
డెడ్‌లైన్ ఆదివారం సాయంత్రం 6 గంటలు
హమాస్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్టిమేటం
గాజా స్ట్రిప్: గాజాలో శాంతి సాధన కోసం తాను ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక పట్ల హమాస్ మిలిటెంట్లు ఇంకా స్పందించకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6 గంటల్లోగా ఒప్పుకోవాలని అల్టిమేటం విధించారు. లేకపోతే నరకం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూపిస్తామని హమాస్‌ను హెచ్చరించారు. ఈ మేరకు ట్రంప్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు.
ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మొదలై ఈ నెల 7వ తేదీకి రెండేళ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని వెంటనే ముగించాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. ఇటీవలే 20 శాతం శాంతి ప్రణాళికను తెరపైకి తెచ్చారు. ట్రంప్ ప్లాన్‌ను ఇజ్రాయెల్ అంగీకరించింది. ప్రపంచ దేశాలు సైతం స్వాగతించాయి. హమాస్ మాత్రం ఇంకా స్పందించలేదు. ట్రంప్ ప్రణాళిక తమకు ఆమోదయోగ్యం కాదని, ఇందులో కొన్ని అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని పరోక్షంగా పేర్కొంది. అభ్యంతకర అంశాలపై చర్చించాల్సి ఉందని మధ్య వర్తులుగా వ్యవహరిస్తున్న ఈజిప్టు, ఖతార్ కూడా చెబుతున్నాయి.
మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పుతాం
గడువులోగా హమాస్ తమతో ఒప్పందానికి రావాల్సిందేనని ట్రంప్ స్పష్టంచేశారు. ఇదే ఆఖరి అవకాశంగా భావించాలన్నారు. ఒప్పందానికి రాకపోతే ఇప్పటిదాకా ఎవరూ చూడని నరకాన్ని హమాస్‌కు చూపిస్తామని ఉద్ఘాటించారు. మిలిటెంట్లపై పూర్తిస్థాయి సైనిక చర్య ప్రారంభమవుతుందన్నారు. ఒక మార్గంలో కాకపోతే.. మరో మార్గంలోనైనా మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పుతామని ట్రంప్ పేర్కొన్నారు. హమాస్‌ను పూర్తిగా అంతం చేస్తామన్న సంకేతాలిచ్చారు.