డీల్‌పై కీలక వ్యాఖ్యలు.. ఇరాన్‌ను మళ్లీ రెచ్చగొట్టిన ట్రంప్‌ | Donald Trump Key Comments On Iran Deal Warn Again | Sakshi
Sakshi News home page

డీల్‌పై కీలక వ్యాఖ్యలు.. ఇరాన్‌ను మళ్లీ రెచ్చగొట్టిన ట్రంప్‌

Jun 23 2026 7:43 AM | Updated on Jun 23 2026 10:39 AM

Donald Trump Key Comments On Iran Deal Warn Again

అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన తాత్కాలిక ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒప్పందంలోని నిబంధనలను ఇరాన్ పాటించకపోతే తాను అవసరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారాయన. ఈ క్రమంలో కాస్త ఘాటు హెచ్చరికలే జారీ చేశారు.

"ఇరాన్ తమ ఒప్పందానికి కట్టుబడి ఉండాలి. ఒప్పందం పట్ల వాళ్లు సక్రమంగా ప్రవర్తించాల్సిందే. లేకుంటే నేను చేయాల్సింది నేను చేస్తా. ఊరుకుంటానుకుంటే ఆ దేశం పొరపాటే" అని ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ.. గత వారం ట్రంప్‌, ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ తాత్కాలిక ఒప్పందం(MoU)పై డిజిటల్‌ సంతకాలు చేశారు. ప్రత్యక్ష చర్చల్లో భాగంగా.. మొన్న ఆదివారం ఇరాన్‌, అమెరికా, మధ్యవర్తిత్వ ప్రతినిధులు స్విట్జర్లాండ్‌లో చర్చలు మొదలుపెట్టారు. దీంతో 60 రోజుల్లో ఇరాన్‌-అమెరికా మధ్య ఒప్పందం కుదరాల్సి ఉంటుంది. 

అయితే.. స్విస్‌ చర్చలు జరుగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు ఇరాన్‌ను కవ్వించేలా మాట్లాడారు. ఒప్పందం కుదుర్చుకోకపోతే భీకర దాడులు.. అదీ గతంలో కంటే దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగానే ఇరాన్‌ ప్రతినిధులు చర్చల మధ్య నుంచి అర్ధాంతరంగా బయటకు వెళ్లిపోయినట్లు ప్రచారం జరిగింది. అదే సమయంలో ఇరాన్‌ అధికార ప్రతినిధులు ట్రంప్‌ వార్నింగ్‌పై సోషల్‌ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. ఈ తరుణంలో.. ఇప్పుడు ట్రంప్‌ ఇచ్చిన వార్నింగ్‌కు ఇరాన్‌ నుంచి కౌంటర్‌ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. 

నిధుల వినియోగంపైనా ఓ క్లారిటీ
ఇదిలా ఉంటే.. ఇరాన్‌కు చెందిన స్తంభింపజేసిన నిధులను విడుదల చేసే అంశంపై కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. విడుదలయ్యే డబ్బు మొత్తం అమెరికా నుంచే ఆహార పదార్థాల కొనుగోలుకు వినియోగించాల్సి ఉంటుందని చెప్పారు. "విడుదల చేసే డబ్బంతా తిరిగి అమెరికా రైతులకే చేరుతుంది. ఎందుకంటే ఆ నిధులతో ఇరాన్ అమెరికా నుంచి ఆహార ధాన్యాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సుమారు 9.1 కోట్ల జనాభాకు సరిపడా ఆహారాన్ని ఇరాన్ ఉత్పత్తి చేయలేకపోతోంది" అని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో ఇరాన్‌కు నిధుల విడుదల అనేది నేరుగా నగదు సాయం కాదని, నియంత్రిత వినియోగంతో కూడిన ఆర్థిక వ్యవస్థలో భాగమని అమెరికా సంకేతాలు ఇచ్చినట్లయ్యింది.

యుద్ధ ప్రభావం ఇంకా కొనసాగుతూనే..
అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు ఇరాన్ యుద్ధం ప్రపంచ మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. అయితే తాజా ఒప్పందం శాంతికి మార్గం వేస్తుందా? లేదంటే ఇరాన్ ఒప్పంద నిబంధనల అమలుపై కొత్త వివాదాలకు దారితీస్తుందా? అన్నది ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక చర్చగా మారింది.

ఇదీ చదవండి: ఇదెక్కడి ఫిట్టింగ్‌?.. పే చేయాల్సింది గల్ఫ్‌ దేశాలేనా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement