జాగ్రత్తగా మాట్లాడండి.. మా సైన్యం సిద్ధంగానే ఉంది | Negotiations Under Fire: Warnings Walkouts and Fragile US-Iran Dialogue | Sakshi
Sakshi News home page

జాగ్రత్తగా మాట్లాడండి.. మా సైన్యం సిద్ధంగానే ఉంది

Jun 22 2026 6:48 AM | Updated on Jun 22 2026 10:27 AM

Negotiations Under Fire: Warnings Walkouts and Fragile US-Iran Dialogue

అమెరికా-ఇరాన్‌ శాంతి చర్చలు కీలక మలుపు తిరిగాయి. స్విట్జర్లాండ్‌ వేదికగా చర్చలు మొదలు కాగా.. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు, హర్ముజ్‌ జలసంధి మూసివేత, ఆర్థిక ఆంక్షలు ప్రధాన అడ్డంకులుగా మారాయి. చర్చలు కొనసాగుతుండగానే మరోసారి దాడులు చేస్తామంటూ ట్రంప్‌ హెచ్చరించగా.. ఇరాన్‌ అందుకు ధీటుగానే స్పందిస్తూ వాకౌట్‌ చేసింది. ఈ పరిణామాలు మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్తతల వేడిని మరింత పెంచేలా కనిపిస్తున్నాయి.

అత్యంత విలాసవంతమైన బర్గెన్‌స్టాక్‌ రిసార్ట్‌ వేదికగా అమెరికా-ఇరాన్‌ మధ్య ఆదివారం తొలి విడత శాంతి చర్చలు జరిగాయి. గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియన్‌ మధ్య కుదిరిన తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఈ సమావేశాల ప్రధాన లక్ష్యం. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, స్టీవ్‌ విట్‌కాఫ్‌, జారెడ్‌ కుష్నర్‌ పాల్గొనగా.. ఇరాన్‌ తరఫున విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ, ప్రధాన చర్చాకర్త మొహమ్మద్‌ బాఘేర్‌ ఘాలిబఫ్‌ హాజరయ్యారు. పాకిస్తాన్‌, ఖతర్‌ ఈ చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి.

అయితే.. చర్చలకు ముందు ఘాలిబఫ్‌ ఖతర్‌, పాకిస్తాన్‌ ప్రతినిధులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఆ తర్వాత నాలుగు పక్షాల చర్చలు ప్రారంభమయ్యాయి. సుమారు 80 నిమిషాల పాటు సాగిన తొలి విడత సమావేశంలో యుద్ధ విరమణ అమలు, ఆర్థిక ఆంక్షల సడలింపు, ఇరాన్‌కు చెందిన విదేశీ నిధుల విడుదల, చమురు ఎగుమతులపై పరిమితుల తొలగింపు వంటి అంశాలపై చర్చ జరిగింది.

అయితే చర్చల ఆరంభంలోనే.. లెబనాన్‌ అంశం ప్రధాన అడ్డంకిగా మారింది. తాత్కాలిక ఒప్పందంలోని మొదటి నిబంధన అయిన "అన్ని రంగాల్లో కాల్పుల విరమణ"ను అమెరికా అమలు చేయలేదని ఇరాన్‌ ఆరోపించింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతుండటమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. లెబనాన్‌పై దాడులు ఆగేంత వరకు ఇతర అంశాలపై చర్చలు ముందుకు సాగబోవని ఇరాన్‌ చర్చల బృందంలోని సభ్యులు స్పష్టం చేశారు.

ఇదే సమయంలో హర్ముజ్‌ జలసంధి అంశం కూడా చర్చల్లో ఉద్రిక్తతను పెంచింది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ సముద్ర మార్గాన్ని ఇరాన్‌ తాజాగా మళ్లీ మూసేసిన సంగతి తెలిసిందే. లెబనాన్‌లో యుద్ధ పరిస్థితులు కొనసాగుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇరాన్‌ వివరణ ఇచ్చింది. అయితే హర్ముజ్‌ తెరిచి ఉంచడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమని అమెరికా స్పష్టం చేసింది.

