తేల్చకుంటే సర్వనాశనమే  | Donald Trump Warns Iran, Says They Could Be Left With No Country, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

తేల్చకుంటే సర్వనాశనమే 

Mar 31 2026 1:09 AM | Updated on Mar 31 2026 4:19 PM

Donald Trump warns Iran, they could be left with no country

ఇరాన్‌ త్వరగా ఒప్పందం కుదుర్చుకోవాలి 

లేదంటే చమురుక్షేత్రాలు మొదలు విద్యుత్‌ వ్యవస్థలదాకా అన్నింటినీ పేల్చేస్తాం

ఖర్గ్‌ ద్వీపాన్ని స్వా«దీనం చేసుకుంటాం 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అల్టిమేటం

ప్రతిదాడులను ఆపని ఇరాన్‌ 

కువైట్‌లోని విద్యుత్‌ ప్లాంట్‌పై దాడి 

ఇజ్రాయెల్‌ ఆయిల్‌ రిఫైనరీపైనా క్షిపణి దాడి 

అమెరికా బలగాలు కాలుమోపితే పర్షియన్‌ గల్ఫ్‌ను సముద్రమైన్లతో నింపేస్తాం 

ఇరాన్‌ హెచ్చరిక

దుబాయ్‌/వాషింగ్టన్: పశ్చిమాసియాలో రణజ్వాలలను ఉవ్వెత్తున ఎగదోసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సోమవారం ఇరాన్‌కు తీవ్రస్థాయి హెచ్చరికలతో అల్టిమేటం ఇచ్చారు. అత్యంత శుద్ధ యురేనియం నిల్వలను అప్పగిస్తూ, యుద్ధం నుంచి తప్పుకుంటూ శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని లేదంటే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తానని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’లో పలు పోస్ట్‌లు పెట్టారు. 

‘‘ఇరాన్‌లో మేం చేపట్టిన సైనిక చర్యలను తక్షణం ఆపేసే అంశంపై ఇరాన్‌ దేశ నూతన పాలక వర్గంతో విస్తృతస్థాయిలో సమగ్రంగా సహేతుకంగా చర్చలు జరుపుతున్నాం. చర్చల్లో అద్భుతమైన పురోగతి సాధించాం. కానీ ఏదైనా కారణంతో ఈ ఒప్పందం గనక సఫలీకృతంకాకపోతే ఇరాన్‌ అంతుచూస్తాం. సరుకు రవాణా నౌకల రాకపోకల కోసం హార్మూజ్‌ను తెరవకపోతే ఇన్నిరోజులు ఇరాన్‌ విషయంలో మేం చూపించిన సహనం మాలో చచ్చిపోతుంది.

 వెంటనే ఇరాన్‌లోని అన్ని చమురు క్షేత్రాలు, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు, ఆయిల్‌ రిఫైనరీలు, ఖర్గ్‌ ద్వీపంసహా ఉప్పునీటిని తాగు నీటిగా మార్చే డీశాలినైజేషన్‌ ప్లాంట్‌లనూ సర్వనాశంచేస్తాం. ఇరాన్‌ గత 47 ఏళ్ల ఉగ్రపాలనలో వేలాది మంది అమెరికన్‌ సైనికుల ప్రాణాలు తీసింది. వారి మరణాలకు తాజా దాడులతో మేం ప్రతీకారం తీర్చుకుంటాం’’అని ట్రంప్‌ హెచ్చరించారు.  

ఖర్గ్‌ను స్వాధీనం చేసుకోవచ్చేమో.. 
ఇరాన్‌ చమురు మౌలికరంగంలో గుండెకాయ అయిన ఖర్గ్‌ ద్వీపాన్ని స్వా«దీనం చేసుకునే ఆలోచన ఉందని ట్రంప్‌ ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘ఖర్గ్‌ ద్వీపాన్ని స్వా«దీనం చేసుకోవచ్చు. చేసుకోకపోవచ్చు కూడా. ఈ విషయంలో మాకెన్నో ఆప్షన్లు ఉన్నాయి. మా పంతం నెగ్గాలంటే ఖర్గ్‌ ద్వీపం మా అ«దీనంలో ఉంటే మంచిదేమో. దానిని కాపాడుకునే వ్యవస్థ ఏదీ ఇరాన్‌ వద్ద లేదు. సులభంగా స్వా«దీనం చేసుకుంటాం’’ అని ట్రంప్‌ అన్నారు.  

డిమాండ్లను తప్పుబట్టిన ఇరాన్‌ 
అమెరికా పంపిన 15 అంశాల డిమాండ్లను ఇరాన్‌ చెత్త ప్రతిపాదనలుగా అభివరి్ణంచింది. ‘‘గల్ఫ్‌ అరబ్‌ దేశాల్లోకి ఇప్పటికే అమెరికా సేనలు ప్రవేశించాయి. కానీ పర్షియన్‌ గల్ఫ్‌ సముద్రజలాల్లోకి అమెరికా సేనలు అడుగుపెడితే ఆ ప్రాంతం మొత్తాన్నీ సముద్ర మందుపాతరలతో నింపేస్తాం. అమెరికా పంపిన డిమాండ్లు అన్నీ అతిగా, అవాస్తవంగా, ఏమాత్రం హేతుబద్ధత లేకుండా ఉన్నాయి’’ అని ఇరాన్‌ విదేశాంగశాఖ అధికారప్రతినిధి ఇస్మాయిల్‌ బఘేల్‌ వ్యాఖ్యానించారు.  

పాక్‌ మధ్యవర్తిత్వం మాకొద్దు.. 
‘‘ఇప్పుడు నేరుగా అమెరికాతో చర్చలు లేవు. మధ్యవర్తుల ద్వారా కేవలం అసంబద్ధమైన ప్రతిపాదనలు వస్తున్నాయి. అమెరికా దౌత్యం మాటమాటకి మాటిమాటికీ మారుతోంది. మధ్యవర్తిత్వంపై అమెరికా పిల్లిమొగ్గలేస్తోంది. మేం స్థిరంగా ఒకే నిర్ణయంపై కట్టుబడి ఉన్నాం. పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు. ప్రాంతీయ పోరు ఆగాలనే పిలుపు మంచిదే. కానీ అసలే పోరు మొదలెట్టింది ఎవరు?’’ అని ముంబైలోని కాన్సులేట్‌ జనరల్‌ సోమవారం ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంలో ఎలాంటి చర్చలు జరగట్లేదు. అమెరికా బలగాల కోసం ఇరాన్‌ సైనికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాగానే కాల్చి బూడిదచేస్తాం. అమెరికా మిత్రదేశాలకూ ఇదే మా హెచ్చరిక’’ అని ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మొహమ్మద్‌ బఘేర్‌ ఖాలిబాహ్‌ అన్నారు.  

ఇరాన్‌ దాడుల పరంపర 
అమెరికా మిత్రదేశాలపై ఇరాన్‌ సోమవారం సైతం దాడులను కొనసాగించింది. కువైట్‌లోని జల, విద్యుత్‌ కేంద్రంపై బాంబుల వర్షం కురిపించింది. ఉత్తర ఇజ్రాయెల్‌లోని హైఫా సిటీలోని భారీ చమురు రిఫైనరీపై ఇరాన్‌ బాంబులేసింది. దీంతో మంటలు వ్యాపించి దట్టమైన పొగలు వెలువడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ అయ్యాయి. సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్‌పై క్షిపణులను ప్రయోగించగా ఐదింటిని గగనతల రక్షణవ్యవస్థలు కూల్చేశాయి. దుబాయ్‌లోనూ ఒక క్షిపణిని అడ్డుకున్నారు. ఇజ్రాయెల్‌ ప్రధాన అణు పరిశోధనా కేంద్రం మీదా ఇరాన్‌ దాడులుచేసింది.

 దీంతో ఆ ప్రాంతమంతా హెచ్చరికల సైరన్లతో మోగిపోయింది. అయితే ఇప్పటిదాకా అమెరికా, ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 1,900 మంది చనిపోయారని ఇరాన్‌ ప్రకటించింది. మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలోముగ్గురు ఐరాస శాంతివిభాగ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. బీరుట్‌ శివారు టైర్‌ ప్రాంతంపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో ఒక లెబనాన్‌ సైనికుడు చనిపోయారు. మరోవైపు ఇరాక్‌లోని మొహమ్మద్‌ అలా వైమానిక స్థావరంపై రాకెట్ల దాడి జరిగింది. ఈ దాడి తమ ఆంటోనోవ్‌–132 ఆర్మీ రవాణా విమానం ధ్వంసమైందని ఇరాక్‌ రక్షణ శాఖ తెలిపింది.

గగనతలాన్ని మూసేసిన స్పెయిన్‌ 
ఇరాన్‌పై దాడుల కోసం అమెరికా తమ గగనతలాన్ని వినియోగిస్తుండటంపై ఆగ్రహంతో ఉన్న స్పెయిన్‌ సోమవారం తమ ఎయిర్‌స్పేస్‌ను మూసేసింది. ‘‘సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనికస్థావరాలను యుద్ధం కోసం ఉపయోగించకూడదు. కానీ మా మాట అమెరికా వినట్లేదు. అందుకే మా గగనతలాన్ని మూసేస్తున్నాం. ఈ యు ద్ధం చట్టవ్యతిరేకం, అన్యాయం’’అని స్పెయిన్‌ రక్షణమంత్రి మార్గరీటీ రూబెల్స్‌ 
ప్రకటించారు.  

నేవీ చీఫ్‌ మరణాన్ని ద్రువీకరించిన ఇరాన్‌ 
ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌(ఐఆర్‌జీసీ)లోని నేవీ విభాగ సారథి అలీరెజా తంగసిరి ఇటీవల దాడుల్లో కన్నుమూశారని ఇరాన్‌ ఎట్టకేలకు అధికారికంగా ధ్రువీకరించింది. ఇరాన్‌ నేవీ రియర్‌ అడ్మిరల్‌ను గత గురువారమే అంతంచేశామని ఇజ్రాయెల్‌ ప్రకటించినా ఇప్పటిదాకా ఇరాన్‌ ధ్రువీకరించలేదు. ‘‘దాడుల్లో తీవ్రంగా గాయపడిన అలీరెజా అమరుడయ్యారు. దేశసేవలో అత్యున్నత త్యాగం చేశారు’’ అని ఇరాన్‌ నేవీ సోమవారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తంచేసింది.  

కువైట్‌లో భారతీయుని దుర్మరణం 
కువైట్‌లో సముద్రనీటిని మంచినీరుగా మార్చే డీశాలినైజేషన్‌ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఒక భారతీయుడు సోమవారం ఆ ప్లాంట్‌పై ఇరాన్‌ జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటిదాకా పశ్చిమాసియా యుద్ధ ఘటనల్లో చనిపోయిన భారతీయుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. ప్లాంట్‌లోని ఒక భవనం దెబ్బతినడంతో ఇతను చనిపోయాడని కువైట్‌ విద్యుత్, జల, పునరుత్పాదక ఇంధన శాఖ తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement