ఓవైపు హెచ్చరికలు, మరోవైపు శాంతి చర్చలు.. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా-ఇరాన్ సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్విట్జర్లాండ్‌లో జరిగిన తొలి విడత చర్చల అనంతరం 60 రోజుల్లో తుది శాంతి ఒప్పందానికి చేరుకోవాలనే రోడ్‌మ్యాప్‌ను ఇరు దేశాలు ఆమోదించాయి. ఖతర్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో.. ఇందుకు ఇరు దేశాల ప్రతినిధులు చేతులు కలపడం గమనార్హం.
స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో ఆదివారం జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు కీలక మలుపు తిరిగాయి. ఖతర్, పాకిస్తాన్ విడుదల చేసిన సంయుక్త ప్రకటన ప్రకారం.. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య నెలకొన్న ప్రధాన విభేదాలను పరిష్కరించేందుకు 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక (రోడ్‌మ్యాప్)పై ఇరు దేశాలు అంగీకరించాయి.
'ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం' (Islamabad MoU) కింద జరిగిన తొలి విడత చర్చలు సానుకూల, నిర్మాణాత్మక వాతావరణంలో జరిగాయని మధ్యవర్తి దేశాలు పేర్కొన్నాయి. తుది ఒప్పందానికి అవసరమైన అమలు విధానాలు, పర్యవేక్షణ వ్యవస్థ, నిబంధనల అమలు, పరస్పర బాధ్యతలపై ఇక నుంచి సాంకేతిక స్థాయి చర్చలు వెంటనే ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్నిఇటు ఇరాన్ సైతం ధృవీకరించింది.
Tireless Pakistani and Qatari mediation has delivered major progress to end Lebanon War. Oil and petrochem exports are waived, blockade lifted, some frozen assets released, and major reconstruction & development plan launched for Iran.
1st real test: Lebanon deconfliction cell https://t.co/q0okD2qwSO— Seyed Abbas Araghchi (@araghchi) June 22, 2026
చర్చల్లో మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. అపార్థాలు, ఉద్రిక్తతలు, అనుకోని ఘర్షణలు నివారించేందుకు అమెరికా-ఇరాన్ మధ్య నేరుగా సమాచార మార్పిడి వ్యవస్థ (డైరెక్ట్ కమ్యూనికేషన్ ఛానెల్) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చర్చల కాలంలో ఏవైనా సంఘటనలు చోటుచేసుకున్నా వాటిని వెంటనే పరిష్కరించేలా ఈ వ్యవస్థ పనిచేయనుంది.
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల సురక్షిత రాకపోకల అంశం కూడా ఈ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. హర్ముజ్‌లో భద్రత, నౌకాయాన స్వేచ్ఛను కొనసాగించేందుకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని అంగీకరించారు. అలాగే రాజకీయ స్థాయిలో మొత్తం మధ్యవర్తిత్వ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీకి ప్రధాన చర్చాకర్తలు తరచూ నివేదికలు సమర్పిస్తారు. అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షలు, పర్యవేక్షణ విధానాలు, వివాద పరిష్కార వ్యవస్థ వంటి అంశాలపై ప్రత్యేక వర్కింగ్ గ్రూపులు పనిచేయనున్నాయి.
లెబనాన్‌లో కాల్పుల విరమణ అమలును పర్యవేక్షించేందుకు అమెరికా, ఇరాన్, లెబనాన్ ప్రతినిధులతో కూడిన ప్రత్యేక 'డీ-కాన్ఫ్లిక్షన్ సెల్'ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి ఖతర్, పాకిస్తాన్ సౌకర్యదాతలుగా వ్యవహరించనున్నాయి.
ఈ చర్చల్లో అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్‌కాఫ్ పాల్గొనగా.. ఇరాన్ తరఫున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, ప్రధాన చర్చాకర్త మొహమ్మద్ బాఘేర్ ఘాలిబఫ్ హాజరయ్యారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ఖతర్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్ థానీ కూడా చర్చల్లో పాల్గొన్నారు. అంతకుముందు..
చర్చలు జరుగుతుండగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. దీంతో ఇరాన్ ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారని.. చర్చల నుంచి వాకౌట్ చేశారని.. అమెరికాకు కౌంటర్ వార్నింగ్ ఇచ్చారని కథనాలు వెలువడ్డాయి. అయినప్పటికీ చర్చల టేబుల్‌పై పురోగతి సాధించామని జేడీ వాన్స్ ప్రకటించారు. లెబనాన్‌లో కాల్పుల విరమణ కొనసాగించడం, ఇరాన్‌తో సంబంధాలను కొత్త దిశగా తీసుకెళ్లడంలో ముందడుగు పడిందని ఆయన పేర్కొన్నారు.
మొదటి విడత చర్చల్లో విభేదాలు, వాకౌట్‌లు, హెచ్చరికలు కనిపించినప్పటికీ.. చివరకు 60 రోజుల రోడ్‌మ్యాప్‌పై అంగీకారం కుదరడం శాంతి ప్రక్రియకు ఊరటనిచ్చే పరిణామంగా భావిస్తున్నారు. ఇప్పుడు ఈ 60 రోజులు అమెరికా-ఇరాన్ సంబంధాల భవిష్యత్తును నిర్ణయించే కీలక కాలంగా మారనున్నాయి.