ఈ పరిస్థితుల్లో ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు చర్చలను మరింత సంక్లిష్టం చేశాయి. లెబనాన్‌లోని తమ అనుకూల బలగాలు, ముఖ్యంగా హెజ్బుల్లాను ఇరాన్‌ అదుపులో పెట్టాలని, లేదంటే గతవారం చేసిన దాడుల కంటే మరింత తీవ్రంగా దాడి చేస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఇరాన్‌ ప్రతినిధులు కొద్దిసేపు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు ఇరానియన్‌ మీడియా వెల్లడించింది.

అనంతరం స్పందించిన ఘాలిబఫ్‌.. అమెరికా బెదిరింపులను ఇరాన్‌ ఏమాత్రం పట్టించుకోదని, బెదిరింపులు పనిచేసి ఉంటే అమెరికా ఈ స్థాయికి వచ్చేదే కాదని వ్యాఖ్యానించారు. తమ సాయుధ బలగాలు అవసరమైతే భిన్నమైన రీతిలో ప్రతిస్పందించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు.

అయితే పరిస్థితిని చల్లబరచే ప్రయత్నం చేసిన జేడీ వాన్స్‌.. ఇలాంటి చర్చల్లో విభేదాలు సహజమని, ప్రక్రియ కొంత గందరగోళంగా కనిపించినా పురోగతి కొనసాగుతోందని చెప్పారు. మధ్యప్రాచ్యంలో శాశ్వత మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమని, ఇరాన్‌తో సంబంధాలను కొత్త దిశగా తీసుకెళ్లాలని ట్రంప్‌ సూచించారని పేర్కొన్నారు.

చర్చల సందర్భంగా ఇరాన్‌కు చెందిన స్తంభింపజేసిన నిధుల విడుదలపై కార్యాచరణను ఖరారు చేసే దిశగా చర్చలు జరిగాయి. ఇరాన్‌ చమురు ఎగుమతులపై ఆంక్షల సడలింపుకు సంబంధించిన ప్రాథమిక ముసాయిదా కూడా సిద్ధమైనట్లు ఇరాన్‌ విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే అణు కార్యక్రమం సహా మిగిలిన కీలక అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఇక చర్చల మధ్యలో అమెరికా ప్రతిపాదించిన ఉమ్మడి ఫొటో, కరచాలన కార్యక్రమాన్ని కూడా ఇరాన్‌ తిరస్కరించింది. దానిని అమెరికా మీడియా ప్రదర్శనగా అభివర్ణిస్తూ.. ఘాలిబఫ్‌, అరాఘ్చీ పాల్గొనలేదు.

మరోవైపు లెబనాన్‌లో రెండు రోజుల తీవ్ర ఘర్షణల తర్వాత పరిస్థితి కొంత ప్రశాంతంగా కనిపించినప్పటికీ.. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు మాత్రం దక్షిణ లెబనాన్‌లో ఏర్పాటు చేసిన భద్రతా మండలిని అవసరమైనంత కాలం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గే సూచనలు కనిపించడం లేదు.

స్విట్జర్లాండ్‌లో శాంతి కోసం చర్చలు జరుగుతున్నా.. లెబనాన్‌లో యుద్ధం, హర్ముజ్‌లో ఉద్రిక్తతలు, ట్రంప్‌ హెచ్చరికలు, ఇరాన్‌ ప్రతిస్పందనలు చర్చల భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చాయి. తొలి విడత చర్చలు నిలిచిపోయినా.. ముగియలేదని ఇరాన్‌ చెబుతోంది. ఇప్పుడు రెండో విడత చర్చలు మిడిల్‌ఈస్ట్‌లో శాంతిని తీసుకువస్తాయా? లేక మరోసారి యుద్ధానికి దారితీస్తాయా? అన్నదే ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement