మాత్రం మరోసారి తన మార్కు చూపించాడు.

ధనాధన్‌ బ్యాటింగ్‌తో దంచికొట్టి.. ఇన్నింగ్స్‌ గాడిన పెట్టాడు. మొత్తంగా 22 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌.. ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌   సాయంతో 38 పరుగులు సాధించాడు. 

వేదాంత్‌, అభిగ్యాన్ అదుర్స్‌
ఈ క్రమంలో అతడికి జతైన వేదాంత్‌ త్రివేది అర్ధ శతకం (61 నాటౌట్‌) తో ఆకట్టుకున్నాడు. ఇక వేదాంత్‌తో పాటు అభిగ్యాన్‌ కుందు దుమ్ములేపాడు. 74 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 87 పరుగులతో అజేయంగా నిలిచాడు.

వేదాంత్‌తో కలిసి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. 30.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 227 పరుగులు సాధించిన భారత్‌.. ఆసీస్‌ జట్టును ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. సూపర్‌ ఫిఫ్టీ సాధించిన అభిగ్యాన్‌ కుందు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement