
‘బ్రజూకా’ వచ్చేసింది
వచ్చే ఏడాది బ్రెజిల్‌లో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఉపయోగించే అధికారిక బంతి ‘బ్రజూకా’ను విడుదల చేశారు. అధికారిక బంతికి పేరు సూచించాలని పోల్ నిర్వహించగా...
సాల్వేడార్ (బ్రెజిల్): వచ్చే ఏడాది బ్రెజిల్‌లో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఉపయోగించే అధికారిక బంతి ‘బ్రజూకా’ను విడుదల చేశారు. అధికారిక బంతికి పేరు సూచించాలని పోల్ నిర్వహించగా... 10 లక్షల మంది ఫుట్‌బాల్ అభిమానులు ఈ బంతికి బ్రజూకా పేరును సూచించారు. 437 గ్రాముల బరువు ఉన్న ఈ బంతి చుట్టుకొలత 69 సెంటీ మీటర్లు. రీబౌండ్ 141 సెంటీ మీటర్లు అవుతుంది. ఒకే రకమైన 6 పలకలు, బ్యూటైల్ బ్లాడర్, పాలీయూరెథాన్‌తో తయారైన ఫోమ్, 2 డెమైన్షనల్ ఉష్ణ బంధాలతో ఈ బంతిని రూపొందించారు.
సమయాలను మార్చలేం: ‘ఫిఫా’
వచ్చే ఏడాది జరిగే ఫుట్‌బాల్ ప్రపంచకప్ మ్యాచ్‌ల ఆరంభ సమయాలను మార్చలేమని ‘ఫిఫా’ స్పష్టం చేసింది. బ్రెజిల్‌లోని కొన్ని నగరాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలుండటంతో ఆటగాళ్ల ఆరోగ్యం దెబ్బతింటుందని వస్తున్న కథనాలను ‘ఫిఫా’ సెక్రటరీ జనరల్ జెరోమ్ వాల్కీ తోసిపుచ్చారు. ‘మంచు కురుస్తున్న జ్యూరిచ్‌లో కూర్చొని ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. బ్రెజిల్ వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వైద్య నివేదికల ఆధారంగా షెడ్యూల్‌ను రూపొందించాం.
పోర్టో అలెగ్రిలో 12 డిగ్రీలు, మనాస్‌లో 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. కాబట్టి ఏ మ్యాచ్ కూడా మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలుకాదు. షెడ్యూల్ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడి వాతావరణ పరిస్థితులపై మేం చాలా అప్రమత్తంగా ఉన్నాం’ అని వాల్కీ తెలిపారు. బ్రెజిల్‌లో శీతాకాలం ఉన్నప్పుడు ఈ టోర్నీ జరగనుంది. సాల్వేడార్, నటాల్, రాసిఫా, ఫోర్టాలెజా, మనాస్, కూయబాలో జూన్, జూలైలో కూడా 30 డిగ్రీలను మించలేదు. కాబట్టి టోర్నీకి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఈ పోటీలకు ఆతిథ్యమివ్వనున్న స్టేడియాలను పూర్తి చేసేందుకు ఫిబ్రవరి చివరి వరకు గడువును పెంచారు.