దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులు చేస్తాం | Donald Trump reviews new peace proposal from Iran | Sakshi
Sakshi News home page

దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులు చేస్తాం

May 4 2026 4:40 AM | Updated on May 4 2026 5:20 AM

Donald Trump reviews new peace proposal from Iran

ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరిక  

కొత్త ప్రతిపాదనను నిశితంగా పరిశీలిస్తున్నాం  

ఇది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని అనుకోవడం లేదు  

47 ఏళ్ల అకృత్యాలకు ఇరాన్‌ ఇంకా మూల్యం చెల్లించలేదని వ్యాఖ్య
 

వాషింగ్టన్‌: పశ్చిమాసియాలో తాత్కాలికంగా నిలిచిపోయిన యుద్ధాన్ని పూర్తిగా ముగించేందుకు ఇరాన్‌ నుంచి వచ్చిన తాజా ప్రతిపాదనను సమీక్షిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. ఒకవేళ ఇరాన్‌ గనక దురుసుగా ప్రవర్తిస్తే ఆ దేశంపై దాడులు మళ్లీ ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఆయన శనివారం ఫ్లోరిడాలోని పామ్‌ బీచ్‌ నుంచి మియామీ వెళ్తూ విలేకరులతో మాట్లాడారు. 

ఇరాన్‌తో శాంతి ఒప్పందం విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్‌ తప్పుగా ప్రవర్తిస్తే, ఏదైనా చెడు చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందన్నారు. ఇరాన్‌ పంపిన కొత్త ప్రతిపాదనను నిశీతంగా పరిశీలిస్తున్నానని, దానిపై మళ్లీ మీడియాతో మాట్లాడతానని తెలిపారు. ఈ కొత్త ఆఫర్‌ కూడా తనకు అంతగా నచ్చలేదని పరోక్షంగా సంకేతాలిచ్చారు.

 తర్వాత ట్రంప్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. గత 47 ఏళ్లుగా మానవాళిపై పాల్పడిన అకృత్యాలకు ఇరాన్‌ ఇంకా మూల్యం చెల్లించలేదని ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌ నూతన ప్రతిపాదన అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని తాను భావించడం లేదన్నారు. 

ఇరాన్‌కు పెద్ద శిక్ష పడాల్సి ఉందని తేల్చిచెప్పారు. అయితే, పశ్చిమాసియాలో శాంతి సాధన విషయంలో ఇరాన్‌ కొత్త ప్రతిపాదన ఏమిటన్నది ఆయన బయటపెట్టలేదు. ఈ ప్రపోజల్‌ను ఇరాన్‌ గురువారం అమెరికాకు పంపించినట్లు తెలిసింది. గతంలో ఇరాన్‌ చేసిన ప్రతిపాదనను ట్రంప్‌ తిరస్కరించి విషయం విదితమే. దానిపై తాను సంతృప్తిగా లేనని ఆయన తేల్చిచెప్పారు.  

బంతి అమెరికా కోర్టులోనే ఉంది: ఇరాన్‌  
నూతన ప్రతిపాదన పట్ల ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్‌ ప్రతిస్పందించింది. చర్చల ద్వారా పరిష్కారాన్ని కోరుకుంటారా? లేక యుద్ధానికి తిరిగి వెళ్తారా? అనేది అమెరికా ఇష్టమని తేల్చిచెప్పింది. ఇప్పుడు బంతి అమెరికా కోర్టులోనే ఉందని ఇరాన్‌ విదేశాంగ శాఖ ఉప మంత్రి కజెమ్‌ ఘరీబాబాదీ పేర్కొన్నారు. దౌత్య మార్గాన్ని ఎంచుకుంటారో లేక ఘర్షణను కొనసాగిస్తారో వారే నిర్ణయించుకోవాలని ఉద్ఘాటించారు. తన జాతీయ ప్రయోజనాలు, భద్రతను కాపాడుకోవడమే తమకు ముఖ్యమని స్పష్టంచేశారు. ఇరాన్‌ రెండు మార్గాలకు.. చర్చలకు లేదా యుద్ధానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు.  

ఏమిటీ కొత్త ప్రతిపాదన?  
అమెరికా చేసిన 9 పాయింట్ల ప్రతిపాదనకు ప్రతిస్పందనగా ఇరాన్‌ 14 పాయింట్లతో ఈ కొత్త ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. హార్మూజ్‌ జలసంధిని తిరిగి తెరవడం, గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లో అమెరికా దిగ్బంధనాన్ని ముగించడం, ఇరాన్, లెబనాన్‌లో యుద్ధానికి శాశ్వతంగా ముగింపు పలకడంపై ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్‌ ప్రతిపాదించినట్లు సమాచారం. 

ఆయా అంశాలపై చర్చలకు ఒక నెల గడువు విధించింది. అటువంటి ఒప్పందం కుదిరిన తర్వాతే అణు కార్యక్రమంపై మరో ఒప్పందానికి వచ్చేందుకు మరో నెల రోజులపాటు చర్చలు కొనసాగించాలని పేర్కొంది. భవిష్యత్తులో ఎలాంటి దాడులు చేయకూడదని, తమ భద్రతకు హామీ ఇవ్వాలని ఇరాన్‌ డిమాండ్‌ చేసింది. అణ్వాయుధాల అభివృద్ధిని నిలిపివేస్తామంటూ ఇరాన్‌ స్పష్టమైన గ్యారంటీ ఇవ్వలేదని సమాచారం. హార్మూజ్‌ను తెరుస్తామని, తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించే చర్యలపై దృష్టి సారిస్తామని ఇరాన్‌ వెల్లడించింది. 

అమెరికా ఈ ప్రాంతం నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని, తమ చమురు ఎగుమతులపై ఆంక్షలు సహా ఆర్థిక ఆంక్షలను తొలగించాలని షరతు విధించింది. సముద్ర వాణిజ్యం, చమురు సరఫరా పునరుద్ధరణను అణు కార్యక్రమాల చర్చల నుంచి వేరు చేయాలన్నదే ఇరాన్‌ వ్యూహమని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ నిబంధనల కింద తమ అణు కార్యక్రమ హక్కులను అధికారికంగా గుర్తించాలని ఇరాన్‌ కోరుతోంది. ఏ ఒప్పందమైనా శాశ్వతంగా ఉంటుందని, ఏకపక్ష ఉపసంహరణకు తావులేదన్న హామీలు ఇవ్వాలని అంటోంది.  

Advertisement
 
Advertisement
Advertisement